భర్త వీరేంద్రతో నమిత
పెరంబూరు: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు గుంజుకోవడానికి రాజకీయ నాయకులు బయలుదేరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు డబ్బును అక్రమంగా తరలిస్తున్న వాహనాలను తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. వారు ఇప్పటికే సరైన ఆధారాలు లేని కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా నటి నమిత ఫ్లయింగ్ స్క్వాడ్‌తో వాగ్వాదానికి దిగినట్లు, వారితో గొడవ పడినట్లు గరువారం ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. దీంతో నటి నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనను మీడియా పర్సన్ ద్వారా విడుదల చేశారు.అందులో తాము షూటింగ్‌లో పాల్గొనడానికి 8 గంటల పాటు కారులో ప్రయాణం చేస్తున్నామన్నారు. నమిత ప్రయాణ బడలికతో కారు వెనుక సీటులో నిద్రిస్తోందని చెప్పారు. అప్పటికే దారిలో రెండు మూడు చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారును తనిఖీ చేశారన్నారు.
అలా సేలం జిల్లా, ఆర్కాడు ప్రధాన కూడలిలో మరోసారి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారు ఆపారని చెప్పారు. అయినా తాము తనిఖీకి సహకరించామని తెలిపారు. అయితే వెనుక సీటులో నమిత నిద్రపోతుండడంతో అవసరం అయితే తానే ఆమెను లేపుతానని చెప్పానన్నారు. అయితే వారు తన మాటను వినిపించుకోకుండా కారు డోర్‌ను టక్కున ఒపెన్ చేశారని, దీంతో పడుకున్న నమిత సడన్‌గా కిందకు పడిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయినా వారు నమిత బ్యాగ్‌ను పరిశీలించాలని అన్నారని,, దీంతో నిరాకరించిన నమిత మహిళా పోలీస్‌నే తన బ్యాగ్ చెక్ చేయాలని చెప్పిందన్నారు. అప్పుడు మహిళా పోలీస్ వచ్చి నమిత బ్యాగ్‌ను చెక్ చేసిందని తెలిపారు. అసౌకర్యమైన పరిస్థితుల్లో మహిళా పోలీస్‌ను తనిఖీకి కోరడం ప్రతి మహిళా హక్కు అని నమిత భర్త వీరేంద్ర అన్నారు. జరిగింది ఇదయితే మీడియా వేరే విధంగా వక్రీకరించిందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment