మేతకొచ్చాడు.. మరో నేత! | Sakshi
Sakshi News home page

మేతకొచ్చాడు.. మరో నేత!

Published Fri, May 10 2024 11:16 AM

The People Of Yarragondapalem Constituency Are Reminding TDP Corruption

టీడీపీ జమానాలో ప్రజా ధనాన్ని పచ్చికలా మేసిన పచ్చ నేతలు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు తెగబడిన తెలుగు తమ్ముళ్లు

నీరు–చెట్టు, భూదందాలు, కమీషన్ల రూపంలో రూ.కోట్లు గడించిన వైనం

వైపాలెం నియోజకవర్గంలో టీడీపీ అవినీతిని గుర్తు చేసుకుంటున్న జనం  

యర్రగొండపాలెం: ‘టీడీపీ జమానా.. అవినీతి ఖాజానా’ అని కమ్యూనిస్టులు ఓ పుస్తకమే అచ్చేశారు గుర్తుంది కదా.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ నేతల అవినీతి దందా ఎలా సాగుతుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అడ్డగోలు హామీలతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థులు ఓడిన చోట ‘త్రీ మెన్‌ కమిటీ’లకు పెత్తనం అప్పగించడం ద్వారా దుస్సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజును సంతలో పశువులా కొనుగోలు చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి చెలరేగారు. నీరు–చెట్టు పనుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు. టీడీపీకి మళ్లీ ఓటేస్తే ఇప్పుడొచ్చిన నేత ఇంకెంత మేస్తాడోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

టీడీపీ జమానాలో పచ్చ నేతల అవినీతి దందాను కళ్లారా చూసిన వైపాలెం నియోజకవర్గ ప్రజలు.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకెంత దోచేస్తారో అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారులను కీలు»ొమ్మలుగా మార్చి జన్మభూమి కమిటీలతో సాగించిన అరాచకాలను మరోమారు మననం చేసుకుంటున్నారు. పథకం ఇవ్వాలంటే లంచం, పని కేటాయించాలంటే కమీషన్, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసి సొమ్ము చేసుకోవడం ద్వారా టీడీపీ నాయకులు రూ.కోట్లు గడించారు.

నీరు–చెట్టు పనులకు అంచనాలు వేసే సమయంలోనే 25 శాతం కమీషన్‌ అందేలా టీడీపీ నేతలు పక్కాగా స్కెచ్‌ వేసినట్లు ఆరోపణలున్నాయి. 2015–17 మధ్య యర్రగొండపాలెం నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద 1235 పనులకు రూ.51.51 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో సుమారు రూ.43.5 కోట్లతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. దాదాపు రూ.95 కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టిన టీడీపీ నాయకులు.. అందులో 25 శాతం అంటే రూ.28 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి సుమారు రూ.15 కోట్ల వరకు టీడీపీ నేతలు కొల్లగొట్టారు.

నీరు–చెట్టులో నిధుల గోల్‌మాల్‌..
యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువులో నేషనల్‌ హైవే కాంట్రాక్టర్‌ అధికారికంగా మట్టి తవ్వుకోగా ఏర్పడిన గోతులను టీడీపీ నాయకులు నీరు చెట్టులో చేసినట్లు చూపి ఏకంగా రూ.60 లక్షల బిల్లు పొందారు. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్న చెరువులో పనులు చేపట్టకుండా మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు రూ.10 లక్షలు కాజేశారు. ఇదే పద్ధతిలో మండలంలో 26 మంది టీడీపీ నాయకులు పనులు చేయకుండానే బిల్లులు పొందారు. పెద్దారవీడు మండలంలో దేవరాజుగట్టు చెరువులో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి తరలించకుండా అక్కడే కట్టగా పోసి బిల్లు పొందారు. పెద్దదోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లోని చెరువుల్లో కూలీలతో పనులు చేయించాల్సిన చోట యంత్రాలను ఉపయోగించి బిల్లుల రూపంలో ప్రభుత్వ సొమ్ము దిగమింగారు.

భూములు కాజేసిన పచ్చ గద్దలు!

  • వైపాలెంలోని టోల్‌ప్లాజా పరిసరాల్లోని అగ్రహారం భూములపై కన్నేసిన టీడీపీ నాయకులు రికార్డుల్లో పూర్వీకుల పేర్లు ఎక్కించుకుని రైతులను నిలువునా ముంచారు. అప్పటి పుల్లలచెరువు టీడీపీ మండల అధ్యక్షుడు కబ్జా చేసిన భూమి విల్లు ఇప్పుడు రూ.2 కోట్లకు పైమాటే. కొందరు అక్రమార్కులు కబ్జా చేసిన భూములను సత్య ఫిష్‌ కంపెనీకి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ భూములకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.

  • పుల్లలచెరువు మండలంలో టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. బోగస్‌ పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు రుణాలుగా పొందారు. పుల్లలచెరువులో సర్వే నెంబర్‌ 887–2 లో 0.86 సెంట్ల ప్రభుత్వ భూమిని టీడీపీ మండల నాయకుడు తన పేరుపై ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. మర్రివేముల సర్వే నెంబర్‌ 80లో 136 ఎకరాల అటవీ భూమిని 8 సబ్‌డివిజన్లు చేసి దాదాపు 30 ఎకరాలు కబ్జా చేశారు. ఐటీవరంలో సర్వే నంబర్‌ 991లో కొండపోరం బోకు భూమి 60 ఎకరాలను నలుగురు టీడీపీ నేతలు కబ్జా చేసి పాస్‌ పుస్తకాలు పొందారు. శతకోడు సర్వే నంబర్‌ 439లో భూమినీ కబ్జా చేశారు.

  • త్రిపురాంతకం మండలం నర్శింగాపురం పరిధిలో రైతులకు చెందిన 118 ఎకరాల భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో పాలుట్ల రమణమ్మ పేరుపై ఆన్‌లైన్‌ చేసి ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద్దమీరం గ్రామానికి చెందిన మీగడ వీర సత్య పేరుపై ఆన్‌లైన్‌ చేశారు.

  • టీడీపీ నేతల భూదాహానికి అప్పటి పెద్దారవీడు, పెద్దదోర్నాల తహసీల్దార్లు సహా ఐదుగురు వీఆర్వోలు సస్పెండయ్యారు.

ఇవి చదవండి: డీబీటీ లబ్దిదారులతో టీడీపీ ముఠా చెలగాటం

Advertisement
 
Advertisement