అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం.. | - | Sakshi
Sakshi News home page

అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం..

Published Fri, Apr 19 2024 1:25 AM | Last Updated on Fri, Apr 19 2024 9:01 AM

- - Sakshi

ఆ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వసూళ్ల పర్వం

వసూళ్ల కోసం ప్రత్యేకంగా కమిటీ నియామకం

బిల్డర్లు, వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలే లక్ష్యం

కోట్లు వసూలు చేసి ఇల్లు చక్కబెట్టుకునే యత్నం

ఇప్పటికే బోలెడుడె నేషన్ల వసూలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్‌ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు.

విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్‌ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే.. రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం.

కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు..
జిల్లాలో హాట్‌ సీట్‌..ఇన్‌కం క్రియేట్‌ సీట్‌గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్‌ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్‌ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్‌లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్‌ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్‌నూ వాడుకుంటున్నారు.

గ్రామాల వారీగా ఎన్‌ఆర్‌ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్‌లు చేయించి ఫండ్‌ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్‌ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులకు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్‌ కోసం టార్గెట్‌ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు.

ఎన్‌ఆర్‌ఐల ఫండ్‌తోనే సీటు దక్కింది..
ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్‌ఆర్‌ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్‌కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని ఆయన టార్గెట్‌ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు.

గత ఎన్నికల్లో సైతం..
ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్‌ఆర్‌ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్‌ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్‌ఆర్‌ఐల ఫండ్‌ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్‌ఆర్‌ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు.

కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్‌లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్‌లో దోపిడీ ఉంటే.. పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి చదవండి: నామినేషన్ల పర్వం షురూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement