ఇకపై ఓటు నిర్ధారణ | Early Elections In Telangana Adilabad Voter List | Sakshi
Sakshi News home page

ఇకపై ఓటు నిర్ధారణ

Published Mon, Aug 27 2018 11:11 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Early Elections In Telangana Adilabad Voter List - Sakshi

ఆదిలాబాద్‌ అర్బన్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ జిల్లా అంతటా ఉత్కంఠ వాతావరాణాన్ని నెలకొల్పుతోంది. ప్రభుత్వ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా వచ్చినా.. షెడ్యూల్‌ ప్రకారం వచ్చినా.. ఎన్నికల సంఘం నిర్వహణకు సిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితా రూప కల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినా గడువులోగా పూర్తి చేయడంతో పాటు ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంల వినియోగం, తదితర ఏర్పాట్లపై ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈసారి జరబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కొత్తగా ‘వీవీ ప్యాట్‌’ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రైయిల్‌)లు వినియోగించనున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీవీప్యాట్‌లను వినియోగించడం ఇదే మొదటిసారి.. ఇదిలా ఉండగా, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ సెప్టెంబర్‌ 1న ఫొటో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.
 
జిల్లాలో తొలిసారిగా వినియోగం..
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 1,78,715 ఓటర్లు ఉండగా, బోథ్‌ నియోజకవర్గంలో 1,73,915 మంది ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 25 వరకు పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రక్రియ ద్వారా జిల్లా వ్యాప్తంగా 45 పోలింగ్‌ కేంద్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పట్టణంలోని ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 1400 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకోగా,  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 1200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా   పోలింగ్‌ కేంద్రాలను రేషనలైజేషన్‌ చేశారు.

ఈ లెక్కన జిల్లాలో 518 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక జిల్లాలో ఈసారి జరబోయే ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌లను వినియోగించనున్నారు. ఈ వీవీప్యాట్‌లు జిల్లాలోని అన్ని ఈవీఎంలకు అనుసంధానం చేసి వినియోగించనున్నారు. ఒక్కో ఈవీఎంకు ఒకో వీవీప్యాట్‌ మిషన్‌ వినియోగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంకా ఈవీఎంల పునర్విభజన జరగలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,333 ఈవీఎం మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈవీఎంల పునర్విభజన జరిగిన తర్వాత ఇతర జిల్లాలకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌ మిషన్లను అందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

వీవీ ప్యాట్‌ పని చేస్తుందిలా..
ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16,333 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. అంతే మోతాదులో ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్‌లు) సిద్ధం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రశీదు ఇచ్చే విధా నం జిల్లాలో తొలిసారిగా అమల్లోకి రానుంది. ఓటరుకు రశీదు ఇచ్చే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు మొదటిసారిగా రశీదు పరికరాలను అమర్చనున్నారు. అయితే ఈ వీవీప్యాట్‌ మిషన్లు అర్బన్‌ ఏరియాలో 1400 ఓటర్లను, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లను మాత్రమే నమోదు చేసుకొని ఓటరుకు రశీదులు ఇవ్వగలుగుతాయి.

ఆ మిషన్‌లో అన్ని ఓటర్లకు మాత్రమే సరిపడా ప్రింటింగ్‌ పేపర్‌ అందుబాటులో ఉంటుంది.  ఉదాహరణకు... ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఈవీఎం మిషన్‌ దగ్గరకు వెళ్లాడనుకుందాం.. అతను ఈవీ ఎంపై సదరు గుర్తు గల బటన్‌పై ప్రెస్‌ చేస్తారు.. ఏ గుర్తుకు అయితే మనం ఓటేశామో మరుక్షణం ఆ గుర్తు ఏడు సెకండ్ల పాటు వీవీ ప్యాట్‌ మిషన్‌లో రశీదు రూపంలో కన్పించి కింద ఉన్న బాక్సులో పడిపోతుంది. ఆ రశీదును మనం తీసుకునేం దుకు వీలుండదు కానీ.. ఓటు ఏ గుర్తుకు వేశామో నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఓటర్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు పనిచేయకపోతే వీవీప్యాట్‌ రశీదులను బ్యాలెట్‌ బాక్సులుగా లెక్కగట్టి కౌంటింగ్‌ చేస్తారు.

వచ్చే నెలలో శిక్షణ.. 
జిల్లాలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వినియోగించనున్న వీవీప్యాట్‌ల గురించి వచ్చే సెప్టెంబర్‌ నెలలో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా ఎలక్టోరల్‌ అధికారి సంధ్యారాణి ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగిన వీవీప్యాట్‌ల శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం సైతం ముందస్తుకు వెళ్తున్న నేపథ్యంలో సదరు రాష్ట్రాలతో  పాటు మన రాష్ట్రంలో కూడా వీవీప్యాట్‌ల వినియోగం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో     ప్రారంభించే అవకాశం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీవీ ప్యాక్‌ (ఓటు రశీదు పరికరం) ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈవీఎం మిషన్‌ ద్వారా ఓటు ఏ గుర్తుకు వేశారో సరిచూసుకోవచ్చు. దీనిని జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించనున్నాం. దీనిపై త్వరలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో సరిపడా ఈవీఎంలకు సరిపడా వీవీ మిషన్లను సమకూర్చుతాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – సంధ్యారాణి, జిల్లా జాయింట్‌ కలెక్టర్, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement