సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,52,57,690 మంది పురుషులు, 1,50,97,292 మంది మహిళలు, 1,683 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 13,965 మంది పురుషులు, 538 మంది మహిళలు కలిపి మొత్తం 14,503 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.
5,01,836 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లున్నారు. ఈ నెల 30 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2022 జనవరి 1 అర్హత తేదీగా ఆ నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20 నాటికి పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
6న హుజూరాబాద్ ముసాయిదా జాబితా..
రాష్ట్రంలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 115 నియోజకవర్గాల ముసాయిదా జాబితాలు మాత్రమే ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ స్థానానికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. డిసెంబర్ 6 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 27లోగా పరిష్కరించనున్నారు. 115 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి హుజూరాబాద్ స్థానం తుది ఓటర్ల జాబితాను వచ్చే జనవరి 5న ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment