రణమా? శరణమా?
Published Sat, Apr 22 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
అధినేతపై కాలుదువ్విన సీనియర్ నేత
యుద్ధం ప్రకటించి తటపటాయింపు
అయోమయంలో అనుచర గణం
తూర్పు తీరం.. ఈ వారం
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్నీ తానై చక్రం తిప్పిన తలపండిన రాజకీయ నాయకుడాయన. ఎన్టీఆర్ నమ్మిన బంటుల్లో ఒక బంటు ఆయన. ఒకటీ రెండూ కాదు.. రాజకీయాల్లో ఏకంగా ఆరు పదుల వయసు దాటిన ఆరితేరిన నాయకుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ వృద్ధ నేతకు అసలు సీటు ఇవ్వడానికి అధినేత ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేశారు. చారిత్రక నగరంలో సీటు ఆశించగా.. దానికి పొరుగున ఉన్న స్థానం ఇవ్వడంతో ఎలాగోలా సర్దుకుని ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటువంటి నాయకుడు.. సీనియర్ ఎమ్మెల్యే.. మంత్రి పదవి ఆశించడంలో తప్పేముంటుంది? ఇప్పుడున్న మంత్రులకు మించిన అర్హతలు తనకున్నాయని ఆయన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఎంతోæ అనుభవ శూరుడినైన తనకే మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహావేశాలతో అధినేతపైనే కత్తి దూసి యుద్ధరంగంలోకి దూకేశారు.
ఎంతటి ధీశాలైనా ఆయుధాలు సిద్ధం చేసుకున్నాకే బరిలోకి దిగుతాడు. ఒకసారంటూ దిగాక మరణమా? శరణమా? రెండింటిలో ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆ నాయకుడు అధినేతపై మాటల తూటాలైతే పేల్చారు తప్పితే.. యుద్ధానికి ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. అందుకు ఆయనకు ధైర్యం సరిపోవడం లేదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆ నేత పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించిన రోజు చూపిన దూకుడు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. రాజీనామా ఉపసంహరణపై అధినేత నుంచి రాయబారం వస్తుందని ఆశిస్తున్నారని, అందువల్లనే మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటికి అధినేతకంటే చిన్నవాడైన ఓ నాయకుడు వచ్చాడు. ఆయన కూడా తనకున్న పరిచయంతోనే కలిసేందుకు వచ్చానని చెప్పారు. అంటే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతను పూర్తిగా సోదిలో లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే అధినేత విడిచిపెట్టేశారా? అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అడుగు ముందుకేశాక ఆలోచనెందుకో?
అసలు యుద్ధానికి కాలు దువ్వినప్పుడే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అటువంటిది ముందుకు అడుగు వేసేశాక ఇప్పుడు ఆలోచించడానికేముంటుంది? అధినేత ఏమైనా సామాన్యుడా? పదవి కోసం పిల్లనిచ్చిన మామ, మహా నాయకుడినే వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న ఘనుడు. అటువంటి నేతను ఢీకొట్టేందుకు ముందుకు వచ్చాక ఇక వెనక్కు తగ్గకూడదు. తగ్గారో చతుర్విధ ఉపాయాల్లో ఆరితేరిపోయిన ఆ అధినేత ముందు నిలవడం కష్టమే. యుద్ధ క్షేత్రంలో ముందుకు వెళ్లడమా లేక అస్త్రాలు విడిచిపెట్టి వెనకడుగు వేయడమా తేల్చుకోలేక నాలుగురోడ్ల కూడలిలో నిలబడ్డట్టుగా ఉంది ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి. అన్నీ తెలిసిన నాయకుడి పరిస్థితే అలా ఉండడంతో.. ఇక ఆయననే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న అరడజను మంది వందిమాగదులు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు.
గాలికొదిలేసినట్టేనా?
రాష్ట్రంలో మంత్రి పదవులు రాని ఎందరో అసంతృప్తవాదులను బుజ్జగింపులు, హెచ్చరికలతో దారికి తెచ్చుకున్న బాబు.. ఈ వృద్ధతరం నేతను గాలికొదిలేశారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి తప్పు చేశామా అని ఆ నాయకుడు అంతర్మధనం చెందుతున్నారని కేడర్ చెబుతోంది. మరోపక్క అధినేత రాయబారం పంపకపోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. రాష్ట్రంలో మరే నాయకుడూ ఈ సీనియర్ ఎమ్మెల్యే స్పందించిన స్థాయిలో స్పందించ లేదనే చెప్పొచ్చు. అందుకే పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఏమైనా ఆదేశాలు వస్తాయా? అనే మీమాంసలో కూడా ఆ నాయకుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
ఇదే అవకాశంగా ఈ వృద్ధ నాయకుడంటే పడని మరో ఇద్దరు నేతలు అధిష్టానం నిర్ణయం కోసం కాచుకుని కూర్చున్నారు. నగరంలో పార్టీ పగ్గాలు తమలో ఒకరికి అప్పగిస్తారనుకుంటూ ఆశల పల్లకీలో వారిద్దరూ ఊరేగుతున్నారు. అధినేతపై విమర్శలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ నాయకుడు లేకుండా వారిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలను ఆర్భాటంగా చేస్తున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల దగ్గర నుంచి, చినబాబు జిల్లా పర్యటన వరకూ అన్నింటా తామే అన్నట్టుగా వారిద్దరూ చేసుకుపోవడం వెనుక చారిత్రక నగరంలో పార్టీని గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో తన తనయుడికి పగ్గాలు అప్పగించాలని పరితపిస్తున్న ఓ నాయకుడు అధినేతకు పితూరీలపై పితూరీలు మోస్తున్నారట! అధినేత మనసులో ఏముందో, తలపండిన నాయకుడి భవిష్యత్తు ఏమవుతుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Advertisement