ఈ యాప్ ద్వారా టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది
డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోంది
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదులు
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన ‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. ఈ యాప్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం ‘వుయ్ యాప్’పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే టీడీపీ ప్రత్యేకంగా ‘వుయ్ యాప్’ను రూపొందించిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే టీడీపీ వుయ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం, డీజీపీలకు వైఎస్సార్‌సీపీ ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ యాప్ పేరిట టీడీపీ అక్రమాలు కొనసాగుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ బాపట్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి..
⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం, ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా టీడీపీ ‘వుయ్ యాప్’ను రూపొందించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది.
⇒ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, వయసు, చిరునామా, కులం, మతం, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆ యాప్‌లో పొందుపరిచింది. తద్వారా ఓటర్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోంది.
⇒ ఓటర్ల కదలికలను నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ చేస్తూ వారి భద్రతకు ముప్పు తెస్తోంది.
⇒ ప్రత్యేకంగా బార్ కోడ్‌లను ముద్రించిన ఓటరు స్లిప్పులు, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తోంది. అనంతరం నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment