‘హౌసింగ్‌’ విభాగం.. ఇక పేరుకే పరిమితం | housing department.. limits own name | Sakshi
Sakshi News home page

‘హౌసింగ్‌’ విభాగం.. ఇక పేరుకే పరిమితం

Published Tue, Aug 2 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని హౌసింగ్‌ కార్యాలయం

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని హౌసింగ్‌ కార్యాలయం

పేదలకు సొంతింటి కలను సాకారం చేసిన హౌసింగ్‌ శాఖ.. ఇక పేరుకే పరిమితం కానుంది. ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ఆ శాఖ పూర్తిగా తప్పుకోనుంది.

  • ‘డబుల్‌’ బాధ్యతలకు సెలవు
  • ఉద్యోగుల తరలింపు లేదా వీఆర్‌ఎస్‌పై సమాలోచన
  • త్వరలో ఉత్తర్వులు జారీ
  • సాక్షి, సంగారెడ్డి: పేదలకు సొంతింటి కలను సాకారం చేసిన హౌసింగ్‌ శాఖ.. ఇక పేరుకే పరిమితం కానుంది. ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ఆ శాఖ పూర్తిగా తప్పుకోనుంది. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణ పనులు పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ, ఇతర ఇంజినీరింగ్‌ శాఖలు స్వీకరించనున్నాయి. తాజాగా హౌసింగ్‌ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను తమ మాతృశాఖలకు పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

    హౌసింగ్‌ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మొదలు జిల్లాస్థాయి ఇంజినీరింగ్‌ అధికారులు, నాన్‌ టెక్నికల్‌ స్టాఫ్‌, పరిపాలన అధికారులు, సిబ్బందిని బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించనుంది. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు, ఉద్యోగులు తిరిగి మాతృసంస్థకు కేటాయించనున్నారు. మిగితా వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు ఆప్షన్‌లు కోరినట్లు తెలుస్తోంది. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో హౌసింగ్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అర్ధాంతరంగా ఇతర శాఖలకు పంపిచడం లేదా వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని చెప్పడం మనోవేదనకు గురిచేస్తోందని వారు చెబుతున్నారు.

    నాడు ఘనం.. నేడు తీసికట్టు
    గూడులేని పేదలకు సొంత ఇంటికలను నిజం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహనిర్మాణ సంస్థ (హౌసింగ్‌ కార్పొరేషన్‌) ఏర్పాటైంది. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు హౌసింగ్‌ కాలనీలు సైతం నిర్మించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఈ శాఖకు ఎంతో ప్రాముఖ్యత లభించింది. ఈక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని వేలాది మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిపొందారు.

    రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశారు. సీఎం కేసీఆర్‌ పేదల కోసం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇస్తామని ప్రకటించారు. ఆమేరకు నియోజకవర్గాల వారీగా తొలి విడతలో డబుల్‌బెడ్‌రూమ్‌లు సైతం మంజూరు చేశారు. అయితే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో హౌజింగ్‌ శాఖ పనితీరుపై విమర్శలు, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల బాధ్యతల నుంచి హౌసింగ్‌ను తప్పించింది. దానిస్థానే జిల్లాలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల బాధ్యతలను ఇంజినీరింగ్‌ శాఖలకు పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ, సర్వశిక్ష అభియాన్, ఎస్సీ కార్పొరేషన్‌లోని ఇంజినీరింగ్‌ విభాగాలకు అప్పగించింది.

    ఇతర శాఖలకు ఉద్యోగులు
    హౌసింగ్‌ కార్పొరేషన్‌ను మొత్తంగా రద్దు చేయటం లేదా ఇతర శాఖలో విలీనం చేయటం సాధ్యం కాదని తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు దక్కాలంటే హౌసింగ్‌ కార్పొరేషన్‌ తప్పకుండా ఉండాల్సిందే. దీంతో రుణాల కోసం కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు ఆ శాఖలో నామమాత్రంగా ఉద్యోగులను ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగితా అధికారులు, ఉద్యోగులను ఇతరశాఖలు లేదా మాతృసంస్థలకు తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇతర శాఖలకు వెళ్లేందుకు సుముఖంగా లేనివారికి వీఆర్‌ఎస్‌ ఇచ్చే యోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

    జిల్లాలో ప్రస్తుతం హౌసింగ్‌ పీడీ పోస్టు ఖాళీగా ఉండగా.. ఆరుగురు డీఈలు పనిచేస్తున్నారు. అదేవిధంగా 37 మంది ఏఈలు, 27 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, 9 మంది పరిపాలనా సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా, వీరిలో డీఈ, ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను తమ మాతృసంస్థలకు వెళ్లాల్సిందిగా సూచించారు. మిగతావారిని జలమండలి, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అధికారులు, ఉద్యోగులు తాము ఏ శాఖలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది ఆప్షన్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు ఏఈలను వాటర్‌గ్రిడ్‌కు పంపించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement