Voters lists
-
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,99,74,919
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 2,99,74,919 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చోటు పొందిన యువ ఓటర్లు 2,78,650 మంది ఉండటం విశేషం. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్)–2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. సాధారణ ఓటర్లకు ఎన్ఆర్ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు (కేంద్ర సాయుధ బలగాలు) 15,282 మంది కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన శాసనసభ ఎన్నికలను ఈ జాబితాతోనే నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమం కావడంతో ఎన్నికల ప్రకటన నాటికి జాబితాలో స్థానం పొందే కొత్త ఓటర్లకు సైతం ఓటు హక్కును కల్పించనున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో... వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా గతేడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన 2023 వార్షిక ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. గతేడాది తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత నిరంతర నవీకరణ చేపట్టారు. ఒకే తరహా ఫొటోలు కలిగిన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి తొలగించారు. మొత్తం 11,36,873 ఓటర్లను తొలగించగా, కొత్తగా 3,45,648 ఓటర్లను చేర్చారు. దీంతో ఓటర్ల జాబితా సవరణ 2023లో భాగంగా గత నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,65,669కు తగ్గింది. ఆ తర్వాత కొత్తగా 6,84,408 మందికి చోటు కల్పించగా, 2,72,418 మంది ఓటర్లను తొలగించారు. దీంతో తాజాగా ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో సాధారణ ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో... మారుమూల గిరిజన ప్రాంతంలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది 2,800 మంది గిరిజనులు తొలిసారిగా ఓటు హక్కును పొందారు. 361 గిరిజన ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించి కొలామ్స్, తోటి, చెంచులు, కండారెడ్డి తెగల గిరిజనులకు ఓటు హక్కు కల్పించారు. సదరం డేటాబేస్, ఆసరా పెన్షన్ల సమాచారాన్ని వికలాంగ ఓటర్ల నమోదుకు వినియోగించారు. ముందస్తుగా ఓటర్ల నమోదులో భాగంగా 17 ఏళ్లు నిండిన 20,246 మంది యువతీయువకుల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించారు. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు. ఇంకా నమోదు చేసుకోవచ్చు: సీఈఓ వికాస్ రాజ్ ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమమని, తుది జాబితాలో చోటుపొందని వారు మళ్లీ దరఖాస్తు చే సుకోవచ్చు. ఎన్వీఎస్పీ వెబ్‌పోర్టల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా తమ దరఖాస్తును స్థానిక బీఎల్ఓకు అందజేస్తే అర్హులకు ఓటు హక్కు కల్పిస్తాం. -
Telangana: రాష్ట్రంలో 3 కోట్ల మంది ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,52,57,690 మంది పురుషులు, 1,50,97,292 మంది మహిళలు, 1,683 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 13,965 మంది పురుషులు, 538 మంది మహిళలు కలిపి మొత్తం 14,503 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 5,01,836 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లున్నారు. ఈ నెల 30 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2022 జనవరి 1 అర్హత తేదీగా ఆ నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20 నాటికి పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 6న హుజూరాబాద్ ముసాయిదా జాబితా.. రాష్ట్రంలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 115 నియోజకవర్గాల ముసాయిదా జాబితాలు మాత్రమే ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ స్థానానికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. డిసెంబర్ 6 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 27లోగా పరిష్కరించనున్నారు. 115 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి హుజూరాబాద్ స్థానం తుది ఓటర్ల జాబితాను వచ్చే జనవరి 5న ప్రకటిస్తారు. -
కమిషనర్ సరెండర్
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్) : బల్దియా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌పై వేటు పడింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన తదితర అంశాలలో తప్పిదాలు కారణంగా ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన జాబితాల్లో పొరపాట్లు, అక్రమాలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించారు. అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత 10 రోజులుగా కమిషనర్ విధుల నిర్వహణ విషయంలో అలసత్వం వహించడం, స్పందించక పోవడం, అక్రమాలు జరిగినా పట్టించుకోక పోవడంతో కలెక్టర్ ఆయనపై వేటు వేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జి కమిషనర్‌గా జెడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రునాయక్‌కు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన శనివారం రాత్రి బాధ్యతలను స్వీకరించారు. అలాగే, ఎన్నికల నిమిత్తం కామారెడ్డి మున్సిపాలిటీకి నోడల్ అధికారిగా ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి సాయన్నను నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 10 వార్డులకు ఒక అధికారిని సూపర్వైజర్గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం వీరంతా బాధ్యతలను స్వీకరించారు. గత మార్చి 2వ తేదీన కమిషనర్‌గా కామారెడ్డికి వచ్చిన ప్రభాకర్ మొదటి నుంచి పాలనలో నిర్లక్ష్యం వ్యవహరించాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. హుటాహుటిన అధికారుల నియామకం కామారెడ్డి మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా జెడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రునాయక్‌ను, ఎన్నికల నోడల్ అధికారిగా జిల్లా ఇన్చార్జీ పంచాయతీరాజ్ అధికారి సాయన్నను నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పట్టణంలోని 49 వార్డులకు సూపర్వైజర్లుగా అధికారులను నియమించారు. కామారెడ్డి తహసీల్దార్ రాజేంద్రన్ 18, 19, 30, 35, 42, 43, 44, 45, 46, 47 వార్డులకు, ఎంపీడీవో నాగేశ్వర్రావును 1, 2, 3, 32, 33, 29, 37, 38, 48, 49 వార్డులకు, టీపీవో శైలజను 25, 26, 31, 36, 40, 41, 39, 34, 27, 28 వార్డులకు, డీఈ వాసుదేవరెడ్డిని 4 నుంచి 13 వార్డుల వరకు, మున్సిపల్ మేనేజర్ నజీర్‌ను 14 నుంచి 24 వార్డులకు సూపర్వైజర్ అధికారులుగా నియమించారు. ఇక 49 వార్డులకు సంబంధించి ఈ అధికారులు ఎలాంటి తప్పిదాలు లేకుండా జాబితాలు సిద్ధం చేయాలని, ఎన్నికలు సజావుగా జరిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గందరగోళంగా జాబితాలు, ఫిర్యాదుల వెల్లువ మున్సిపల్ ఎన్నికలను షరవేగంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్, సీడీఎంఏ, ప్రభుత్వ ఆదేశాలతో అగ మేఘాల మీదా షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ అధికారులు జాబితాలను ప్రకటించాల్సి వచ్చింది. అయితే, కమిషనర్ వ్యవహార శైలి, నిర్లక్ష్యం కారణంగా చాలా తప్పిదాలు దొర్లాయి. వార్డుల విభజన, ఓటర్ల ఇంటిం టా సర్వే, కులాల వారీగా ఓటర్ల సర్వే జాబితాలో చాలా తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శుక్ర, శనివారాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందో ళనకు దిగారు. తప్పిదాలను వెలికి తీశారు. ఈ విషయంలో కమిషనర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. మరోవైపు, కమిషనర్ ఉన్నతాధికారుల ఫోన్లు సైతం లేపక పోవడం మరింత ఆగ్రహానికి గురి చేసింది. రాజకీయ పక్షాలు, ప్రజల పక్షాన తరపున ఫిర్యాదులు, అభ్యంతరాలు రావడంతో కలెక్టర్ హుటా హుటిన స్పందించారు. బల్దియాలో చాలా మా ర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కమిషనర్ అనారోగ్యం గా ఉన్నాడని పలువురు అధికారులు తెలిపారు. అయితే, ప్రధానంగా ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం చేస్తే చాలా మార్పులు చోటు చేసుకుంటాయనే భావనతో కమిషనర్ ప్రభాకర్‌ను సరెండర్ చేశారు. మార్పులు జరిగేనా? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితాను నేడు (ఆదివారం) వెల్లడించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో తప్పిదాలను ఏ మేరకు సరి చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. పట్టణంలో వేలాది మంది ఓట్లు గల్లంతయ్యాయని, కొందరు ఓటర్లను సంబంధం లేని వార్డులో కలిపారని, ఇతర కులాలను సంబంధం లేని కులాల్లో చేర్చినట్లు జాబితాల్లో స్పష్టమవుతోంది. మరి అధికారులు ఏ మేరకు సరి చేస్తారో వేచి చూడాలి. -
ఓటుపై ‘ఇంటెన్సివ్’ వేటు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో శుక్రవారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. వేలాదిమంది ప్రజలు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ‘నా ఓటు ఏమైంది’ (#whereismyvote) అని ప్రశ్నిస్తూ ప్రచారోద్యమం నిర్వహించారు. జాబితాలో పేర్లు గల్లంతైన వేలాదిమంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను వినియోగించి తమ నిరసన తెలియజేయడంతో ట్విట్టర్లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా శుక్రవారం ఈ ప్రచారోద్యమం నిలిచింది. 2014 సాధారణ ఎన్నికలు, 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, తాజా శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు గల్లంతైందని చాలామంది జంట నగరాల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పేరుతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2017లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమమే ఇందుకు కారణం. బూత్‌స్థాయి అధికారుల (బీఎల్వో)కు ట్యాబ్లెట్ పీసీలు చేతికిచ్చి ఈ 36 నియోజకవర్గాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ఈ స్థానాల్లో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా సర్వే అనంతరం ఏకంగా 24,20,244(22.11శాతం) ఓట్లను తొలగించారు. మరో 29,93,777(27.35 శాతం) ఓటర్లు తమ ఓట్లను కొత్త చిరునామాలకు బదిలీ చేసుకున్నారు. సర్వే తర్వాత 55,30,947 (50.53శాతం) ఓట్లు మాత్రమే ఉన్న చిరునామా ల్లోనే మిగిలాయి. ఈ సర్వేలోనే కొత్తగా 5,82,138 (6.4శాతం) ఓట్లను చేర్చారు. ఈ సర్వే ముగిసిన తర్వాత చివరికి 91,06,862 ఓట్లు జాబితాలో మిగిలాయి . ఈ వివరాలను నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) అనూప్‌సింగ్ 2017 డిసెంబర్ 5న విలేకరుల సమావేశంలో ప్రకటించారు. విచారణ జరపని ఎన్నికల సంఘం ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాక త్పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లలో ఈ సర్వే జరిగింది. ఈ 36 నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను గత జనవరి 20న ప్రకటించారు. ఐఆర్‌ఈఆర్ పేరుతో నిర్వహించిన ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దొంగ ఓట్ల పేరుతో సరైన విచారణ లేకుండానే అడ్డగోలుగా ఓట్లను తొలగించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించకుండానే ఓట్లను తొలగించినట్లు విమర్శలున్నాయి. అయినా, తొలగించిన ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం విచారణ నిర్వహించకపోవడంతో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్షలమంది ఓట్లు గల్లంతు అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోని లోపాలపట్ల చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా ఎన్నికల సంఘం ముందు నుంచి మొండిగా వ్యవహరించిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యువలోకం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ‘నేటి యువతీ, యువకులే దేశానికి మార్గనిర్దేశకులు... దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే సమర్థులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకంగా ఉండాలి... అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది..’ ఇదంతా అందరూ చెప్పేదే. అయితే, ఇది జరగాలంటే ఓటరుగా యువతీ, యువకులందరూ నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఈమేరకు 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నమోదు చేయించేలా అధికారులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు. అవగాహన కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో అధికారులు విస్తృత ప్రచారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ పదేపదే అవకాశం కల్పిస్తున్నా యువత ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశమే అయినా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కమిషన్ ఆదేశాలతో... నూతన ఓటర్ల నమోదుకు అవకాశమున్న విషయమై ప్రచారం చేయాలని ఇప్పటికే పలు సమావేశాలు, సమీక్షల ద్వారా జిల్లాలోని అధికార యంత్రాన్ని ఎన్నికల కమిషన్ అలర్ట్ చేసింది. కమిషన్ అధికారులు పలు సమీక్షల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే ఓ వైపు ఓటర్ల జాబితాల రూపకల్పనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయడంతో పాటు నిరేర్దేశించిన షె డ్యూల్ మేరకు అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇం దులో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కాగా, అక్టోబర్ 4న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. విస్తృత ప్రచారం జిల్లాలో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులతో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ఇప్పటికే అవగాహన కల్పించారు. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ చైతన్యపరిచి ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం బూత్ లెవల్లో, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో, ఆన్లైన్లో గానీ ఓటరుగా నమోదు చేసుకునేలా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్ విద్యార్థులతో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రచార రథాలను జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించగా.. బస్టాండ్లు, ఆస్పత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటుచేసి సిబ్బంది ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రచారం చేస్తున్నారు. నమోదు ఇలా... 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు. గ్రామంలోని బూత్‌లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి. మీ సేవా కేంద్రాల్లో లేదా స్వయంగా ఆన్లైన్లో ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. -
ఇకపై ఓటు నిర్ధారణ
ఆదిలాబాద్ అర్బన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ జిల్లా అంతటా ఉత్కంఠ వాతావరాణాన్ని నెలకొల్పుతోంది. ప్రభుత్వ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా వచ్చినా.. షెడ్యూల్ ప్రకారం వచ్చినా.. ఎన్నికల సంఘం నిర్వహణకు సిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితా రూప కల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినా గడువులోగా పూర్తి చేయడంతో పాటు ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల వినియోగం, తదితర ఏర్పాట్లపై ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి జరబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కొత్తగా ‘వీవీ ప్యాట్’ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైయిల్)లు వినియోగించనున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగించడం ఇదే మొదటిసారి.. ఇదిలా ఉండగా, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ సెప్టెంబర్ 1న ఫొటో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. జిల్లాలో తొలిసారిగా వినియోగం.. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,78,715 ఓటర్లు ఉండగా, బోథ్ నియోజకవర్గంలో 1,73,915 మంది ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 25 వరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రక్రియ ద్వారా జిల్లా వ్యాప్తంగా 45 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పట్టణంలోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1400 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకోగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేశారు. ఈ లెక్కన జిల్లాలో 518 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక జిల్లాలో ఈసారి జరబోయే ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగించనున్నారు. ఈ వీవీప్యాట్లు జిల్లాలోని అన్ని ఈవీఎంలకు అనుసంధానం చేసి వినియోగించనున్నారు. ఒక్కో ఈవీఎంకు ఒకో వీవీప్యాట్ మిషన్ వినియోగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఈవీఎంల పునర్విభజన జరగలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,333 ఈవీఎం మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈవీఎంల పునర్విభజన జరిగిన తర్వాత ఇతర జిల్లాలకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్ మిషన్లను అందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీవీ ప్యాట్ పని చేస్తుందిలా.. ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16,333 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. అంతే మోతాదులో ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్లు) సిద్ధం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రశీదు ఇచ్చే విధా నం జిల్లాలో తొలిసారిగా అమల్లోకి రానుంది. ఓటరుకు రశీదు ఇచ్చే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు మొదటిసారిగా రశీదు పరికరాలను అమర్చనున్నారు. అయితే ఈ వీవీప్యాట్ మిషన్లు అర్బన్ ఏరియాలో 1400 ఓటర్లను, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లను మాత్రమే నమోదు చేసుకొని ఓటరుకు రశీదులు ఇవ్వగలుగుతాయి. ఆ మిషన్‌లో అన్ని ఓటర్లకు మాత్రమే సరిపడా ప్రింటింగ్ పేపర్ అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు... ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఈవీఎం మిషన్ దగ్గరకు వెళ్లాడనుకుందాం.. అతను ఈవీ ఎంపై సదరు గుర్తు గల బటన్‌పై ప్రెస్ చేస్తారు.. ఏ గుర్తుకు అయితే మనం ఓటేశామో మరుక్షణం ఆ గుర్తు ఏడు సెకండ్ల పాటు వీవీ ప్యాట్ మిషన్‌లో రశీదు రూపంలో కన్పించి కింద ఉన్న బాక్సులో పడిపోతుంది. ఆ రశీదును మనం తీసుకునేం దుకు వీలుండదు కానీ.. ఓటు ఏ గుర్తుకు వేశామో నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఓటర్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు పనిచేయకపోతే వీవీప్యాట్ రశీదులను బ్యాలెట్ బాక్సులుగా లెక్కగట్టి కౌంటింగ్ చేస్తారు. వచ్చే నెలలో శిక్షణ.. జిల్లాలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వినియోగించనున్న వీవీప్యాట్ల గురించి వచ్చే సెప్టెంబర్ నెలలో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా ఎలక్టోరల్ అధికారి సంధ్యారాణి ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగిన వీవీప్యాట్ల శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం సైతం ముందస్తుకు వెళ్తున్న నేపథ్యంలో సదరు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా వీవీప్యాట్ల వినియోగం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రారంభించే అవకాశం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీవీ ప్యాక్ (ఓటు రశీదు పరికరం) ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈవీఎం మిషన్ ద్వారా ఓటు ఏ గుర్తుకు వేశారో సరిచూసుకోవచ్చు. దీనిని జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించనున్నాం. దీనిపై త్వరలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో సరిపడా ఈవీఎంలకు సరిపడా వీవీ మిషన్లను సమకూర్చుతాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – సంధ్యారాణి, జిల్లా జాయింట్ కలెక్టర్, ఆదిలాబాద్ -
ఓటర్ల జాబితాలో ఆధార్ సంఖ్య ముద్రించ వద్దు
సుప్రీం ఆదేశాల నేపధ్యంలో అప్రమత్తం సీఈఓ భన్వర్‌లాల్ కడప సెవెన్‌రోడ్స్ : ఓటర్ల జాబితాలు, ఓటరు స్లిప్పులలో ఆధార్ సంఖ్యలు ముద్రించవద్దని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలను ఆధార్‌తో సీడింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితాలను ఫ్యూరిఫై చేయడం కోసమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్, బ్యాంకు ఖాతా, వాహనాల నమోదు, డ్రైవింగ్ లెసైన్స్‌లు, పెన్షన్లు లాంటి ప్రతి పనిని ఆధార్‌తో లింకు పెడుతోంది. ప్రభుత్వం నుంచి సేవలు, రాయితీలు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదని రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ప్రతి దాన్ని ఆధార్‌తో లంకె పెడుతోంది. ఈ విషయమై ఇటీవల సుప్రీం కోర్టు మండిపడుతూ తమకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితాల్లో ఆధార్ సంఖ్య ముద్రిస్తే సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడ్డ సీఈఓ వెంటనే మేల్కొని ఆధార్ సంఖ్యలో ముద్రించవద్దంటూ ఇచ్చిన ఆదేశాలు శనివారం కలెక్టరేట్‌కు వచ్చాయి. అయితే, అధికారుల డేటా బేస్‌లో మాత్రమే ఓటర్ల పేరు పక్కన వారి ఆధార్ సంఖ్య ఉంటుంది. ఇందువల్ల ఓటింగ్ సమయాల్లో అక్రమాలు జరగకుండా చూడగలుగుతామని అధికారులు అంటున్నారు. ఆధార్ సీడింగ్‌లో రెండవ స్థానంలో జిల్లా.. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కడపజిల్లా రెండవస్థానంలో ఉంది. జిల్లాలో 21,71,522 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 20,80,850 (95.8 శాతం) మందికి ఆధార్ సీడింగ్ నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక బద్వేలులో 99.84 శాతం, కమలాపురంలో 99.79 శాతం, రాజంపేటలో 99.72 శాతం, జమ్మలమడుగులో 99.70 శాతం ఆధార్ సీడింగ్ నిర్వహించారు. వందశాతం ఆధార్‌సీడింగ్ 34 మండలాల్లో జరిగింది. 99 శాతం కంటే ఎక్కువ ఆధార్ సీడింగ్ జరిగిన మండలాలు 10 ఉండగా, ఆరు మండలాల్లో 90 శాతం కంటే అధికంగా జరిగింది. కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే 72 శాతంతో తక్కువ స్థానంలో ఉంది.