సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఓటర్లు 2,99,74,919 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చోటు పొందిన యువ ఓటర్లు 2,78,650 మంది ఉండటం విశేషం. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్‌ఎస్‌ఆర్)–2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు.
సాధారణ ఓటర్లకు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు (కేంద్ర సాయుధ బలగాలు) 15,282 మంది కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన శాసనసభ ఎన్నికలను ఈ జాబితాతోనే నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమం కావడంతో ఎన్నికల ప్రకటన నాటికి జాబితాలో స్థానం పొందే కొత్త ఓటర్లకు సైతం ఓటు హక్కును కల్పించనున్నారు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో...
వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా గతేడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన 2023 వార్షిక ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది. గతేడాది తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత నిరంతర నవీకరణ చేపట్టారు.
ఒకే తరహా ఫొటోలు కలిగిన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి తొలగించారు. మొత్తం 11,36,873 ఓటర్లను తొలగించగా, కొత్తగా 3,45,648 ఓటర్లను చేర్చారు. దీంతో ఓటర్ల జాబితా సవరణ 2023లో భాగంగా గత నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,65,669కు తగ్గింది. ఆ తర్వాత కొత్తగా 6,84,408 మందికి చోటు కల్పించగా, 2,72,418 మంది ఓటర్లను తొలగించారు. దీంతో తాజాగా ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో సాధారణ ఓటర్ల సంఖ్య 2,99,74,919కి తగ్గింది.
నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో...
మారుమూల గిరిజన ప్రాంతంలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది 2,800 మంది గిరిజనులు తొలిసారిగా ఓటు హక్కును పొందారు. 361 గిరిజన ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించి కొలామ్స్, తోటి, చెంచులు, కండారెడ్డి తెగల గిరిజనులకు ఓటు హక్కు కల్పించారు. సదరం డేటాబేస్, ఆసరా పెన్షన్ల సమాచారాన్ని వికలాంగ ఓటర్ల నమోదుకు వినియోగించారు. ముందస్తుగా ఓటర్ల నమోదులో భాగంగా 17 ఏళ్లు నిండిన 20,246 మంది యువతీయువకుల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరించారు. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు.
ఇంకా నమోదు చేసుకోవచ్చు: సీఈఓ వికాస్ రాజ్
ఓటర్ల నమోదు నిరంతర కార్యక్రమమని, తుది జాబితాలో చోటుపొందని వారు మళ్లీ దరఖాస్తు చే సుకోవచ్చు. ఎన్‌వీఎస్‌పీ వెబ్‌పోర్టల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా తమ దరఖాస్తును స్థానిక బీఎల్‌ఓకు అందజేస్తే అర్హులకు ఓటు హక్కు కల్పిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment