పరీక్షకు వేళాయె..
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు
మొదటి రోజు 8.15 గంటలకే హాజరుకావాలి
మహారాణిపేట (విశాఖపట్నం): రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ తులసీదాస్‌తో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 262 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 62వేల 661మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 13 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 29 సిటింగ్ స్క్వాడ్‌లు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయని తెలిపారు. విద్యార్థులు యూని ఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. బస్సు సౌకర్యం ఉ న్న ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఉచితంగా రెండు వైపులా ప్రయాణించవచ్చన్నారు. పరీక్షల కోసం నియమించిన ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు హాజరుకావాలని హాజరుకానివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరింత మెరుగైన ఫలితాలకు కసరత్తు
పదో తరగతి పరీక్షల్లో ఐదేళ్లుగా మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ రాష్ర్ట స్థాయిలో మాత్రం ఆశించిన స్థానం లభించలేదు. గతేడాది ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన పరీక్షల్లో 90.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా పదకొండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జరుగుతున్న పరీక్షలకు ప్రత్యేకత ఉంది. విభజన నేపథ్యంలో 13 జిల్లాలతో కూడిన ఏపీలో తొలిసారి జరుగుతున్న పరీక్షలు కావడంతో జిల్లా ర్యాంకును మెరుగుపర్చుకోవాలని జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేసింది. పైగా రాష్ర్ట మానవవనరుల (విద్యా) శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ జిల్లాకు చెందిన వారుకావడంతో జిల్లా అధికారులకు ఈ పరీక్షలు నిజంగానే పరీక్షగా మారాయి.హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పాఠశాలలు నెల రోజులు మూతపడినప్పటికీ నవంబర్ నుంచి మార్చి వరకు ఆదివారాలు, పండగ, రెండో శనివారాల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్రాల్లో చూసిరాతకు పాల్పడకుండా వీడియో కెమెరాలు, వెబ్‌కెమెరాలు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. హాల్‌టికెట్లు అందని వారు ‘డబ్యూడబ్యూడబ్యూ. బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత పాఠశాల హెచ్‌ఎం సంతంకం, స్కూల్ స్టాంప్‌తో పరీక్షకు హాజరుకావచ్చు.
144 సెక్షన్ అమలు: ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో సిటింగ్ స్క్వాడ్లు వేశారు. స్థానిక తహశీల్దార్లు, డిప్యూటీ డీఈఓలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలతో పాటు తాగునీరు ఏర్పాటు చేశారు. మెడికల్ కిట్‌తో సహా ఏఎన్‌ఎంను నియమిం చారు.పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్‌స్టేషన్ల ద్వారా ప్రశ్నపత్రాలు : జిల్లాలో మొత్తం 262 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను 76 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మైదాన ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, ఏజెన్సీలో కేంద్రాలకు 76 పోలీస్‌స్టేషన్లు ద్వారా ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను పోలీస్‌లే దగ్గరుండి తీసుకొని పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లాలో 29 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఇవి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి సమస్యాత్మక కేంద్రంలోనూ వెబ్‌కెమెరాలు ఏర్పాటుచేశారు.
విద్యార్థులకు సూచనలు: బార్‌కోడింగ్ విధానం అమల్లో ఉండడం వల్ల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు గురువారం పరీక్షా కేంద్రాలకు ఉదయం 8-15కే చేరుకోవాలని డీఈవో సూచించారు. మిగతా రోజుల్లో 8-45కు చేరుకోవాలని ఆయన వెల్లడించారు. పెన్నులు, రైటింగ్‌ప్యాడ్‌లు, పరీక్షకు అవసరమైన వస్తువులు విద్యార్థులు తెచ్చుకోవాలి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
కంట్రోల్‌రూం ఏర్పాటు : పదోతరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎవరైనా 9180330984 నంబరుకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా సమాధానం చెప్పేందుకు కంట్రోల్‌రూంలో ఆరుగురుని నియమించారు.