రావుబహదూర్ ఆత్మక్షోభ
రావుబహదూర్ ఆత్మక్షోభ
Published Sun, Feb 12 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని అభిలషించే వారు. పాలన కూడా అలానే సాగేది. అటువంటి రాజ్యాల సరసన ఉండేది పీఠికాపుర రాజ్యం. ఆ రాజ్యం 18వ శతాబ్దం నుంచి 1930 వరకూ రావుబహదూర్ వంశస్థుల ఏలుబడిలో ఉంది. ఆ రాజ్యాన్ని పాలించిన రాజ వంశీయుల్లో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్ చివరి రాజు. ఆ వంశీయులంతా స్త్రీ జనోద్ధరణ, వితంతు వివాహాలు, బడుగుల అభ్యున్నతి, దళిత జనోద్ధరణ సహా తెలుగు భాషకు నిఘంటువు కూడా వారి కాలంలోనే రూపుదిద్దుకుంది. ఆ రాజులంతా కోట్ల విలువైన ఆస్తులు (పిఠాపురం ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ కాలేజీ, శ్రీ సంస్థానం, కాకినాడ పీఆర్ కాలేజీ) ఇవన్నీ పేదల కోసం పీఠికాపుర రాజ వంశీయులు అప్పగించిన కోట్లు విలువైన ఆస్తుల్లో మచ్చుకు కొన్ని.
నాటి రాజవంశీయులు ప్రజల కోసం కోట్ల విలువైన ఆస్తులను ధారపోసేవారు. రాచరికం పోయి, రాజుల శకం ముగిసిపోయింది. అటువంటి రాజ్యంలో ‘చంద్ర’వంశ ‘బాబు’ కుటిల రాజకీయ వ్యూహాన్ని నమ్మిన ప్రజలు ఆధునిక రాజును సింహాసనంలో కూర్చోబెట్టారు. సింహాసనాన్ని అధిష్టించే వరకూ పూర్వం రాజులు మాదిరిగా ఆ రాజ్యంలో ప్రజలకు కానుకలు కురిపిస్తూ...అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. తీరా సింహాసనాన్ని అధిష్టించాక రాజు నిజరూప దర్శనం చూసి సామాన్యులు తట్టుకోలేక పోతున్నారు. ప్రజల సంక్షేమంకంటే ఐదు పరగణాలను ఏలుతున్న సామంతులు, వారి మందీమార్బలం సంక్షేమాన్నే చూసుకుంటున్న తీరుతో ఆ రాజ్యంలో జనం విసుగెత్తిపోయారు. ఇటీవల ‘చంద్ర’వంÔ¶, ‘బాబు’ అన్ని రాజ్యాలతోపాటు ఆ రాజ్య ప్రజలకు రెండు వేలకు పైనే సంక్షేమ ఫలాలు పంపించారు. ఈ రాజ్యంలో తాడిత, పీడిత జనానికి చేరాల్సిన ఫలాలు సామంతులు, రాజుకు నమ్మిన పరివారం చెప్పిన వారికి ధారపోశారు. దాదాపు ఐదు పరాగణాల్లోనూ ఇదే తీరున మెచ్చిన వారికి నచ్చినట్టు పంచిపెట్టేశారు. ఈ విషయం ఐదు పరగణాలు కలిగిన ఆ పీఠికాపుర మందిరంలో రాజ గురువుల మధ్య చర్చకు వచ్చింది. ఆ ఫలాలు బీదబిక్కికి చేరలేదనే విషయం బ్రిటిష్ పాలనా కాలంలో పీఠికాపురానికి పక్కనే ఉన్న కో–కెనడాలో వేగులు విచారించారు. రహస్యంగా సమాచారాన్ని సేకరించిన వేగులు చంద్రవంశ బాబుకు చెవిలో వేశారు. ఆ రాజ్యంలో జరిగిన దుర్నీతిలో భాగస్వామ్యులైన వారి సమాచారాన్ని రెండు, మూడు జాబులుగా గుట్టుగా వేగులను పంపించారు.
ఈ విషయం రాజ్యంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న ఒక ప్రధాన రక్షక భటుడు ద్వారా తెలుసుకున్న రాజు చాలా కలత చెందుతున్నాడు. ఏదోరకంగా చక్రవర్తి కావాలనే ఆయన కల ఈ దెబ్బతో చెదిరిపోయింది. బెంగపెట్టుకున్న రాజు పొరుగు రాజ్యంలో సేదతీరి తిరిగొచ్చాడు. మాట వినని ఆ రాజు ఇట్టే ఇతరులను ఆడిపోసుకోవడం ఆ రాజుకు అలవాటు. అటువంటి రాజు మారువేషంలో రాజ్య సంచారం చేస్తుంటే ఏ మూలకెళ్లినా తన ప్రోద్బలంతోనే అనుచరగణం తప్పులు చేశారని చెప్పుకుంటున్న జనం మాటలు చెవినపడటంతో అంతఃపురానికే పరిమితమయ్యారు. రెండు రోజులు గడిచాక బయటపడే మార్గాన్ని చూపించాలని రాజ గురువులను ఆశ్రయించాడు రాజు. ఇందులో పాపం పుణ్యం తనకు తెలియదని, ఆదేశాలు ఇచ్చింది తానే కానీ అమలు చేసిన కొత్వాల్‌దే తప్పు అన్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్న రాజును చూసి ఆ రాజ్యమే విస్తుబోతోంది. ఈ విషయం తెలిసిన రాజ వంశీయుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయోనని రాజ్యంలోని ప్రజలు మదనపడుతున్నారు.
–(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
Advertisement