మాయమైపోతున్నదమ్మా...
మాయమైపోతున్నదమ్మా...
Published Sat, Feb 25 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
పేట్రేగిపోతున్న పోలీసుల పైశాచికత్వం
మహిళలపై అమానుష దాడులు
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
రానురానూ మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషి ప్రాణాలకు విలువనేదే లేకుండాపోతోంది. రూ.50 వేలు, లక్ష, .. రెండు లక్షలు, రూ.5 లక్షలు.. ప్రాణానికి ఖరీదుకట్టే రేట్లివీ...ఇందులో పాలకులకు నచ్చినోడి ప్రాణమైతే ఒక రకంగాను, పాలక పక్షానికి వ్యతిరేకమైతే మరో రకంగా.. నిర్ణయించి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. పాలకులను మించి పోలీసులు ప్రభు భక్తిని చాటుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సందర్భాల్లో పోలీసు లు మానవత్వంతో బాధ్యతలు నిర్వర్తించాలి. మిగతా సందర్భాల మాటెలా ఉన్నా కనీసం మానవత్వంతో వ్యవహరించాల్సినప్పుడు కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిర్ఘాంతపరుస్తోంది. పాలకు లు చెప్పినట్టే నడుచుకోవడం తప్ప సమాజంపై తమకంటూ ఒక బాధ్యత ఉందని, తాము కూడా మనుషులమేనన్న విషయాన్ని మరిచిపోతున్నారు పోలీసులు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్న ఒకటి, రెండు సంఘటనలు మచ్చుకు పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మహా శివరాత్రి శుక్రవారం. జిల్లా అంతటా గోదావరి, సాగర సంగమాల్లో వేలాదిమంది భక్తులు తెల్లవారు జాము నుంచే స్నానాల్లో మునిగితేలారు. ఆ సమయంలోనే రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో తల్లికి పిండ ప్రదానం పెట్టిన సంతృప్తి కూడా మిగల్చకుండా మూడు పదులు వయసు దాటిన తనయుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యాడు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి చెందిన గొల్లకోటి రాంబాబు (32) పుష్కర ఘాట్‌లో వీరభద్రస్వామికి పూజలు చేసి బయటకు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. గత పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయినా..తాజాగా అదే ఘాట్‌లో యువకుడికి నూరేళ్లు నిండిపోయినా..ఈ రెండు సందర్భాల్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపించింది. రాంబాబు రోజంతా ఆటో తోలితే వచ్చే చిరు ఆదాయంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి అప్పారావుతోపాటు భార్య వరలక్ష్మి, ఐదేళ్లలోపు ఇద్దరు బిడ్డలను కనాకష్టంగా పోషించుకుంటున్నాడు. పుష్కర ఘాట్‌లో విద్యుత్‌షాక్‌కు గురైన రెండు గంటల వరకు రాంబాబుకు అసలు వైద్యమే అందలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. కళ్లెదుటే విగతజీవిగా మారిన భర్త, చేతుల్లో ఉన్న ఊహ తెలియని ఇద్దరు బిడ్డల భవితవ్యం తలచుకొని వరలక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది.
బాధ్యత గుర్తు చేస్తే అరెస్టులా...
ఆ సమయంలో కుటుంబాన్ని ఆదుకోవాలని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగింది. ఆ సందర్భంలో పోలీసులు అనుసరించిన తీరు విమర్శలపాలైంది. భర్త చనిపోయి శోకసంద్రంలో ఉన్న భార్యను మానవతా దృక్పథంతో చేతనైతే ఓదార్చాల్సింది పోయి అమానుషంగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ. భర్త చనిపోయి రెండు గంటలు కూడా కాలేదు. న్యాయం కోసం ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనలో అంతటి శోకంలో కూడా ఆమె పాలుపంచుకుందంటే ఆ మహిళ గుండె ఎంత దిటవు చేసుకుందో మానవత్వం ఉన్నవారికెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సంఘ సంస్కర్త వీరేశలింగం తొలి వితంతు వివాహం చేసిన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం గడ్డపై ఒక మహిళ విషయంలో పోలీసులు ఇలా వ్యవహరిస్తారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.
ఇదేమి న్యాయం...
లాలాచెరువు వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలను ఈడ్చుకుంటూ పోయారు. పాలకులు, వారు చెప్పినట్టు ఆడే పోలీసులకు ఆ ఆందోళన రాజకీయంగా కనిపించవచ్చు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ అభాగ్యురాలిని కూడా రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించి స్టేషన్‌కు తరలించడమంటే ఏమనుకోవాలి. రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోమనడమే ఆమె చేసిన నేరమా? రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులందరికీ బాస్ ఐపీఎస్ అధికారి బి.రాజకుమారి. ఆమె ఒక మహిళ. తాను ఎస్పీగా ఉన్న ప్రాంతంలో సాటి మహిళల పట్ల పోలీసులు ఈ తీరున వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. లాలా చెరువు వద్ద ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది పడి ఉంటే తమ బాధ్యత నిర్వర్తించకుండా పోలీసులను ఎవరు ఆపలేరు. ప్రతిపక్ష నేతల అరెస్టు, స్టేషన్‌కు తరలింపు విధుల్లో భాగమే. దానిని కూడా ఎవరూ తప్పుపట్టరు. అదే సందర్భంలో భర్త చనిపోయి రెండు, మూడు గంటలు కూడా కాలేదు. అటువంటి మహిళ పట్ల ఇలానా పోలీసులు వ్యవహరించేదని అక్కడున్నవారి ప్రశ్న.
గతంలోనూ ఇదే తీరు...
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పాలకులకు, పోలీసులకు ఇదేం కొత్తకాదు. సీతానగరం మండలం జాలిమూడిలో ఇసుక లారీ ఢీకొని మామిడి దుర్గ మృతి చెందినప్పుడు కూడా పాలకులు ఇలానే వ్యవహరించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ప్రతిపక్షం ఆందోళన చేస్తే ఇప్పటికీ ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వలేదు. రాజమహేంద్రవరంలో వాంబే గృహాల్లో అడ్డగోలు కేటాయింపులపై తిరగబడ్డ మహిళలపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నోరుపారేసుకోవడమే కాకుండా తన అనుచరులను ఉసిగొల్పి దాడికి తెగబడ్డ సంఘటన ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. తూర్పు సెంటిమెంట్‌గా పరిగణించే తునిలోని తొండంగి తీరంలో దివీస్ రసాయన తయారీ పరిశ్రమ వద్దంటూ పిల్లాపాపలతో ఆందోళన చేస్తున్న మహిళలపై అక్కడి పోలీసులు తీరు కూడా దాదాపు ఇదే. ప్రజా పోలీస్ తమ ధ్యేయమని గొప్పలకుపోయే పోలీసు బాస్‌లు మహిళల విషయంలో తీరుమారేలా ఎప్పుడు ప్రవర్తిస్తారో మరి....
Advertisement
Advertisement