ఫ్లాట్లను అద్దెకు ఇస్తాం
- గృహ నిర్మాణ శాఖను సంప్రదించిన బిల్డర్లు
- లెసెన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పు చేయాలని విజ్ఞప్తి
- అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ లేక సతమతమం
- కోట్లల్లో ధరలు.. పక్క ప్రాంతాల బాట పడుతున్న ప్రజలు
ముంబై: లగ్జరీ అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ లేక సతమతమవుతున్న బిల్డర్లు లెసైన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు సరైన ఊతం లేకపోవడంతో ఇప్పటి వరకు అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇచ్చి కొంత సొమ్మును సంపాదిద్దామని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు బిల్డర్ల నుంచి ఏవిధమైన అధికారిక ప్రతిపాదన అందలేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. బిల్డర్లు సరైన ప్రతిపాదనతో వస్తే గృహనిర్మాణ శాఖ స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మధ్య తరగతి వర్గం వారికి ముంబైలో ఇళ్లు కొనడం చాలా కష్టమని, ఇప్పటి వరకు నగరంలో అమ్ముడవని ప్లాట్లు 5 లక్షల వరకు ఉన్నాయని ఆయన అన్నారు.
ఒకవేళ ఈ ప్లాట్లు గనక అమ్ముడవకపోతే బిల్డర్లు బ్యాంకులకు అప్పు చెల్లించలేరని, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇవ్వాలని వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్లాట్లు, సర్వీసు అపార్ట్‌మెంట్‌లకు గల లెసైన్స్ విధానాన్ని మార్చాలని కోరుతున్నారన్నారు. ముంబైలో అమ్ముడవని ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ల ఖరీదు కోట్లల్లో ఉందని, వాటిని కొనలేక ప్రజలు ముంబై చుట్టుపక్కల ప్రాంతాలైన థాణే, నవీ ముంబై, వాసాయ్-విరార్ ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. దీంతో అప్పులు తీర్చడానికి ఈ కొత్త విధానంతో ముందుకు వచ్చారని, రూ. రెండు కోట్లు విలువ ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ. 30,000 అద్దెకు ఇవ్వాలని వారు యోచిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంటికి అవసరమైన సామాను, పారిశుధ్యం, నీరు, పార్కింగ్ సౌకర్యం, మెయింటెనెన్స్ సౌకర్యాలను బిల్డర్లు సమకూరుస్తారని అధికారి చెప్పారు. అద్దెకు తీసుకునే వారి ఆర్థిక స్థితిని బట్టి తగ్గించడం జరుగుతుందని, తక్కువ సమయం కోసం అపార్ట్‌మెంట్ కావాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. 5-స్టార్ హోటల్లలో చెల్లించేంత బిల్లు వీటికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.