సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రూ.56,103 కోట్లు ఖర్చుచేసి 71,811 ఎకరాల్లో 30 లక్షలకు పైగా పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 కొత్త ఊళ్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో లబ్ధిదారునికి పక్కా ఇంటి రూపంలో రూ.10 లక్షల మేర స్థిరాస్తి సమకూరుతోంది. దీంతో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఈ క్రమంలో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని నిశ్చయించుకున్న ఈనాడు రామోజీరావు పేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచిపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా.. పేదలందరికీ ఇళ్ల పథకంపై పనిగట్టుకుని నిత్యం విష ప్రచారం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ‘ఇవేం కాలనీలు జగనన్నా?’ అంటూ ఈనాడులో ఓ కథనం ప్రచురించారు. చిరుజల్లులు కురిసినా కాలనీలు జలమయం అవుతున్నాయంటూ అడ్డగోలుగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో రామోజీ విష ప్రచారం వెనుక వాస్తవాలివీ..
ఈనాడు : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రు జగనన్న కాలనీ జలమయం అయింది. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
వాస్తవం : గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో ఈనెల మూడో తేదీన రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతాల్లో కంకిపాడు మండలం కూడా ఒకటి. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఆగడం సర్వసాధారణం. అలాంటిది కంకిపాడు మండలంలోని లేఅవుట్‌లో నీరు ఆగిందంటూ ఈనాడు గుండెలు బాదుకుంది. అయితే, ఈ లేఅవుట్‌లో ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 254 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది.
నాడు కళ్లకు గంతలు
పేదలకు పెద్దఎత్తున మేలు జరుగుతుంటే దానిపైనా నేడు రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి వర్షానికే సంద్రాన్ని తలపించే లోతట్టు ప్రాంతంలోనే చంద్రబాబు రాజధాని తలపెట్టారు. అదే విధంగా రూ. వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ధారగా వర్షం కారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సీఎం తమవాడన్న కారణంతో రామోజీకి అప్పట్లో అవేమీ కనపడలేదు. కళ్లుండి కబోది అయ్యారు.
కానీ, నేడు అవన్నీ మర్చిపోయి గోరంతను కొండంతగా చూపి విషం కక్కుతున్నారు. నిజానికి.. తేలికపాటి వర్షాలకే ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం పడిన రోజుల్లో లేఅవుట్‌లలో నీరు నిలిచిందని రామోజీ రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
గృహ యజ్ఞంపై దుష్ప్రచారం
ఇక పేదలందరికీ ఇళ్ల పథకంపై తరచూ విషపు రాతలు రాయడం రామోజీ దుష్ప్రచారంలో భాగమే. ఈ పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం మరో రూ.36,026 కోట్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చుచేస్తూ సీఎం జగన్ గృహ యజ్ఞాన్ని
నిర్వహిస్తున్నారు.
ఈనాడు : కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలోని లేఅవుట్‌లో చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచాయి. చెరువును తలపిస్తోంది.
వాస్తవం : శుక్రవారం ఉదయం ఈ లేఅవుట్‌లో సాధారణ పరిస్థితి నెలకొంది. చెరువును తలపించేలా వర్షపునీరు లేదు. ఈ లేఅవుట్‌లో ఇప్పటికే 47 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 115 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 234 ఇళ్లు ఈ లేఅవుట్‌లో నిర్మిస్తున్నారు.
ఈనాడు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల లేఅవుట్‌లోనూ వర్షానికి నీళ్లు ఆగాయి.
వాస్తవం : గడిచిన నాలుగు రోజులుగా ఈ మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల రెండో తేదీన తాళ్లరేవు మండలంలో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ మధ్య ఈ మండలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ లేఅవుట్‌లో కూడా 30 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 36 ఇళ్లు నిర్మాణ దశల్లో ఉండగా, 103 ఇళ్లు నిర్మించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment