ట్విట్టర్‌లో మోదీ చేసిన ప్రకటన
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నా’ అని సోమవారం ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సంబంధిత వర్గాలను సంప్రదించగా, భవిష్యత్ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలిపాయి. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. గంటలో 26వేల సార్లు రీట్వీట్ అయింది. క్షణక్షణానికో కామెంట్ వచ్చింది.
నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివిధ ఎమోజీలతో స్పందించడం ప్రారంభించారు. నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ అదే సోషల్ మీడియా కేంద్రంగా ’నో సర్’ అని వేలాదిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ‘నో సర్’ ట్రెండవుతున్న హ్యాష్‌ట్యాగ్‌గా మారింది. ‘ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దు’ అని ఓ నెటిజన్ అభ్యర్థించారు. ‘నేను మోదీజీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. సోషల్ మీడియాను నేనూ వదలేస్తా’ అని మరో యూజర్ హెచ్చరించారు. మరోవైపు, మోదీ ట్వీట్‌పై మీమ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బ్లాక్‌బస్టర్ సినిమా ‘3 ఇడియట్స్’ సినిమా సీన్ నేపథ్యంలో ‘జానే నహీ దేంగే తుఝే’ అనే పాటను ప్లే చేస్తూ ఒక మీమ్‌ను రూపొందించారు.
విద్వేషం వదలండి: మరోవైపు, విపక్షాల నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ‘ద్వేషాన్ని విడనాడు.. సోషల్ మీడియాను కాదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్య ట్వీట్ చేశారు.
టాప్ ’సోషల్’ స్టార్: ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్‌లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment