వీఆర్వో.. వీఆర్‌ఏ నేడు పరీక్ష
- అన్ని ఏర్పాట్లూ పూర్తి
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- భారీ పోలీసు బందోబస్తు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఆదివారం జరగనున్న వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 127 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 64 వీఆర్‌ఓ పోస్టులకు 54 వేల 103 మంది, 403 వీఆర్‌ఏ పోస్టులకు 7,592 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు.
అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. వీఆర్వో పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు జరుగుతుంది. వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. వీఆర్వో పరీక్షకు 15 జోన్లు 38 రూట్లుగాను, వీఆర్‌ఏ పరీక్షకు ఒక జోన్ నాలుగు రూట్లుగా విభజించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 115 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు అర్బన్ తాలూకా కేంద్రం ఆవరణలోని ట్రెజరీలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి రూట్ అధికారులు ప్రశ్నపత్రాలను, ఓఎంఆర్ షీట్లను పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి, డీఆర్వో సుందరరాజు, సబ్‌కలెక్టర్ డి.హరిచందన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి నుంచి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు ఏమైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంలో అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 9290009918లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
విజయవాడలో 144వ సెక్షన్.. భారీ బందోబస్తు
రెవెన్యూ పరీక్షల సందర్భంగా ఆదివారం నాడు కమిషనరేట్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షలను పురస్కరించుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కట్టుదిట్టమైన భద్రత : కలెక్టర్
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేర్చేవరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. స్థానిక డివిజనల్ ట్రెజరీ కార్యాలయం స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన ప్రశ్నపత్రాల బండిళ్లను శనివారం ఆయన పరిశీలించారు. బండిళ్లపై ఉన్న కోడ్ నంబర్ల ఆధారంగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేర్చాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ మురళి, తహశీల్దార్ ఆర్.శివరావు ఉన్నారు.