సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గత మూడున్నరేళ్లలో పట్టణాల్లో 15.6 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.79 లక్షలకుపైగా గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 15 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు చేయగా సుమారు 1.80 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇలా లక్షల సంఖ్యలో ఇళ్లతో ఏకంగా కొత్త ఊళ్లనే ప్రభుత్వం నిర్మిస్తుంటే దుష్ట చతుష్టయం మాత్రం యథాప్రకారం బురద చల్లుతోంది.
దున్న ఈనిందంటే..
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 2019–20 నుంచి 2021–22 మధ్య ప్రధాని ఆవాస్ యోజన –గ్రామీణ్(పీఎంఏవై–జీ) కింద ఎన్ని ఇళ్లు నిర్మించారని లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ స్పందించి రాష్ట్రాల వారీగా నివేదికను అందించింది.
ఏపీలో 2019–20 నుంచి 2021–22 మధ్య ఐదు ఇళ్లు నిర్మించారని అందులో పేర్కొంది. దీంతో దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టెయ్ అన్న చందంగా మూడున్నరేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం కేవలం ఐదు ఇళ్లనే నిర్మించిందంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, దుష్ట చతుష్టయం దుష్ఫ్రచారానికి దిగాయి.
ఆ ఐదు ఇళ్లు 2016–18 నాటివే
2019–20 నుంచి 2021–22 మధ్య రాష్ట్రంలో పీఎంఏవై–జీ కింద నిర్మించిన ఐదు ఇళ్లు 2016–17, 2017–18లో మంజూరైనవే కావడం గమనార్హం. నాడు 1.23 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించగా టీడీపీ ప్రభుత్వం 68 వేల ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించింది. అయితే ఇందులో 46 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పట్లో మంజూరై నిర్మాణం ఆలస్యం అయిన ఐదు ఇళ్లు 2019 – 2022 మధ్య పూర్తయ్యాయి. ఇదే అంశాన్ని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది.
ఇదీ అసలు సంగతి..
2019–20, 2020–21 మధ్య కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–జీ కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులివ్వలేదు. 2021–22లో మాత్రం 1,79,060 ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31న జీవో ఎంఎస్ నెంబర్–2 విడుదల చేసింది.
ఇళ్ల పథకం రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సీఎం జగన్ ప్రారంభించారు. 2024 మార్చి నాటికి 1.79 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఏడు నెలల్లో 67 వేల ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తై వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment