ee
-
సిక్కోలులో కలకలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ, ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్న తూతిక మోహనరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగవారం దాడులు చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురంలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మోహనరావు ఇళ్లపై దా డులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈఈ స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేశారు. దీని ప్రకారం మొత్తం రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. దీనిలో బంగారం580 గ్రాములు విలువ రూ.27లక్షలుగాను, వెండి రెండు కేజీలు రూ.1.50లక్షలుగాను, గృహాలంకరణాల విలువ రూ.16లక్షలు, ఆయన ఇంట్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్ ఖాతాలో రూ.30లక్షలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తూతిక మోహనరావు వాస్తవానికి డిప్యూ టీ ఇంజనీర్ (డీఈ) కేడర్‌లో పార్వతీపురం, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. ఈయన గతంలో సీతంపేట, నర్సీపట్నంలలో ఐటీడీఏల్లో డీఈగా కూడా పనిచేశారు. అనంతరం పార్వతీపురంలో ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విషయం తెలుసుకున్న మోహనరావు తన పలుకుబడితో ఈఈగా అదనపు బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోహనరావు ఇంట్లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు సిక్కోలులో కలకలం శ్రీకాకుళం నగరంలోని ఎల్బీఎస్ కాలనీలో సొంత నివాసంలో ఉంటున్న మోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో కూడా అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారు జామునే పార్వతీపురంలో తొలుత దాడులు చేశారు. అనంతరం మోహనరావును శ్రీకాకుళంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోహనరావు ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, వెండి, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో ఆయన ఉన్న అద్దె ఇంటిలో రూ.3.5 లక్షలు, శ్రీకాకుళంలో రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తాం: ఏసీబీ డీఎస్పీ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న తూతిక మోహనరావును బుధవారం విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు మహేశ్వరరావు, భాస్కర్, సత్యారావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సింగూరు ఇసుక ర్యాంపు తాత్కాలికంగా మూసివేత ఆమదాలవలస రూరల్: పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు రెవెన్యూలో సేకరించిన ఇసుకను దూసిలో నిల్వ చేసి అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా తరలించేవారు. ఇసుక ర్యాంపుపై ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు హరనాథరావు, భరత్, వాసులతో పాటు ముగ్గురు మైన్స్ అధికారులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేయడంతో ర్యాంపులో ఉన్న వారు భయపడి ర్యాంపును ఆపేసినట్లు తెలిపారు. అందుకే ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇసుక ర్యాంపులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విధు ల నుంచి అధికారులు తొలగించారు.ఇసుక ర్యాంపు నిర్వహణలో వారి విధానాల వల్ల అక్రమంగా ఇసుక తరలిపోయినట్లు గుర్తించిన మైన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. -
అధికారి అమెరికాలో.. విచారణ చిత్తూరులో..
చిత్తూరు, బి.కొత్తకోట: ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోసారి వింతగా ఉంటాయి. అందులో గురువారం గృహ నిర్మాణశాఖ జారీ చేసిన ఉత్తర్వు ఒకటి. అవినీతికి పాల్పడిన శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా విచారణ అధికారిని, ప్రజెంటింగ్ అధికారిని నియమించారు. అయితే ప్రజెంటింగ్ అధికారిగా గృహ నిర్మాణశాఖ చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌ను నియమించారు. నగేష్ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతితో రెండునెలల సెలవు తీసుకున్నారు. ఆయన స్థానికంగా లేనప్పటికీ ఆయనను నియమించడం గమనార్హం! దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరేదాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. నగేష్ జనవరి 15 నుంచి మార్చి 15 వరకు సెలవు మంజూరైనట్టు తెలుస్తోంది. సెలవుపై ఆయన అమెరికా వెళ్లి అక్కడే ఉన్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఆయన సెలవు ముగించుకున్నాక విధుల్లో చేరనున్నారు. అప్పటి వరకు ఆరోపణలున్న అధికారులపై విచారణ, చర్యల నిర్ధారణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అధికారులు వీరే ఇందిరమ్మ పథకం అమలు సమయంలో జిల్లాలో పనిచేసిన, ప్రస్తుతం ఉద్యోగోన్నతి పొందిన అధికారులపై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో అప్పటి ఆర్సీపురం ఏఈ టీ.ఈశ్వరప్రసాద్ (ప్రస్తుతం పుత్తూరు), శ్రీకాళహస్తి ఏఈ ఆర్.జానకిరామిరెడ్డి (ప్రస్తుతం శ్రీకాళహస్తీ డీఈ), తొట్టంబేడు ఏఈ ఏసీ.సుబ్బారెడ్డి (ప్రస్తుతం కర్నూలు జిల్లాలో డీఈ), నాగలాపురం ఏఈ బి.శ్రీనివాసులు (ప్రస్తుతం నిండ్ర), బీఎన్‌కండ్రిగ ఎంఐసీ జీవీఎస్.మురళి (ప్రస్తుతం తిరుపతి ప్రాజెక్టులు), నగరి ఏఈ ఎన్.భాస్కర్ (ప్రస్తుతం బైరెడ్డిపల్లె), విజలాపురం ఏఈ పి.వెంకటేశ్వర్లు (ప్రస్తుతం జీడీనెల్లూరు డీఈ), నిండ్ర ఎంఐసీ ఏఎం.సురేంద్రనా«థ్ (ప్రస్తుతం పాకాల), నిండ్ర ఎంఐసీ టీకేఎస్ఎస్.కుమార్ (ప్రస్తుతం నాగలాపురం), వడమాలపేట ఎంఐసీ ఏ.దామోదర్ (ప్రస్తుతం పుత్తూరు) ఉన్నారు. వీరు పనిచేసిన మండలాల్లో ఇందిరమ్మ పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు విచారణలో తేల్చారు. వీరిపై శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం గృహ నిర్మాణశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరిపై నివేదించిన ఆరోపణలపై శాఖ ఎస్ఈ కే.వెంకటరెడ్డిని విచారణ అధికారిగా నియమించగా అవినీతి ఆరోపణలపై ఏఏ చర్యలు చేపట్టాలో తేల్చి నివేదించే బాధ్యతను చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌కు అప్పగించారు. -
రాజుగారి తాయిలం రూ.100 కోట్లు
మెట్ట సీమలో ఆయనొక రారాజు. ఒకప్పుడు ఆయన పేరు చెబితే ‘తూర్పు’ సామాజ్య్రంలో ఎదురే లేదు. ఒంటిచేత్తో రాజ్యాన్ని నడిపించిన పేరు కూడా ఆయనదే. అటువంటి మెట్ట రాజ్యాన్ని ఏలుతున్న రాజు సొంత పనులు చక్కబెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నమ్మిన జనాన్ని ఏలేరులో వదిలేయడానికి నిర్ణయించేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ‘చంద్ర’వంశ రాజు దగ్గరున్న వేగులు ‘తెలుగు’రాజ్యంలో కలిపేస్తే రెండు తాయిలాలు ఇస్తామనే ప్రతిపాదనతో వచ్చారు. అందులో ఒకటి చంద్రవంశ రాజు కొలువులో మంత్రి, రెండో తాయిలాల కింద మణులు, మాణిక్యాలు. ఆ మెట్ట రాజ్యంలో జనం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకుంటారని జనం ఎదురు చూశారు. జనంతో తనకేం పని అన్నట్టు చంద్రవంశ రాజు మాటలు నమ్మి తన రాజ్యాన్ని తెలుగు రాజ్యంలో కలిపేశారు ఆ మెట్ట రాజు. మాటపై నిలబడటమంటే ఏమిటో తెలియని చంద్రవంశ రాజు ఎప్పటిలానే మెట్ట రాజుకు ఇచ్చిన మాట కూడా తప్పారు. ఇస్తానన్న కొలువులో చోటు లేదనడంతో మెట్ట రాజు ఖంగుతిన్నాడు. మొదటిది సరే రెండోదేమిటి..? మెట్ట రాజుకు చంద్రవంశ రాజు ఇచ్చిన రెండో తాయిల హామీ గుర్తుకు వచ్చింది. ‘దుడ్డు’ కష్టాలు తీర్చాలని చంద్రవంశ రాజు వద్దకు అప్పట్లో రాయబారం పంపించారు. చంద్రవంశ రాజు ఇచ్చిన మణులు మాటెలా ఉన్నా తన రాజ్యానికి సరిహద్దున›‘కోట’ రాజ్యంలో తన అనుచరులకు ఉన్న విలువైన ఆస్తి గుర్తుకు వచ్చింది. కొలువు ఎలానూ ఇవ్వలేదు, కనీసం పొరుగు రాజ్యంలో ఆస్తయినా సొమ్ము చేసుకునే మార్గం చూపెట్టాలని దూతల ద్వారా విన్నవించుకున్నారు. పొరుగు రాజ్యంలో ఉన్న ఆస్తి మార్కెట్ విలువ రూ.75 నుంచి రూ.100 కోట్లు ఉంటుంది. మెట్ట రాజుకు ఆయాచిత లబ్ధి చేకూరేలా ఆ ఆస్తి విలువ తక్కువచేసి చూపించారు. అంతే కాకుండా రాజ దర్బారుకు జమ చేయాల్సిన కప్పం కూడా సగానికి సగం తగ్గించేశారు. ఈ రాచకార్యం చక్కబెట్టే బాధ్యతను చంద్రవంశ రాజు తన వారసుడైన చినబాబుకు అప్పగించారు. మొత్తం మీద రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఆస్తి సొమ్ము చేసుకునే అవకాశం దక్కడంతో మెట్ట రాజు బాగా బలపడ్డారని జనంలో చర్చ జోరందుకుంది. అలాగే రాజు కూడా వ్రతం చెడినా ఫలం దక్కిందని ఖషీగానే ఉన్నారు. కానీ జనమే నష్టపోయారు. నమ్మి సింహాసనాన్ని అధిష్టింపంజేస్తే రాజు ఇదేనా చేసేదని ప్రశ్నిస్తున్నారు. -(లక్కింశెట్టి శ్రీనివాసరావు) -
రణమా? శరణమా?
అధినేతపై కాలుదువ్విన సీనియర్ నేత యుద్ధం ప్రకటించి తటపటాయింపు అయోమయంలో అనుచర గణం తూర్పు తీరం.. ఈ వారం (లక్కింశెట్టి శ్రీనివాసరావు) అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్నీ తానై చక్రం తిప్పిన తలపండిన రాజకీయ నాయకుడాయన. ఎన్టీఆర్ నమ్మిన బంటుల్లో ఒక బంటు ఆయన. ఒకటీ రెండూ కాదు.. రాజకీయాల్లో ఏకంగా ఆరు పదుల వయసు దాటిన ఆరితేరిన నాయకుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ వృద్ధ నేతకు అసలు సీటు ఇవ్వడానికి అధినేత ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేశారు. చారిత్రక నగరంలో సీటు ఆశించగా.. దానికి పొరుగున ఉన్న స్థానం ఇవ్వడంతో ఎలాగోలా సర్దుకుని ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటువంటి నాయకుడు.. సీనియర్ ఎమ్మెల్యే.. మంత్రి పదవి ఆశించడంలో తప్పేముంటుంది? ఇప్పుడున్న మంత్రులకు మించిన అర్హతలు తనకున్నాయని ఆయన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఎంతోæ అనుభవ శూరుడినైన తనకే మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహావేశాలతో అధినేతపైనే కత్తి దూసి యుద్ధరంగంలోకి దూకేశారు. ఎంతటి ధీశాలైనా ఆయుధాలు సిద్ధం చేసుకున్నాకే బరిలోకి దిగుతాడు. ఒకసారంటూ దిగాక మరణమా? శరణమా? రెండింటిలో ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆ నాయకుడు అధినేతపై మాటల తూటాలైతే పేల్చారు తప్పితే.. యుద్ధానికి ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. అందుకు ఆయనకు ధైర్యం సరిపోవడం లేదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆ నేత పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించిన రోజు చూపిన దూకుడు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. రాజీనామా ఉపసంహరణపై అధినేత నుంచి రాయబారం వస్తుందని ఆశిస్తున్నారని, అందువల్లనే మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటికి అధినేతకంటే చిన్నవాడైన ఓ నాయకుడు వచ్చాడు. ఆయన కూడా తనకున్న పరిచయంతోనే కలిసేందుకు వచ్చానని చెప్పారు. అంటే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతను పూర్తిగా సోదిలో లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే అధినేత విడిచిపెట్టేశారా? అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అడుగు ముందుకేశాక ఆలోచనెందుకో? అసలు యుద్ధానికి కాలు దువ్వినప్పుడే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అటువంటిది ముందుకు అడుగు వేసేశాక ఇప్పుడు ఆలోచించడానికేముంటుంది? అధినేత ఏమైనా సామాన్యుడా? పదవి కోసం పిల్లనిచ్చిన మామ, మహా నాయకుడినే వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న ఘనుడు. అటువంటి నేతను ఢీకొట్టేందుకు ముందుకు వచ్చాక ఇక వెనక్కు తగ్గకూడదు. తగ్గారో చతుర్విధ ఉపాయాల్లో ఆరితేరిపోయిన ఆ అధినేత ముందు నిలవడం కష్టమే. యుద్ధ క్షేత్రంలో ముందుకు వెళ్లడమా లేక అస్త్రాలు విడిచిపెట్టి వెనకడుగు వేయడమా తేల్చుకోలేక నాలుగురోడ్ల కూడలిలో నిలబడ్డట్టుగా ఉంది ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి. అన్నీ తెలిసిన నాయకుడి పరిస్థితే అలా ఉండడంతో.. ఇక ఆయననే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న అరడజను మంది వందిమాగదులు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. గాలికొదిలేసినట్టేనా? రాష్ట్రంలో మంత్రి పదవులు రాని ఎందరో అసంతృప్తవాదులను బుజ్జగింపులు, హెచ్చరికలతో దారికి తెచ్చుకున్న బాబు.. ఈ వృద్ధతరం నేతను గాలికొదిలేశారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి తప్పు చేశామా అని ఆ నాయకుడు అంతర్మధనం చెందుతున్నారని కేడర్ చెబుతోంది. మరోపక్క అధినేత రాయబారం పంపకపోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. రాష్ట్రంలో మరే నాయకుడూ ఈ సీనియర్ ఎమ్మెల్యే స్పందించిన స్థాయిలో స్పందించ లేదనే చెప్పొచ్చు. అందుకే పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఏమైనా ఆదేశాలు వస్తాయా? అనే మీమాంసలో కూడా ఆ నాయకుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇదే అవకాశంగా ఈ వృద్ధ నాయకుడంటే పడని మరో ఇద్దరు నేతలు అధిష్టానం నిర్ణయం కోసం కాచుకుని కూర్చున్నారు. నగరంలో పార్టీ పగ్గాలు తమలో ఒకరికి అప్పగిస్తారనుకుంటూ ఆశల పల్లకీలో వారిద్దరూ ఊరేగుతున్నారు. అధినేతపై విమర్శలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ నాయకుడు లేకుండా వారిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలను ఆర్భాటంగా చేస్తున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల దగ్గర నుంచి, చినబాబు జిల్లా పర్యటన వరకూ అన్నింటా తామే అన్నట్టుగా వారిద్దరూ చేసుకుపోవడం వెనుక చారిత్రక నగరంలో పార్టీని గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో తన తనయుడికి పగ్గాలు అప్పగించాలని పరితపిస్తున్న ఓ నాయకుడు అధినేతకు పితూరీలపై పితూరీలు మోస్తున్నారట! అధినేత మనసులో ఏముందో, తలపండిన నాయకుడి భవిష్యత్తు ఏమవుతుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
మాయమైపోతున్నదమ్మా...
పేట్రేగిపోతున్న పోలీసుల పైశాచికత్వం మహిళలపై అమానుష దాడులు (లక్కింశెట్టి శ్రీనివాసరావు) రానురానూ మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషి ప్రాణాలకు విలువనేదే లేకుండాపోతోంది. రూ.50 వేలు, లక్ష, .. రెండు లక్షలు, రూ.5 లక్షలు.. ప్రాణానికి ఖరీదుకట్టే రేట్లివీ...ఇందులో పాలకులకు నచ్చినోడి ప్రాణమైతే ఒక రకంగాను, పాలక పక్షానికి వ్యతిరేకమైతే మరో రకంగా.. నిర్ణయించి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. పాలకులను మించి పోలీసులు ప్రభు భక్తిని చాటుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సందర్భాల్లో పోలీసు లు మానవత్వంతో బాధ్యతలు నిర్వర్తించాలి. మిగతా సందర్భాల మాటెలా ఉన్నా కనీసం మానవత్వంతో వ్యవహరించాల్సినప్పుడు కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిర్ఘాంతపరుస్తోంది. పాలకు లు చెప్పినట్టే నడుచుకోవడం తప్ప సమాజంపై తమకంటూ ఒక బాధ్యత ఉందని, తాము కూడా మనుషులమేనన్న విషయాన్ని మరిచిపోతున్నారు పోలీసులు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్న ఒకటి, రెండు సంఘటనలు మచ్చుకు పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మహా శివరాత్రి శుక్రవారం. జిల్లా అంతటా గోదావరి, సాగర సంగమాల్లో వేలాదిమంది భక్తులు తెల్లవారు జాము నుంచే స్నానాల్లో మునిగితేలారు. ఆ సమయంలోనే రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో తల్లికి పిండ ప్రదానం పెట్టిన సంతృప్తి కూడా మిగల్చకుండా మూడు పదులు వయసు దాటిన తనయుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యాడు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి చెందిన గొల్లకోటి రాంబాబు (32) పుష్కర ఘాట్‌లో వీరభద్రస్వామికి పూజలు చేసి బయటకు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. గత పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయినా..తాజాగా అదే ఘాట్‌లో యువకుడికి నూరేళ్లు నిండిపోయినా..ఈ రెండు సందర్భాల్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపించింది. రాంబాబు రోజంతా ఆటో తోలితే వచ్చే చిరు ఆదాయంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి అప్పారావుతోపాటు భార్య వరలక్ష్మి, ఐదేళ్లలోపు ఇద్దరు బిడ్డలను కనాకష్టంగా పోషించుకుంటున్నాడు. పుష్కర ఘాట్‌లో విద్యుత్‌షాక్‌కు గురైన రెండు గంటల వరకు రాంబాబుకు అసలు వైద్యమే అందలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. కళ్లెదుటే విగతజీవిగా మారిన భర్త, చేతుల్లో ఉన్న ఊహ తెలియని ఇద్దరు బిడ్డల భవితవ్యం తలచుకొని వరలక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. బాధ్యత గుర్తు చేస్తే అరెస్టులా... ఆ సమయంలో కుటుంబాన్ని ఆదుకోవాలని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగింది. ఆ సందర్భంలో పోలీసులు అనుసరించిన తీరు విమర్శలపాలైంది. భర్త చనిపోయి శోకసంద్రంలో ఉన్న భార్యను మానవతా దృక్పథంతో చేతనైతే ఓదార్చాల్సింది పోయి అమానుషంగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ. భర్త చనిపోయి రెండు గంటలు కూడా కాలేదు. న్యాయం కోసం ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనలో అంతటి శోకంలో కూడా ఆమె పాలుపంచుకుందంటే ఆ మహిళ గుండె ఎంత దిటవు చేసుకుందో మానవత్వం ఉన్నవారికెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సంఘ సంస్కర్త వీరేశలింగం తొలి వితంతు వివాహం చేసిన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం గడ్డపై ఒక మహిళ విషయంలో పోలీసులు ఇలా వ్యవహరిస్తారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదేమి న్యాయం... లాలాచెరువు వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలను ఈడ్చుకుంటూ పోయారు. పాలకులు, వారు చెప్పినట్టు ఆడే పోలీసులకు ఆ ఆందోళన రాజకీయంగా కనిపించవచ్చు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ అభాగ్యురాలిని కూడా రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించి స్టేషన్‌కు తరలించడమంటే ఏమనుకోవాలి. రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోమనడమే ఆమె చేసిన నేరమా? రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులందరికీ బాస్ ఐపీఎస్ అధికారి బి.రాజకుమారి. ఆమె ఒక మహిళ. తాను ఎస్పీగా ఉన్న ప్రాంతంలో సాటి మహిళల పట్ల పోలీసులు ఈ తీరున వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. లాలా చెరువు వద్ద ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది పడి ఉంటే తమ బాధ్యత నిర్వర్తించకుండా పోలీసులను ఎవరు ఆపలేరు. ప్రతిపక్ష నేతల అరెస్టు, స్టేషన్‌కు తరలింపు విధుల్లో భాగమే. దానిని కూడా ఎవరూ తప్పుపట్టరు. అదే సందర్భంలో భర్త చనిపోయి రెండు, మూడు గంటలు కూడా కాలేదు. అటువంటి మహిళ పట్ల ఇలానా పోలీసులు వ్యవహరించేదని అక్కడున్నవారి ప్రశ్న. గతంలోనూ ఇదే తీరు... రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పాలకులకు, పోలీసులకు ఇదేం కొత్తకాదు. సీతానగరం మండలం జాలిమూడిలో ఇసుక లారీ ఢీకొని మామిడి దుర్గ మృతి చెందినప్పుడు కూడా పాలకులు ఇలానే వ్యవహరించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ప్రతిపక్షం ఆందోళన చేస్తే ఇప్పటికీ ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వలేదు. రాజమహేంద్రవరంలో వాంబే గృహాల్లో అడ్డగోలు కేటాయింపులపై తిరగబడ్డ మహిళలపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నోరుపారేసుకోవడమే కాకుండా తన అనుచరులను ఉసిగొల్పి దాడికి తెగబడ్డ సంఘటన ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. తూర్పు సెంటిమెంట్‌గా పరిగణించే తునిలోని తొండంగి తీరంలో దివీస్ రసాయన తయారీ పరిశ్రమ వద్దంటూ పిల్లాపాపలతో ఆందోళన చేస్తున్న మహిళలపై అక్కడి పోలీసులు తీరు కూడా దాదాపు ఇదే. ప్రజా పోలీస్ తమ ధ్యేయమని గొప్పలకుపోయే పోలీసు బాస్‌లు మహిళల విషయంలో తీరుమారేలా ఎప్పుడు ప్రవర్తిస్తారో మరి.... -
ముగ్గురూ..ముగ్గురే..
కూలీలను పీక్కుతింటున్న సామంతులు (లక్కింశెట్టి శ్రీనివాసరావు) ఒకప్పుడు బొబ్బిలి వంశంలో తాండ్రపాపారాయుడు ఏలిన మెట్ట సామ్రాజ్యమది. ఆ సామ్రాజ్యంలో ఏ పంట వేసినా పండేది కాదు. ఆప్పట్లో ప్రజలు కరువుతో కటకటలాడిపోయి తినడానికి తిండి గింజలు కూడా ఉండేవి కావట. ఏ పంట వేసినా పాడైపోతూనే ఉండేవట. ఆ రాజ్యంలో ‘ప్రతీదీ పాడే’ అని కన్నీరుపెట్టే వారట. అందుకే ఆ రాజ్యం పేరు కూడా ప్రతీదీ పాడేలా మారిపోయింది. అటువంటి రాజ్యాన్ని ఇప్పుడు ఏలుతున్న మెట్ట రాజుకు ముగ్గురు శిషు్యలు. వారు మూడు పరగణాలను గుప్పెట్లో పెట్టుకున్నారు. ముగ్గురిలో పెద్దపల్లి సామంతుడు రాజుకు అత్యంత ఆప్తుడు. రెండో సామంతుడు ఈ రాజ్యాన్ని ఏలి దివంగతుౖడైన ఒక చిట్టిబాబు రాజుకు ఆంతరంగికుడిగా పనిచేయగా, మూడో సామంతుడు చిన్నపాటి పరగణాకు పాల కుడు. రాజు ముగ్గురికీ మూడు పరగణాలు రాసి ఇచ్చేయగా జ నంపై పడి పీక్కుతింటున్నారు. ఆ రాజ్యంలోనిదే ఒక గ్రామం. దానిపేరు చిన్నిపేట. చంద్రవంశరాజు నిర్మిస్తానంటున్న అమరావతి రాజధానికి అది 250 కిలోమీటర్లు దూరంలో ఉంది. జలగలను తలపిస్తూ... అమరావతిలో చంద్రవంశ రాజు రైతుల భూములను అడ్డంగా లాగేసుకుంటుంటే ఇక్కడ సామంతులు కూలీల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. చిన్నిపేటలో థాయిలాండ్ రాజు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాడు. అమెరికా రాజ్యానికి డాలర్లు కురిపించే రొయ్యల కడుపునింపే కర్మాగారాన్ని పెట్టారు. దానివల్ల రాజ్యంలో కాలుష్యంతో అనారోగ్యాలపాలవుతారని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మెట్ట రాజు, సామంతులు థాయిలాండ్ రాజ్యంపై ప్రజలతో కలిసి తిరుగుబాటు చేసి పెద్ద పేరు సంపాదించారు. చూసిన జనం రాజు, సామంతులు ఎంత మంచి పనిచేస్తున్నారో అని సంబరాలు చేసుకున్నారు. జనానికి ఆ సంబరాలు ఎన్నో రోజులు నిలవలేదు. ఎందుకంటారా ప్రజలకు తెలియకుండా మెట్ట రాజు, సామంతులు కలిసిపోయి విదేశీయులతో రహస్య ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే ఆ కర్మాగారం జోలికి ప్రజలు రారని లేఖ ఇచ్చారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కర్మాగారానికి ఎటువంటి ఆటంకం ఉండదని ప్రజల తరఫున మెట్టరాజు, ముగ్గురు సామంతులు వేగుల ద్వారా ఒప్పంద పత్రాలు పరస్పరం మార్చుకున్నారు. కూలీల సొమ్ములో కక్కుర్తి... కర్మాగారంలో పనికి ఆ రాజ్యంలోని పరిసర పల్లెల నుంచి 200 మంది కూలీలను పంపిస్తున్నారు. కూలీలను పంపించడం, వారికి జీత భత్యాలు ఇవ్వడంలో ముగ్గురు సామంతులదే పెత్తనం. అంటే నేరుగా థాయిలాండ్ ప్రతినిధులతో కూలీలకు ఎంటువంటి సంబంధం లేదన్న మాట. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లే కూలీలు సాయంత్రం ఆరు గంటల వరకు రెక్కలు ముక్కలు చేసుకుని అందులో పనిచేస్తున్నారు. పనికి వెళ్లే వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు, బలహీన వర్గాలే. ఎగుమతి, దిగుమతి, క్లీనింగ్, రసాయనాల మిశ్రమాలు కలపడం, చుట్టూ గార్డె¯ŒS శుభ్రం చేయడం...ఇలా రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా ఎనిమిది గంటలు పనిచేసే కూలీకి థాయ్‌ల్యాండ్ కంపెనీ రూ.428 చొప్పున కూలీ డబ్బును సామంతుల చేతిలో పెడుతోంది. నేరుగా కూలీల చేతిలో పెట్టొచ్చు. కానీ ఆ ముగ్గురు సామంత రాజులు, థాయ్ ప్రతినిధుల మధ్య గత మార్చిలో జరిగిన రహస్య ఒప్పందంతో కూలీలకు జీతం నేరుగా వెళ్లడం లేదు. ఒక్కో కూలీకి రూ.428 కూలీ సామంత రాజుల చేతిలో పెడితే వారు రూ.128లు కప్పంగా జమ చేసుకుంటున్నారు. మిగిలిన రూ.300లే కూలీలకు ఇస్తున్నారు. అలా ఒక్కొక్క కూలీ వద్ద రోజుకు రూ.128లు చొప్పున నెలకు రూ.3840లు సామంతులు నొక్కేస్తున్నారు. అలా 200 మంది కూలీల వద్ద నెలకు సుమారు రూ.7.87 లక్షలు సామంతుల జేబుల్లోకి పోతోంది. ఇలా కూలీల రెక్కల కష్టాన్ని దోచుకుంటుండగా థాయ్ ప్రతినిధులతో చేసుకున్న ఒప్పంద గడువు దగ్గరపడింది. ఆ ప్రాంతంలో రైతులకు మేలు చేయాలని థాయ్ ప్రతినిధులపై రాజు, సామంతులు సైన్యాన్ని వెంటేసుకు వెళ్లి మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎన్నో సముద్రాలు దాటి వచ్చిన ఆ థాయ్ ప్రతిని««దlులకు వారిని ఎదుర్కొనే సత్తా లేక వారు చెప్పినట్టే కూలీల ఒప్పందాన్ని పొడిగించారు. ఆ రాజు, ముగ్గురు సామంతులు సంతోషంగా గుర్రంపై స్వారీ చేస్తూ తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. ఇంతలో నాలుగు మాసాలుగా నిగ్రహం వహించిన జనం నుంచి ముగ్గురు సామంతుల దోపిడీపై మొదలైన తిరుగుబాటుకు ఎర్రజెండాలు కూడా తోడయ్యాయి. ప్రజా తిరుగుబాటుపై రాజు, సామంతులకు ఎప్పటికప్పుడు వేగులు సమాచారాన్ని సేకరించి చెవిలో వేస్తున్నారు. ఇలా ఎంతకాలం ఈ దోపిడీ జరుగుతుందో, ఎప్పటికి ఈ పాలనకు తెరపడుతుందా అని జనం రచ్చబండలపై చర్చించుకుంటున్నారు. -
రావుబహదూర్ ఆత్మక్షోభ
పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని అభిలషించే వారు. పాలన కూడా అలానే సాగేది. అటువంటి రాజ్యాల సరసన ఉండేది పీఠికాపుర రాజ్యం. ఆ రాజ్యం 18వ శతాబ్దం నుంచి 1930 వరకూ రావుబహదూర్ వంశస్థుల ఏలుబడిలో ఉంది. ఆ రాజ్యాన్ని పాలించిన రాజ వంశీయుల్లో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్ చివరి రాజు. ఆ వంశీయులంతా స్త్రీ జనోద్ధరణ, వితంతు వివాహాలు, బడుగుల అభ్యున్నతి, దళిత జనోద్ధరణ సహా తెలుగు భాషకు నిఘంటువు కూడా వారి కాలంలోనే రూపుదిద్దుకుంది. ఆ రాజులంతా కోట్ల విలువైన ఆస్తులు (పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీ, శ్రీ సంస్థానం, కాకినాడ పీఆర్ కాలేజీ) ఇవన్నీ పేదల కోసం పీఠికాపుర రాజ వంశీయులు అప్పగించిన కోట్లు విలువైన ఆస్తుల్లో మచ్చుకు కొన్ని. నాటి రాజవంశీయులు ప్రజల కోసం కోట్ల విలువైన ఆస్తులను ధారపోసేవారు. రాచరికం పోయి, రాజుల శకం ముగిసిపోయింది. అటువంటి రాజ్యంలో ‘చంద్ర’వంశ ‘బాబు’ కుటిల రాజకీయ వ్యూహాన్ని నమ్మిన ప్రజలు ఆధునిక రాజును సింహాసనంలో కూర్చోబెట్టారు. సింహాసనాన్ని అధిష్టించే వరకూ పూర్వం రాజులు మాదిరిగా ఆ రాజ్యంలో ప్రజలకు కానుకలు కురిపిస్తూ...అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. తీరా సింహాసనాన్ని అధిష్టించాక రాజు నిజరూప దర్శనం చూసి సామాన్యులు తట్టుకోలేక పోతున్నారు. ప్రజల సంక్షేమంకంటే ఐదు పరగణాలను ఏలుతున్న సామంతులు, వారి మందీమార్బలం సంక్షేమాన్నే చూసుకుంటున్న తీరుతో ఆ రాజ్యంలో జనం విసుగెత్తిపోయారు. ఇటీవల ‘చంద్ర’వంÔ¶, ‘బాబు’ అన్ని రాజ్యాలతోపాటు ఆ రాజ్య ప్రజలకు రెండు వేలకు పైనే సంక్షేమ ఫలాలు పంపించారు. ఈ రాజ్యంలో తాడిత, పీడిత జనానికి చేరాల్సిన ఫలాలు సామంతులు, రాజుకు నమ్మిన పరివారం చెప్పిన వారికి ధారపోశారు. దాదాపు ఐదు పరాగణాల్లోనూ ఇదే తీరున మెచ్చిన వారికి నచ్చినట్టు పంచిపెట్టేశారు. ఈ విషయం ఐదు పరగణాలు కలిగిన ఆ పీఠికాపుర మందిరంలో రాజ గురువుల మధ్య చర్చకు వచ్చింది. ఆ ఫలాలు బీదబిక్కికి చేరలేదనే విషయం బ్రిటిష్ పాలనా కాలంలో పీఠికాపురానికి పక్కనే ఉన్న కో–కెనడాలో వేగులు విచారించారు. రహస్యంగా సమాచారాన్ని సేకరించిన వేగులు చంద్రవంశ బాబుకు చెవిలో వేశారు. ఆ రాజ్యంలో జరిగిన దుర్నీతిలో భాగస్వామ్యులైన వారి సమాచారాన్ని రెండు, మూడు జాబులుగా గుట్టుగా వేగులను పంపించారు. ఈ విషయం రాజ్యంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న ఒక ప్రధాన రక్షక భటుడు ద్వారా తెలుసుకున్న రాజు చాలా కలత చెందుతున్నాడు. ఏదోరకంగా చక్రవర్తి కావాలనే ఆయన కల ఈ దెబ్బతో చెదిరిపోయింది. బెంగపెట్టుకున్న రాజు పొరుగు రాజ్యంలో సేదతీరి తిరిగొచ్చాడు. మాట వినని ఆ రాజు ఇట్టే ఇతరులను ఆడిపోసుకోవడం ఆ రాజుకు అలవాటు. అటువంటి రాజు మారువేషంలో రాజ్య సంచారం చేస్తుంటే ఏ మూలకెళ్లినా తన ప్రోద్బలంతోనే అనుచరగణం తప్పులు చేశారని చెప్పుకుంటున్న జనం మాటలు చెవినపడటంతో అంతఃపురానికే పరిమితమయ్యారు. రెండు రోజులు గడిచాక బయటపడే మార్గాన్ని చూపించాలని రాజ గురువులను ఆశ్రయించాడు రాజు. ఇందులో పాపం పుణ్యం తనకు తెలియదని, ఆదేశాలు ఇచ్చింది తానే కానీ అమలు చేసిన కొత్వాల్దే తప్పు అన్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్న రాజును చూసి ఆ రాజ్యమే విస్తుబోతోంది. ఈ విషయం తెలిసిన రాజ వంశీయుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయోనని రాజ్యంలోని ప్రజలు మదనపడుతున్నారు. –(లక్కింశెట్టి శ్రీనివాసరావు) -
ఏసీబీకి చిక్కిన ఈఈ నాగశేషు
నల్లగొండ (నల్లగొండ క్రైం) : ఆరు నెలల క్రితం వరంగల్ జిల్లా నుంచి జిల్లా విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈఈగా బాధ్యతలు స్వీకరించిన నాగశేషు రూటే సెప‘‘రేటు’’గా ఉంది. చేసిన పనికి లంచం ఇవ్వకపోతే బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఓ సివిల్ కాంట్రాక్టర్ సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచగొండి అధికారిని రెడ్‌హ్యాండ్‌గా పట్టించడంతో కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేగింది. ఈ సమాచారం కలెక్టరేట్ ఉద్యోగులందరికి చేరడంతో గుండెల్లో గుబులు పుట్టినటై్టంది. జిల్లా కేంద్రానికి చెందిన జి.నవీన్‌కుమార్ ఐదేళ్లుగా సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అందులో భాగంగా భునవగిరి, రాజాపేట రెసిడెన్షియల్ పాఠశాలలో రూ.10 లక్షల విలువైన వాటర్ సంపులను ఆగస్టు నెలలో పూర్తి చేశాడు. చేసిన పనికి బిల్లు చెల్లించాలని ఈఈ నాగశేషుకు విజ్ఞప్తి చేయగా అందుకు రూ.30 వేలు లంచంగా ఇవ్వాలని, అలా అయితేనే బిల్లు చెల్లిస్తానని మొండికేశాడు. దీంతో కాంట్రాక్టర్ నవీన్‌కుమార్ బతిమిలాడి రూ.27 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్‌రావును ఆశ్రయించి అధికారి లంచం విషయమై ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని లంచం ఇస్తుండగా కలెక్టరేట్లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో నేరుగా పట్టుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. సంక్షేమ శాఖ నుంచి ఏ పని చేసినా కాంట్రాక్టర్లను పని పక్కాగా చేయిస్తూ... లంచం కూడా పక్కాగా ఇస్తేనే బిల్లుల చెల్లిస్తాడని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పని పక్కా చేసినప్పుడు లంచం ఎలా ఇవ్వగలుతామని కాంట్రాక్టర్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అవ్వా కావాలి... బువ్వా కావాలి అనే చందంగా వ్యవహరించడం వల్లనే ఈఈ నాగశేషును ఏసీబీకి పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చెల్లించిన బిల్లులపైన, అక్రమ ఆస్తులపైన ఏసీబీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అక్రమ ఆస్తులపై విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
పంచాయతీరాజ్ ఈఈ ఇంట్లో సోదాలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈఈ దుర్గాప్రసాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. శనివారం విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఐదు బృందాలు విశాఖ, రాజమండ్రిలో దుర్గా ప్రసాద్‌కు చెందిన నివాసాలతో పాటు పనిచేస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఐదు ఖరీదైన స్థలాలు, రెండు డూప్లెక్స్ ఇళ్లు, పావు కిలో బంగారం, మూడు కిలోల వెండి వస్తువులు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.లక్ష నగదు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. -
ఏసీబీ వలకు చిక్కిన ఈఈ
కర్నూలు: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గోస్పాడు ఈఈ రామచంద్రుడు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.