రాజుగారి తాయిలం రూ.100 కోట్లు
రాజుగారి తాయిలం రూ.100 కోట్లు
Published Sat, May 13 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
మెట్ట సీమలో ఆయనొక రారాజు. ఒకప్పుడు ఆయన పేరు చెబితే ‘తూర్పు’ సామాజ్య్రంలో ఎదురే లేదు. ఒంటిచేత్తో రాజ్యాన్ని నడిపించిన పేరు కూడా ఆయనదే. అటువంటి మెట్ట రాజ్యాన్ని ఏలుతున్న రాజు సొంత పనులు చక్కబెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నమ్మిన జనాన్ని ఏలేరులో వదిలేయడానికి నిర్ణయించేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ‘చంద్ర’వంశ రాజు దగ్గరున్న వేగులు ‘తెలుగు’రాజ్యంలో కలిపేస్తే రెండు తాయిలాలు ఇస్తామనే ప్రతిపాదనతో వచ్చారు. అందులో ఒకటి చంద్రవంశ రాజు కొలువులో మంత్రి, రెండో తాయిలాల కింద మణులు, మాణిక్యాలు. ఆ మెట్ట రాజ్యంలో జనం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకుంటారని జనం ఎదురు చూశారు. జనంతో తనకేం పని అన్నట్టు చంద్రవంశ రాజు మాటలు నమ్మి తన రాజ్యాన్ని తెలుగు రాజ్యంలో కలిపేశారు ఆ మెట్ట రాజు. మాటపై నిలబడటమంటే ఏమిటో తెలియని చంద్రవంశ రాజు ఎప్పటిలానే మెట్ట రాజుకు ఇచ్చిన మాట కూడా తప్పారు. ఇస్తానన్న కొలువులో చోటు లేదనడంతో మెట్ట రాజు ఖంగుతిన్నాడు.
మొదటిది సరే రెండోదేమిటి..?
మెట్ట రాజుకు చంద్రవంశ రాజు ఇచ్చిన రెండో తాయిల హామీ గుర్తుకు వచ్చింది. ‘దుడ్డు’ కష్టాలు తీర్చాలని చంద్రవంశ రాజు వద్దకు అప్పట్లో రాయబారం పంపించారు. చంద్రవంశ రాజు ఇచ్చిన మణులు మాటెలా ఉన్నా తన రాజ్యానికి సరిహద్దున›‘కోట’ రాజ్యంలో తన అనుచరులకు ఉన్న విలువైన ఆస్తి గుర్తుకు వచ్చింది. కొలువు ఎలానూ ఇవ్వలేదు, కనీసం పొరుగు రాజ్యంలో ఆస్తయినా సొమ్ము చేసుకునే మార్గం చూపెట్టాలని దూతల ద్వారా విన్నవించుకున్నారు. పొరుగు రాజ్యంలో ఉన్న ఆస్తి మార్కెట్ విలువ రూ.75 నుంచి రూ.100 కోట్లు ఉంటుంది. మెట్ట రాజుకు ఆయాచిత లబ్ధి చేకూరేలా ఆ ఆస్తి విలువ తక్కువచేసి చూపించారు. అంతే కాకుండా రాజ దర్బారుకు జమ చేయాల్సిన కప్పం కూడా సగానికి సగం తగ్గించేశారు. ఈ రాచకార్యం చక్కబెట్టే బాధ్యతను చంద్రవంశ రాజు తన వారసుడైన చినబాబుకు అప్పగించారు. మొత్తం మీద రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఆస్తి సొమ్ము చేసుకునే అవకాశం దక్కడంతో మెట్ట రాజు బాగా బలపడ్డారని జనంలో చర్చ జోరందుకుంది. అలాగే రాజు కూడా వ్రతం చెడినా ఫలం దక్కిందని ఖషీగానే ఉన్నారు. కానీ జనమే నష్టపోయారు. నమ్మి సింహాసనాన్ని అధిష్టింపంజేస్తే రాజు ఇదేనా చేసేదని ప్రశ్నిస్తున్నారు.
-(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
Advertisement
Advertisement