సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో శుక్రవారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. వేలాదిమంది ప్రజలు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ‘నా ఓటు ఏమైంది’ (#whereismyvote) అని ప్రశ్నిస్తూ ప్రచారోద్యమం నిర్వహించారు. జాబితాలో పేర్లు గల్లంతైన వేలాదిమంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను వినియోగించి తమ నిరసన తెలియజేయడంతో ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా శుక్రవారం ఈ ప్రచారోద్యమం నిలిచింది.
2014 సాధారణ ఎన్నికలు, 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, తాజా శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు గల్లంతైందని చాలామంది జంట నగరాల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పేరుతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2017లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమమే ఇందుకు కారణం. బూత్‌స్థాయి అధికారుల (బీఎల్‌వో)కు ట్యాబ్లెట్ పీసీలు చేతికిచ్చి ఈ 36 నియోజకవర్గాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించారు.
ఈ స్థానాల్లో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా సర్వే అనంతరం ఏకంగా 24,20,244(22.11శాతం) ఓట్లను తొలగించారు. మరో 29,93,777(27.35 శాతం) ఓటర్లు తమ ఓట్లను కొత్త చిరునామాలకు బదిలీ చేసుకున్నారు. సర్వే తర్వాత 55,30,947 (50.53శాతం) ఓట్లు మాత్రమే ఉన్న చిరునామా ల్లోనే మిగిలాయి. ఈ సర్వేలోనే కొత్తగా 5,82,138 (6.4శాతం) ఓట్లను చేర్చారు. ఈ సర్వే ముగిసిన తర్వాత చివరికి 91,06,862 ఓట్లు జాబితాలో మిగిలాయి . ఈ వివరాలను నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) అనూప్‌సింగ్ 2017 డిసెంబర్ 5న విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
విచారణ జరపని ఎన్నికల సంఘం
ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాక త్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్‌పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లలో ఈ సర్వే జరిగింది. ఈ 36 నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను గత జనవరి 20న ప్రకటించారు.
ఐఆర్‌ఈఆర్ పేరుతో నిర్వహించిన ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దొంగ ఓట్ల పేరుతో సరైన విచారణ లేకుండానే అడ్డగోలుగా ఓట్లను తొలగించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించకుండానే ఓట్లను తొలగించినట్లు విమర్శలున్నాయి. అయినా, తొలగించిన ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం విచారణ నిర్వహించకపోవడంతో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్షలమంది ఓట్లు గల్లంతు అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోని లోపాలపట్ల చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా ఎన్నికల సంఘం ముందు నుంచి మొండిగా వ్యవహరించిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment