కమిషనర్‌ సరెండర్‌ | Kamareddy Municipal Commissioner Surrendered To Government | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ సరెండర్‌

Published Sun, Jul 14 2019 12:26 PM | Last Updated on Sun, Jul 14 2019 12:26 PM

ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్న అధికారులు, కమిషనర్‌ ప్రభాకర్‌ - Sakshi

సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్‌) : బల్దియా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌పై వేటు పడింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన తదితర అంశాలలో తప్పిదాలు కారణంగా ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన జాబితాల్లో పొరపాట్లు, అక్రమాలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు శనివారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించారు. అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత 10 రోజులుగా కమిషనర్‌ విధుల నిర్వహణ విషయంలో అలసత్వం వహించడం, స్పందించక పోవడం, అక్రమాలు జరిగినా పట్టించుకోక పోవడంతో కలెక్టర్‌ ఆయనపై వేటు వేశారు.

ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా జెడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రునాయక్‌కు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆయన శనివారం రాత్రి బాధ్యతలను స్వీకరించారు. అలాగే, ఎన్నికల నిమిత్తం కామారెడ్డి మున్సిపాలిటీకి నోడల్‌ అధికారిగా ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి సాయన్నను నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 10 వార్డులకు ఒక అధికారిని సూపర్‌వైజర్‌గా నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం వీరంతా బాధ్యతలను స్వీకరించారు. గత మార్చి 2వ తేదీన కమిషనర్‌గా కామారెడ్డికి వచ్చిన ప్రభాకర్‌ మొదటి నుంచి పాలనలో నిర్లక్ష్యం వ్యవహరించాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 

హుటాహుటిన అధికారుల నియామకం 
కామారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా జెడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రునాయక్‌ను, ఎన్నికల నోడల్‌ అధికారిగా జిల్లా ఇన్‌చార్జీ పంచాయతీరాజ్‌ అధికారి సాయన్నను నియమిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పట్టణంలోని 49 వార్డులకు సూపర్‌వైజర్‌లుగా అధికారులను నియమించారు. కామారెడ్డి తహసీల్దార్‌ రాజేంద్రన్‌ 18, 19, 30, 35, 42, 43, 44, 45, 46, 47 వార్డులకు, ఎంపీడీవో నాగేశ్వర్‌రావును 1, 2, 3, 32, 33, 29, 37, 38, 48, 49 వార్డులకు, టీపీవో శైలజను 25, 26, 31, 36, 40, 41, 39, 34, 27, 28 వార్డులకు, డీఈ వాసుదేవరెడ్డిని 4 నుంచి 13 వార్డుల వరకు, మున్సిపల్‌ మేనేజర్‌ నజీర్‌ను 14 నుంచి 24 వార్డులకు సూపర్‌వైజర్‌ అధికారులుగా నియమించారు. ఇక 49 వార్డులకు సంబంధించి ఈ అధికారులు ఎలాంటి తప్పిదాలు లేకుండా జాబితాలు సిద్ధం చేయాలని, ఎన్నికలు సజావుగా జరిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

గందరగోళంగా జాబితాలు, ఫిర్యాదుల వెల్లువ
మున్సిపల్‌ ఎన్నికలను షరవేగంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్, సీడీఎంఏ, ప్రభుత్వ ఆదేశాలతో అగ మేఘాల మీదా షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్‌ అధికారులు జాబితాలను ప్రకటించాల్సి వచ్చింది. అయితే, కమిషనర్‌ వ్యవహార శైలి, నిర్లక్ష్యం కారణంగా చాలా తప్పిదాలు దొర్లాయి. వార్డుల విభజన, ఓటర్ల ఇంటిం టా సర్వే, కులాల వారీగా ఓటర్ల సర్వే జాబితాలో చాలా తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శుక్ర, శనివారాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందో ళనకు దిగారు. తప్పిదాలను వెలికి తీశారు. ఈ విషయంలో కమిషనర్‌ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. మరోవైపు, కమిషనర్‌ ఉన్నతాధికారుల ఫోన్లు సైతం లేపక పోవడం మరింత ఆగ్రహానికి గురి చేసింది. రాజకీయ పక్షాలు, ప్రజల పక్షాన తరపున ఫిర్యాదులు, అభ్యంతరాలు రావడంతో కలెక్టర్‌ హుటా హుటిన స్పందించారు. బల్దియాలో చాలా మా ర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కమిషనర్‌ అనారోగ్యం గా ఉన్నాడని పలువురు అధికారులు తెలిపారు. అయితే, ప్రధానంగా ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం చేస్తే చాలా మార్పులు చోటు చేసుకుంటాయనే భావనతో కమిషనర్‌ ప్రభాకర్‌ను సరెండర్‌ చేశారు.

మార్పులు జరిగేనా?
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితాను నేడు (ఆదివారం) వెల్లడించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో తప్పిదాలను ఏ మేరకు సరి చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. పట్టణంలో వేలాది మంది ఓట్లు గల్లంతయ్యాయని, కొందరు ఓటర్లను సంబంధం లేని వార్డులో కలిపారని, ఇతర కులాలను సంబంధం లేని కులాల్లో చేర్చినట్లు జాబితాల్లో స్పష్టమవుతోంది. మరి అధికారులు ఏ మేరకు సరి చేస్తారో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement