
సాక్షి, అమరావతి: ఒక పథకానికి ఉన్న ప్రముఖ వ్యక్తి పేరు మార్చి మరో ప్రముఖ వ్యక్తి పేరు పెట్టినంత మాత్రాన పేద లబ్ధిదారులకు ఒరిగేదీ లేదని హైకోర్టు పేర్కొంది. ఈ పథకాన్ని కచ్చితంగా అమలు చేసి, ఇవ్వాల్సిన సొమ్మును కచ్చితంగా విడుదల చేసినప్పుడే ఆ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారని తెలిపింది. గృహనిర్మాణ పథకం కింద రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాసిన లేఖల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ కార్యాచరణ నివేదికను తమ ముందుంచాలని గృహనిర్మాణశాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్సార్ గ్రామీణ హౌసింగ్ పథకం కింద 2019–20 సంవత్సరానికి లబ్ధిదారులమైన తమకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఇవ్వడంలేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారించారు. పిటిషనర్ల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.1 మాత్రమే జమచేసిందని పిటిషనర్ల న్యాయవాదులు వివరించారు.
వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నారని, ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థికశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది అశోక్‌రామ్ వాదనలు వినిపిస్తూ.. హౌసింగ్ పథకానికి వైఎస్సార్ హౌసింగ్ పథకంగా పేరు మార్చామని చెప్పారు. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి 2018లో 4 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
పిటిషనర్లకు చెల్లింపుల విషయంలో తమ శాఖ వద్ద ప్రతిపాదనలేమీ పెండింగ్‌లో లేవని చెప్పారు. బిల్లులు సమర్పిస్తే ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రూ.358 కోట్ల విడుదల కోసం ఆర్థికశాఖకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లేఖలు రాశారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లేఖల ఆధారంగా తీసుకున్న చర్యలు వివరిస్తూ ఓ నివేదికను తమ ముందుంచాలని గృహనిర్మాణశాఖ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment