వివాదాస్పదమైన నిర్మల్ గృహ నిర్మాణశాఖ మేళా..
స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అనధికార పత్రాల పంపిణీ
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
ఇందిరమ్మ లబ్ధిదారులకు మెటీరియల్ పంపిణీ చేసెందుకు శుక్రవారం నిర్మల్‌లో గృహనిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన మెటీరియల్ మేళా వివాదాస్పదమైంది. ఈ విషయంపై కలెక్టర్ అహ్మద్‌బాబు గృహనిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది పోయి, నేతలకు వంత పాడుతారా అని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీరుపై వివరణ ఇవ్వాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీని కూడా వివరణ అడిగినట్లు సమాచారం.
అసలేం జరిగింది..
ఇందిరమ్మ పథకం కింద గోడల వరకు ఇళ్లను నిర్మించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు స్టీలు, సిమెంట్, ఇతర మెటీరియల్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గృహ నిర్మాణశాఖ నిర్మల్ డివిజన్ అధికారులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఇదీ కాస్తా పక్కదారి పట్టింది. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మాత్రమే మెటీరియల్ పంపిణీ చేయాల్సి ఉండగా, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పత్రాలను పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. పింఛన్ మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పేర్లతో ఎమ్మెల్యే కొన్ని పత్రాలు స్థానికులకు పంపిణీ చేశారు. ‘నిర్మల్ నియోజకవర్గ వాసి.. గారికి ఇందిరమ్మ గృ హం మంజూరు అయిందని తెలియ జేయుటకు సంతోషిస్తున్నాం.’ అ ని కొన్నింటిపై, ‘మీరు పింఛన్ మంజూరైందని తెలియజేయుటకు సం తోషిస్తున్నాం..’ అని పేర్కొంటూ ఉన్న మరికొన్ని పత్రాలు ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు. రచ్చబండ కార్యక్రమంలో పంపిణీ చేయగా మిగిలిన ఈ పత్రాలను ఆర్భాటంగా పంపిణీ చేయడం రచ్చయింది. ఈ పత్రాలపై స్థానిక తహశీల్దార్ సంతకంగానీ, గృహ నిర్మాణశాఖ అధికారుల సంతకం గానీ లేదు.
ఈ కార్యక్రమ నిర్వహణ తీరుపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసగించడమే అవుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మాకు సంబంధం లేదు : యాదయ్య డీఈ
వివాదాస్పదమైన మెటీరియల్ మేళా విషయమై ‘సాక్షి ప్రతినిధి’ గృహ నిర్మాణశాఖ డీఈ యాదయ్యను ఫోన్‌లో సంప్రదించగా.. ఈ మేళాలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పంపిణీ చేసిన పత్రాలతో మాకు (గృహ నిర్మాణశాఖ)కు సంబంధం లేదని అన్నారు. కలెక్టర్ అడిగిన వివరణ నివేదిక విషయమై ఆయన స్పందిస్తూ తమ శాఖ పీడీ చూసుకుంటారని అన్నారు. ప్రాజెక్టు డెరైక్టర్ గంగారాంను సంప్రదించగా.. కలెక్టర్ తమపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని, డీఈనే వివరణ ఇస్తారని పేర్కొన్నారు. నిర్మల్ ఆర్డీవో జె.అరుణశ్రీను సంప్రదించగా ఆమె స్పందించలేదు.
అధికారుల మెడకు ‘మెటీరియల్’ వివాదం
Published Tue, Feb 18 2014 2:32 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement