చిత్తూరు, బి.కొత్తకోట: ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోసారి వింతగా ఉంటాయి. అందులో గురువారం గృహ నిర్మాణశాఖ జారీ చేసిన ఉత్తర్వు ఒకటి. అవినీతికి పాల్పడిన శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా విచారణ అధికారిని, ప్రజెంటింగ్ అధికారిని నియమించారు. అయితే ప్రజెంటింగ్ అధికారిగా గృహ నిర్మాణశాఖ చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌ను నియమించారు. నగేష్ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతితో రెండునెలల సెలవు తీసుకున్నారు. ఆయన స్థానికంగా లేనప్పటికీ ఆయనను నియమించడం గమనార్హం! దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరేదాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. నగేష్ జనవరి 15 నుంచి మార్చి 15 వరకు సెలవు మంజూరైనట్టు తెలుస్తోంది. సెలవుపై ఆయన అమెరికా వెళ్లి అక్కడే ఉన్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఆయన సెలవు ముగించుకున్నాక విధుల్లో చేరనున్నారు. అప్పటి వరకు ఆరోపణలున్న అధికారులపై విచారణ, చర్యల నిర్ధారణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ అధికారులు వీరే
ఇందిరమ్మ పథకం అమలు సమయంలో జిల్లాలో పనిచేసిన, ప్రస్తుతం ఉద్యోగోన్నతి పొందిన అధికారులపై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో అప్పటి ఆర్‌సీపురం ఏఈ టీ.ఈశ్వరప్రసాద్ (ప్రస్తుతం పుత్తూరు), శ్రీకాళహస్తి ఏఈ ఆర్.జానకిరామిరెడ్డి (ప్రస్తుతం శ్రీకాళహస్తీ డీఈ), తొట్టంబేడు ఏఈ ఏసీ.సుబ్బారెడ్డి (ప్రస్తుతం కర్నూలు జిల్లాలో డీఈ), నాగలాపురం ఏఈ బి.శ్రీనివాసులు (ప్రస్తుతం నిండ్ర), బీఎన్‌కండ్రిగ ఎంఐసీ జీవీఎస్.మురళి (ప్రస్తుతం తిరుపతి ప్రాజెక్టులు), నగరి ఏఈ ఎన్.భాస్కర్ (ప్రస్తుతం బైరెడ్డిపల్లె), విజలాపురం ఏఈ పి.వెంకటేశ్వర్లు (ప్రస్తుతం జీడీనెల్లూరు డీఈ), నిండ్ర ఎంఐసీ ఏఎం.సురేంద్రనా«థ్ (ప్రస్తుతం పాకాల), నిండ్ర ఎంఐసీ టీకేఎస్‌ఎస్.కుమార్ (ప్రస్తుతం నాగలాపురం), వడమాలపేట ఎంఐసీ ఏ.దామోదర్ (ప్రస్తుతం పుత్తూరు) ఉన్నారు. వీరు పనిచేసిన మండలాల్లో ఇందిరమ్మ పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు విచారణలో తేల్చారు. వీరిపై శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం గృహ నిర్మాణశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరిపై నివేదించిన ఆరోపణలపై శాఖ ఎస్‌ఈ కే.వెంకటరెడ్డిని విచారణ అధికారిగా నియమించగా అవినీతి ఆరోపణలపై ఏఏ చర్యలు చేపట్టాలో తేల్చి నివేదించే బాధ్యతను చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment