టీడీపీకి ఓటేయకుంటే ప్రాణాలు దక్కవు
• కనగానపల్లిలోఎంపీటీసీలకు తీవ్రస్థాయిలో మంత్రి బెదిరింపులు
• ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన పరిటాల సునీత
• దౌర్జన్యంగాఎంపీపీ పదవి కైవసం
కనగానపల్లి/ రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఈ నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానానికి బుధవారం నిర్వహించిన ఎన్నికలో స్వయాన మంత్రే దౌర్జన్యానికి దిగారు. పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. అనుచరులతో కలసి ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయం వద్ద మోహరించిన మంత్రి భయాందోళనలకు గురిచేశారు. ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ‘మీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే ప్రాణాలతో బయటకు వెళ్లలేరు. ఇక్కడ మా పార్టీ అనుచరులు ఐదు వేల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే బయటకు వెళ్లగానే చంపుతారు..’ అంటూ మంత్రి బెదిరించినట్లు సభ్యులు చెప్పారు. ఎన్నిక సమయంలోనూ వైఎస్సార్సీపీ సభ్యులపై అధికార టీడీపీ సభ్యులు దాడి చేశారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మంత్రి సునీత అనుచరులు మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డిలను తమ అధీనంలోకి తీసుకుని వెంట తీసుకెళ్లారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్రే పోషించారు. కనగానపల్లి మండలంలో 2014 ఏప్రిల్‌లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీకి ఆరు, టీడీపీకి ఐదు స్థానాలు దక్కాయి. అప్పట్లో వైఎస్సార్సీపీకి చెందిన కనగానపల్లి, ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యులు బిల్లే గంగమ్మ, పద్మగీతలను టీడీపీ నాయకులు ప్రలోభపెట్టి ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నారు. ఎలకుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు.
అయితే అప్పటి నుంచే పద్మగీత, ఆమె భర్త ముకుందనాయుడు తమకే ఎంపీపీ పదవి కావాలని మంత్రి పరిటాల సునీతపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారం క్రితం బిల్లే రాజేంద్రతో రాజీనామా చేయించారు. దీంతో మనస్తాపం చెందిన రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డి, బిల్లే గంగమ్మ ఈ నెల 11న రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ పరిణామాన్ని మంత్రి పరిటాల సునీత, ఆమె అనుచరులు జీర్ణించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు చేతులు ఎత్తకుండానే టీడీపీకే ఓటు వేశారంటూ అధికారులతో చెప్పించి టీడీపీ అభ్యర్థి పద్మగీతను ఎంపీపీగా ప్రకటింపజేశారు.