ఏసీబీకి చిక్కిన ఈఈ నాగశేషు
ఏసీబీకి చిక్కిన ఈఈ నాగశేషు
Published Mon, Oct 3 2016 10:11 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ (నల్లగొండ క్రైం) :
ఆరు నెలల క్రితం వరంగల్ జిల్లా నుంచి జిల్లా విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈఈగా బాధ్యతలు స్వీకరించిన నాగశేషు రూటే సెప‘‘రేటు’’గా ఉంది. చేసిన పనికి లంచం ఇవ్వకపోతే బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఓ సివిల్ కాంట్రాక్టర్ సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచగొండి అధికారిని రెడ్‌హ్యాండ్‌గా పట్టించడంతో కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేగింది. ఈ సమాచారం కలెక్టరేట్ ఉద్యోగులందరికి చేరడంతో గుండెల్లో గుబులు పుట్టినటై్టంది. జిల్లా కేంద్రానికి చెందిన జి.నవీన్‌కుమార్ ఐదేళ్లుగా సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అందులో భాగంగా భునవగిరి, రాజాపేట రెసిడెన్షియల్ పాఠశాలలో రూ.10 లక్షల విలువైన వాటర్ సంపులను ఆగస్టు నెలలో పూర్తి చేశాడు. చేసిన పనికి బిల్లు చెల్లించాలని ఈఈ నాగశేషుకు విజ్ఞప్తి చేయగా అందుకు రూ.30 వేలు లంచంగా ఇవ్వాలని, అలా అయితేనే బిల్లు చెల్లిస్తానని మొండికేశాడు. దీంతో కాంట్రాక్టర్ నవీన్‌కుమార్ బతిమిలాడి రూ.27 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్‌రావును ఆశ్రయించి అధికారి లంచం విషయమై ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని లంచం ఇస్తుండగా కలెక్టరేట్‌లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో నేరుగా పట్టుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. సంక్షేమ శాఖ నుంచి ఏ పని చేసినా కాంట్రాక్టర్లను పని పక్కాగా చేయిస్తూ... లంచం కూడా పక్కాగా ఇస్తేనే బిల్లుల చెల్లిస్తాడని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పని పక్కా చేసినప్పుడు లంచం ఎలా ఇవ్వగలుతామని కాంట్రాక్టర్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అవ్వా కావాలి... బువ్వా కావాలి అనే చందంగా వ్యవహరించడం వల్లనే ఈఈ నాగశేషును ఏసీబీకి పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చెల్లించిన బిల్లులపైన, అక్రమ ఆస్తులపైన ఏసీబీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అక్రమ ఆస్తులపై విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement