కోనసీమ జిల్లా ఆలమూరులోని ఎర్రా కాలనీలో నిర్మాణం పూర్తి చేసుకున్న పేదల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్క చెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందచేస్తోంది. ఇది ఎంత పెద్ద యజ్ఞమంటే.. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి.
ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతోపాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ సగటున కనీసం రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను సృష్టిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను కొనసాగించి పనులు కల్పించడం ద్వారా కోవిడ్ సమయంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది.
డిసెంబర్‌కు ఐదు లక్షల ఇళ్లు..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. దశాబ్దాలుగా గూడు లేక అవస్థలు పడుతున్న లక్షల మందికి ఊరటనిస్తోంది. పథకం కింద రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 17.24 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ ఏడాది డిసెంబర్ 21 కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, టిడ్కో ఇళ్లు 1.5 లక్షలు ఈ గడువులోగా పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్‌లు సమకూరుస్తోంది.
మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, దుస్తులు లాంటి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు నిలువ నీడ లేదు. ఆ నిరుపేదల గోడును 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విన్నారు.
నేను ఉన్నానని హామీ ఇచ్చారు. మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ద్వారా ఏకంగా 30.25 లక్షల మంది నిరుపేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తూ ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీన్ని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైంది.
ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా పక్కా ఇళ్లను నిర్మించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ మహాయజ్ఞం పూర్తయితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా కోర్టులకెక్కి పలు అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రభుత్వ దృఢ సంకల్పం ముందు ఆ పాచికలు పారలేదు. దీంతో తాజాగా దత్తపుత్రుడిని రంగంలోకి దింపి డిజిటల్ క్యాంపెయిన్ పేరిట పేదల ఇళ్లపై బురద జల్లే మరో కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది.
దర్జాగా ఉంటున్నాం
నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. ఇద్దరు పిల్లలు. సొంతిల్లు లేదు. అద్దె కట్టే స్తోమత లేక బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లు పైకప్పు సరిగా లేక వర్షాలు పడినప్పుడు
అవస్థలు ఎదుర్కొన్నాం. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి దరఖాస్తుకే స్థలం, ఇంటిని కూడా మంజూరు చేశారు. రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం.
– షేక్ ఫాతిమాబీ, ఫణిదం, సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా
సదుపాయాలన్నీ కల్పించారు..
సొంతిల్లు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం
కింద దరఖాస్తు చేసుకోవడంతో గ్రామం వెలుపల స్థలం కేటాయించారు. ఊరికి దూరంగా ఇవ్వడంతో భయపడ్డాం. ఇంటి నిర్మాణానికి చేయూత ఇవ్వడంతో పాటు కాలనీలో విద్యుత్, తాగు నీరు తదితర సదుపాయాలన్నీ సమకూర్చారు. మా జగనన్న లేఅవుట్‌లో 400 మందికిపైగా పేదలు ఇళ్లు కట్టుకున్నారు.
– పి. దుర్గాదేవి, జేగురుపాడు, కడియం మండలం, తూర్పుగోదావరి
రూ.3 లక్షల విలువైన స్థలం
జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మాకు రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల యూనిట్‌కు గానూ ఇప్పటి వరకు రూ.48వేల బిల్లు వచ్చింది. కాలనీలో వసతులు కల్పిస్తున్నారు.
– కొల్లి కనకమ్మ, కొత్తమూలకుద్దు, అనకాపల్లి జిల్లా
గతంలో ఎన్నడూ చూడలేదు
పేదలకు పక్కా ఇళ్ల కోసం సీఎం జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. జగనన్న కాలనీలో నాకు స్థలం కేటాయించారు. నిర్మాణ బిల్లులు కూడా సకాలంలో అందించారు. ఇప్పటికే ఇల్లు పూర్తి కావచ్చింది. జగనన్న ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా లబ్ధి చేకూరుతోంది. కాలనీలో విద్యుత్, రహదారులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా చేపడుతున్నారు.
– మండల్ క్రిష్ణ, నగర పంచాయతీ పాలకొండ
మూడు దశాబ్దాల కల
మూడు దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. సీఎం జగన్ ప్రభుత్వం మా సొంత ఇంటి కలను నెరవేరుస్తోంది. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యింది. రూ.50 వేల వరకు బిల్లు కూడా వచ్చింది.
– జంగం అన్నపూర్ణ, మంత్రాలయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే
మాది పశ్చిమ గోదావరి జిల్లా. 30 ఏళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చాం. మూడు దశాబ్దాలు అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ సొంతింటి కల మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే నెరవేరింది. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది.
– కె. భానుమతి, పుట్టపర్తి
ఇన్నాళ్లకు కల నెరవేరింది
ఉప్పలూరు గ్రామానికి 13 ఏళ్ల క్రితం వచ్చాం. సొంత స్థలం లేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ స్థలం కోసం తిరిగినా రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉప్పలూరు లే అవుట్‌లోనే స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేశాం. ఎన్నో ఏళ్లకు సొంతింటి కల తీరింది. చాలా ఆనందంగా ఉంది. కాలనీలో తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉంది.
– పోసిన శివనాగమల్లేశ్వరి, ఉప్పలూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా
పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇలా
► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి– రూ.56,102.91 కోట్లు
► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు,
శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు)
► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు
(రూ.15 వేల విలువ చేసే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రూ.40 వేల విలువైన సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కన్నా తక్కువకు రాయితీతో సరఫరా చేస్తోంది.)
జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాల కల్పన వ్యయం రూ.కోట్లలో
నీటి సరఫరా– 4,128
విద్యుత్, ఇంటర్నెట్– 7,989
డ్రైనేజీ, సీవరేజ్– 7,227
రోడ్లు, ఆర్చ్‌లు– 10,251
పట్టణ ప్రాంత లేఅవుట్‌లలో వసతుల కల్పన – 3,314
ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చు
(2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకూ)
లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు– రూ.6149,10,54,963
నిర్మాణ సామగ్రి– రూ.1629,99,83,047
ఇతర ఖర్చు– రూ. 656,68,14,937
మొత్తం– రూ.8435,78,52,947
రూ.10 లక్షల ఇంటికి యజమాని
అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తాకాసి దేవీ సత్యనారాయణ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా కనికరించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి అర్జీ పెట్టుకున్నారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. కొద్ది రోజులకే స్థలం మంజూరై ఇంటి పట్టా అందింది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తైంది. రూ.10 లక్షల విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ అందించారని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది.
ఫిబ్రవరిలో గృహప్రవేశం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వి.రమాదుర్గ వాలంటీర్ కాగా ఆమె భర్త కార్పెంటర్. ఇద్దరి సంపాదన నెలకు రూ.20 వేల లోపే. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల పైమాటే ఉండటంతో సొంతిల్లు కలేనని రమాదుర్గ వేదనకు గురయ్యేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ఆమెకు ఉచితంగా ఇంటి స్థలం అందింది.
గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందడంతో వేగంగా కొనసాగుతోంది. ఇటీవల స్లాబ్ కూడా వేశారు. ప్రస్తుతం గోడలకు ప్లాస్టింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, ఆ నెలలో మంచి రోజులు ఉన్నందున గృహ ప్రవేశం చేస్తామని రమాదుర్గ చెబుతోంది. ఆమెతో పాటు బుల్లియ్యరేవులోని వైఎస్సార్ జగనన్న లేఅవుట్‌లో పేదలకు ప్రభుత్వం 170 ఇళ్లను మంజూరు చేసింది. 60 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కాగా మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment