కాంగ్రెస్‌లో నడిపించే నాయకుడేడి? | Leaders In Congress Party Not Showing Interest For Municipal Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో నడిపించే నాయకుడేడి?

Published Thu, Jan 9 2020 10:19 AM | Last Updated on Thu, Jan 9 2020 10:19 AM

Leaders In Congress Party Not Showing Interest For Municipal Elections  - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బల్దియా ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీలో కదనోత్సాహం కరువైంది. పుర పోరులో ముందుండి నడిపించే నాయకత్వం లేక ఆ పార్టీ సతమతమవుతోంది. దీంతో కమిటీలతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సమాయత్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు.. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

దీంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ క్యాడర్‌ను ముందుండి నడిపించే నాయకుడే కరువయ్యారు. ఎవరైనా ఒక్కరు బాధ్యతగా తీసుకుని కాంగ్రెస్‌ను కనీస స్థానాల్లోనైనా విజయతీరాలకు చేర్చే నేత ఎవరనేది పార్టీలో ప్రశ్నార్థకంగా మారింది.  బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీగా ఉన్న మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ ఈ బల్దియా ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు. ఇటీవల బాల్కొండ మండలానికి వెళ్లిన ఆయన తన నియోజకవర్గంలో భీమ్‌గల్‌ బల్దియా వైపు అసలు కన్నెత్తి చూడనే లేదు.

అటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించగా, ఇటు బీజేపీ కూడా సీఏఏ అవగాహన సదస్సు పేరుతో ఆ పట్టణంలోని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం పూర్తిగా చేతులెత్తేయడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆశావహుల్లో కూడా ఉత్సాహం నీరుగారి పోతోంది. 

నగరంలోనూ కమిటీనే..
జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలోనూ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జీగా తాహెర్‌ బిన్‌ హందాన్‌ ఉన్నారు. కానీ ఇక్కడ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. టికెట్ల కేటాయింపులు బాధ్యతలను ఈ కమిటీకే అప్పగించారు. దీంతో కమిటీలో ఉన్న నేతలంతా నాకెందుకొచ్చిన తంటా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆశావహుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం వంటి వ్యవæహారాలను నగరాధ్యక్షుడిగా ఉన్న కేశ వేణు చూస్తున్నారు. 

బోధన్‌లోనూ.. 
బోధన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన ఆయన పట్టణంలోని అనుచరులతో సమావేశం నిర్వహించి వెళ్లిపోయారు. ఇటీవల ఆ పార్టీ బోధన్‌ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్‌ కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నాడు. గత బల్దియా ఎన్నికల్లో బోధన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంది. 35 వార్డుల్లో 15 వార్డులను కైవసం చేసుకుంది. కానీ ఈసారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. 

ఆర్మూర్‌కు ఇన్‌చార్జీయే లేరు.. 
ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆర్మూర్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జీయే లేకుండా పోయారు. దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ బల్దియాలో కాంగ్రెస్‌ శ్రేణుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ కూడా ఓ కమిటీని వేసిన ఆ పార్టీ నాయకత్వం.. ఎన్నికలను మమ అనిపించేలా వ్యవహరిస్తోంది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల్లో కదనోత్సాహం కనిపిస్తుంటే.. కాంగ్రెస్‌ నాయకత్వంతో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement