బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులోని జగనన్న కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు
ఈ ఫొటోలో సొంతింటి ముందు సంతోషంగా సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతిస్వామి, వేళంగిణి కుటుంబం ఏడాది క్రితం వరకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కృష్ణా కెనాల్ పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ దశాబ్దాల పాటు దుర్భర జీవితాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కుటుంబం గృహ ప్రవేశం చేసింది.
‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికా. దీపం వెలుతురు మినహా కరెంటు కనెక్షన్ లేదు. వర్షాలు పడితే గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురికి నీటి కారణంగా దోమలు బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెలోకి వచ్చేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. మాకంటూ ఓ సొంతిల్లు ఉంది. ఇప్పుడు కంటి నిండా నిద్ర పోతున్నాం’ అని వేళంగిణి కృతజ్ఞతలు తెలిపింది.
పాకల్లోకి పందులు..
ఇదే కాలనీలో కంతేటి పైడమ్మకు కూడా ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబం కూడా కొన్ని దశాబ్దాలు కాలువ గట్లపైనే మగ్గింది. ఆ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంత ఇంటిని సమకూర్చింది. ప్రతి నెలా ఒకటో తేదీనే పైడమ్మ ఇంటి వద్దే పెన్షన్ అందుకుంటోంది. మీ బతుకు చిత్రంలో ఎలాంటి మార్పు వచ్చిందని పైడమ్మను ప్రశ్నిస్తే ఆమె కళ్లు చెమర్చాయి. ‘ఒకప్పుడు కాలువ పక్కన జంతువులతో కలిసి జీవించాం. పని కోసం బయటికి వెళితే పందులు మా పాకల్లోకి దూరి వండుకున్న అన్నం తినేసి కకావికలం చేసిన ఘటనలు కోకొల్లలు. ఆ జీవితం పగోడికి కూడా రాకూడదని దేవుడిని కోరుకుంటా. ఎంత కష్టం చేసినా మేం గజం స్థలం కూడా కొనలేం. అలాంటిది ఈ రోజు మాకంటూ సొంతిల్లు ఉందంటే సీఎం జగన్ చలువే’ అని పైడమ్మ చెప్పింది.
(వడ్డే బాలశేఖర్ – వెల్లటూరు వైఎస్సార్, జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి): రూ.లక్ష కోట్లు.. 30 లక్షల మందికిపైగా సొంతింటి యోగం! ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాల కోసం దేశంలోనే తొలిసారిగా భారీ మొత్తంలో వ్యయం చేస్తూ లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆకాంక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోంది. వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊర్లను, లక్షల్లో గృహాలను నిర్మిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి (టిడ్కో ఇళ్లతో కలిపి) అనుమతులిచ్చింది. ఇందులో 3.40 లక్షల గృహాల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 4.67 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్ పై దశలో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా నీటి సదుపాయం, కరెంట్ కనెక్షన్లను ప్రభుత్వం సమకూరుస్తోంది.
రూపాయి ఖర్చు లేకుండా..
అద్దెలు కట్టలేక దశాబ్దాల పాటు కాలువ గట్లపై పాకల్లో మగ్గిపోయిన నిరుపేద కుటుంబాలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సంతోషంగా జీవిస్తున్నాయి. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బాపట్ల జిల్లా వెల్లటూరులో రూ.96 లక్షలతో 3.18 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 115 ప్లాట్లు లబ్ధిదారులకు అందించింది. 28 మంది ఎస్సీలు, 85 మంది ఎస్టీలు, ఒక బీసీ కుటుంబానికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున నగదు అందచేసింది.
అయితే ప్రభుత్వం స్థలంతోపాటు నిర్మాణానికి బిల్లులు ఇచ్చినప్పటికీ సొంతంగా ఇంటిని నిర్మించుకోలేని దీనస్థితిలో ఈ కుటుంబాలు ఉండటంతో విలేజ్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్‌వో) ముందుకొచ్చి చేయూత అందించింది. దీంతో నిరుపేదలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇళ్లు సిద్ధమయ్యాయి. స్థలాల మంజూరు, నిర్మాణ బిల్లులు, లేఅవుట్లలో రోడ్లు, మంచినీరు, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కల్పన కోసం ఈ ఒక్క లేఅవుట్‌కు రూ.7.46 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిరుపేదలకు పక్కా ఇంటిని సమకూర్చడం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.6.73 లక్షల మేర లబ్ధి చేకూర్చింది.
పేదల ఇళ్ల కోసం వ్యయం ఇలా
► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు
► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు)
► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో ప్రయోజనం రూ.13,758 కోట్లు
అటు ఇల్లు.. ఇటు చదువులు
నా భర్త కూలి పనులకు వెళ్తే రోజుకు రూ.500 వరకూ వస్తుంది. పిల్లలతో ఇబ్బంది పడుతూ పూరి గుడిసెల్లోనే జీవించాం. ఇప్పుడు ప్రభుత్వం మాకు పక్కా ఇంటిని సమకూర్చడంతోపాటు నా బిడ్డ చదువుకు కూడా సాయం చేస్తోంది.
– జ్యోతి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు
నేను, చెల్లి ఆడుకుంటున్నాం
మేం గుడిసెలో ఉన్నప్పుడు చుట్టూ ఎప్పుడు బురదే. దోమలు విపరీతంగా కుట్టేవి. వర్షం పడితే గుడిసెలోకి నీళ్లు వచ్చేవి. పైనుంచి వర్షం కారేది. అమ్మనాన్న నన్ను, చెల్లిని ఒళ్లో పడుకోబెట్టుకునే వాళ్లు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాం. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా బాగుంది. నేను చెల్లి బాగా ఆడుకోగలుగుతున్నాం.
– వెంకట్‌నాథ్ (జ్యోతి కుమారుడు)
తరతరాల దుస్థితికి తెర
మా పూర్వీకులు, మేం పూరి గుడిసెల్లోనే పుట్టాం. అక్కడే పెరిగాం. తరతరాలుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాం. మా పిల్లల సగం జీవితం కూడా వాటిల్లోనే గడిచింది. సీఎం జగన్ మా కోసమే ఇళ్ల పథకం తెచ్చినట్లున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. మాతో పాటు మా ఇద్దరు బిడ్డలకు వేర్వేరుగా మూడు ఇళ్లు వచ్చాయి.
– తుమ్మ రాముడు, లక్ష్మి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు
పక్కా ఇల్లు.. పెన్షన్
నా వయసు 60 పైనే ఉంటుంది. ఇన్నేళ్లలో నాకు, నా పిల్లలకు ఓ చిరునామా అంటూ లేదు. సీఎం జగన్ మాలాంటి వాళ్ల గోడును ఆలకించి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఇవాళ మాకు పక్కా ఇల్లు, శాశ్వత చిరునామా ఉంది.
– ఇళ్ల సాంమ్రాజ్యం, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు
భావి తరానికి విలువైన స్థిరాస్తి
పూరిపాకల్లో బతికిన మాకు ఇది కొత్త జీవితమే. మురికి కుంటల్లో మగ్గిపోతున్న మా తలరాతలను సీఎం జగన్ మార్చారు. పెద్దల నుంచి మాకు ఎటువంటి ఆస్తులు రాలేదు. మా పిల్లలకు విలువైన ఈ ఇంటిని ఆస్తిగా అందిస్తాం.
– కలగంటు జ్యోతి, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు
Comments
Please login to add a commentAdd a comment