సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య 27,895 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. అదే విధంగా 1,19,493 స్టేజ్ కన్వర్షన్లు (ఇంటి నిర్మాణం ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం) నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు సగటున 1,860 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుండగా, 7,966 స్టేజ్ కన్వర్షన్లు అవుతున్నాయి.
ఈ నిర్మాణాలను మరింత వేగంగా చేపట్టడంపై గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో ప్రస్తుతం రోజుకు రెండు వేల ఇళ్ల వరకూ నిర్మాణం పూర్తవుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ అధికారులను జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించింది.
వీరు వారంలో రెండు రోజులపాటు ఆయా జిల్లాల్లోని లేఅవుట్‌లలో పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని రాష్ట్రంలో చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 17.22 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
డిసెంబర్ నుంచి పుంజుకున్న నిర్మాణాలు
గత ఏడాది రాష్ట్రంలో భారీగా వర్షాలు, గోదావరి వరదలు ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు జిల్లాల్లో లేఅవుట్‌లలో నిర్మాణ మెటీరియల్ తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు పుంజుకున్నాయి.
డిసెంబర్ 1 నుంచి 15 మధ్య 83,166 స్టేజ్ కన్వర్షన్లు, 12,296 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవి. ఇలా క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరి 1–15 తేదీల నాటికి 1.19 లక్షల స్టేజ్ కన్వర్షన్లు, 27వేలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యే స్థాయికి పనుల వేగం పెరిగింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,74,210 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఈ ఏడాది రూ.7,630 కోట్ల ఖర్చు
పేదల ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,630 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.5,325 కోట్లు లబ్ధిదారులకు చెల్లింపులు కాగా.. సబ్సిడీపై 7.45 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.373 కోట్లు, 94,242 టన్నుల స్టీల్ సరఫరాకు రూ.673 కోట్లు.. ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రి అందించడానికి రూ.620 కోట్ల మేర ఖర్చయింది.
ఇక ఈ పథకం కింద ఇళ్లులేని పేదలకు ఉచితంగా రూ.లక్షలు ఖరీదుచేసే స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35వేల చొప్పున బ్యాంకు రుణ సాయం అందిస్తున్నారు. దీంతో పాటు ఉచితంగా ఇసుక, సబ్సీడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా చేస్తున్నారు. మొత్తంగా పథకం ద్వారా పేదలకు ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల మేర మేలు చేస్తోంది.
631 లేఅవుట్‌ల సందర్శన
ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నాం. గడిచిన నాలుగు శనివారాల్లో 631 లేఅవుట్‌లను జిల్లా, మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి అధికారులు, సిబ్బంది సందర్శించి అక్కడి సమస్యలను మా దృష్టికి తెస్తున్నారు. వాటిని జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించడానికి ప్రత్యేక నిధిని కేటాయించాం.
– అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment