
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవిధంగానే ఈ ప్రక్రియ జరిగిందని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
మజ్లిస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పెరిగిందని, అదే బీజేపీ ప్రాబల్యమున్న చోట్ల ఓట్లసంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరారని, ఓటర్ల జాబితా విషయమై జరిగిన అక్రమాలకు ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిశీలించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తమకు హామీ ఇచ్చినట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
లక్ష్మణ్ తెలిపారు.
ఎన్నికల ఓటర్ల నమోదు, తొలగింపు అంశంలో జరుగుతున్న అవకతవకలను బీజేపీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చిందని, సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తరహాలో ఈవీఎంలపై తమకు అనుకూలమైన సందర్భంలో ఒకలాగా, వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భంలో మరోలాగా తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment