అధికారులకు ఎంపీపీ భర్త హుకుం!
జోగిపేట: ‘గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎంపీపీ అధ్యక్షురాలికి చెప్పరా? ఏ శాఖలో ఏ పనులు జరుగుతున్నాయ్.. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు తెలపాలి.. అందరూ కలిసి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది..’ ఈ మాటలు అన్నది ఏ ప్రజాప్రతినిధో కాదు.. భార్య హోదాను అడ్డుపెట్టుకుని భర్త గారు అధికారులకు జారీ చేసిన హుకుం.. ఇది. సోమవారం స్థానిక ఎంపీపీ అధ్యక్షురాలి ఛాంబర్‌లో మండల స్థాయి అధికారుల సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షురాలి అధ్యక్షతన నిర్వహించారు.
సాక్షాత్తూ ఎంపీపీ అధ్యక్షురాలు సి.హెచ్.విజయలక్ష్మి భర్త వెంకటేశం అధికారులకు ఈ మేరకు హుకుం జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులు తమను తాము పరిచయం చేసుకుంటూ, తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సదరు భర్త..వారిని ఉద్దేశిస్తూ ఈ మాటలన్నారు. అయితే వాటిని శ్రద్ధగా వింటూ కూర్చున్న ఎంపీపీ అధ్యక్షురాలు నోరు తెరిచి ఒక్క అధికారిని కూడా ఎదురు ప్రశ్నించలేదు.
హౌసింగ్ శాఖ అధికారి రమేశ్ పథకానికి సంబంధించి వివరిస్తూ పాత బిల్లులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదని, ఇంతకు ముందు మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ నంబర్లను గ్రామాలకు వెళ్లి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ భర్త కల్పించుకొని తమకు తెలియకుండా గ్రామాల్లోకి వెళ్తే ఎలా, మాకు సమాచారం ఇస్తే ప్రజలకు తెలియపరుస్తాం కదా అని పేర్కొన్నారు.