నేడే పరీక్ష
- వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు
- సెకను లేటైనా నో ఎంట్రీ
- కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు నిషేధం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం చేపట్టిన చర్యలను వివరించారు.
విశాఖలో 39 కేంద్రాల్లో వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది.
వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 కేంద్రాల్లో ఉంటుంది.
వీఆర్వోకు 41 పోస్టులకు 21,284, వీఆర్‌ఏ 12 పోస్టులకు 888 దరఖాస్తులు వచ్చాయి.
పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 39 మందిని, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు 43, పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులు 39, సహాయ పరిశీలకులుగా 74, ఇన్విజిలేటర్లుగా 996 మందిని నియమించారు.
10 రూట్లలో తహశీల్దార్లను లైజనింగ్ అధికారులుగా ఏర్పాటు చేశారు.
10 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
అన్ని కేంద్రాల్లో పరీక్షలను చిత్రీకరించేందుకు 42 మంది వీడియోగ్రాఫర్లను పెట్టారు.
పరీక్ష సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతీ కేంద్రం వద్ద అత్యవసర వైద్యం అందించేందుకు ఒక ఏఎన్‌ఎం, అవసరమైన ఔషధాలను సిద్ధం చేశారు.
తాగునీటికి ఇబ్బంది కలగకుండా వా టర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
ఆర్టీసీ బస్సులను ఉదయం 8 గంటల నుంచి ప్రతీ ప్రధాన కేంద్రాల నుంచి నడుపుతారు.
ఏజెన్సీ ప్రాంత మండలాల నుంచి హాజరయ్యే అభ్యర్థులకు శనివారం సాయంత్రం నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు.
అభ్యర్థులకు సూచనలు
పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరుకావాలి.
పరీక్ష కేంద్రానికి గంట ముందుగా ప్యాడ్, బ్లూ/బ్లాక్ పెన్ను తీసుకొని రావాలి.
పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అభ్యర్థులకు సరఫరా చేసే రెండు ఓఎంఆర్ షీట్లలో పరీక్ష పూర్తయిన తరువాత అసలు కాపీని ఇన్విజిలేటర్‌కు అందజేసి, నకిలీ కాపీని తమ వెంట తీసుకువెళ్లొచ్చు.
పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లేడులు, వైట్నర్, రబ్బర్‌లను తీసుకురాకూడదు.