కోడ్ ఉల్లంఘనలపై ఓటర్ల కోసం సీ–విజిల్ యాప్
ఆడియోలూ అప్‌లోడ్ చేసే అవకాశం
గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గంటన్నరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదుపై సమగ్ర నివేదిక
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్‌లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు
ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తే చాలు..
సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్‌లోడ్ చేయవచ్చు.
అత్యంత వేగంగా స్పందన
సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అప్‌లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు
గంట వ్యవధిలోనే..
► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు.
►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది.
► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది.
►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు.
►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి..
►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది.
► ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
► ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్‌లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు.
► యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది.
► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment