హౌసింగ్ ఏఈ అప్పారావును విచారిస్తున్న ఏసీబీ అధికారులు
వత్సవాయి (జగ్గయ్యపేట) : ఏసీబీ వలలో మండలానికి చెందిన గృహ నిర్మాణశాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి చిక్కుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో లంచం తీసుకుంటూ ఏఈ లంకా సీతారామాంజనేయ అప్పారావు, గొల్లపూడి సమీపంలోని నల్లకుంటలో ఇంట్లోనే లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి గురజాల కోటయ్యలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణ పెండింగ్ బిల్లు మంజూరుచేసేందుకు లంచం తీసుకుంటూ ఏఈ అప్పారావు చిక్కగా, ఇంటి నిర్మాణం మొదలుపెట్టేందుకు సంతకం పెట్టాలంటే రూ. 5 వేలు డిమాండ్ చేసి కార్యదర్శి దొరికిపోయాడు.
ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావునేతృత్వంలో...
ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.... పోలంపల్లి గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మీ పేరుపై 2013 లో గృహం మంజూరైంది. కాగా అప్పట్లో ప్రభుత్వం గృహానికి లక్ష రూపాయలు కేటాయించగా వారి ఖాతాల్లో రూ.12,500 మాత్రమే జమ అయ్యాయి. తరువాత ఎన్నికలు రావడంతో బిల్లులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి పెండింగ్ బిల్లుల కోసం వెంకటేశ్వర్లు గృహనిర్మాణశాఖ ఏఈ చుట్టూ తిరుగుతున్నాడు. నాలుగేళ్ల కిందటి పెండింగ్ బిల్లు మంజూరుచేయాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఏఈని కలుసుకుని రూ.10 వేలు నగదు ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ వెంటనే కార్యాలయంపై దాడి నిర్వహించి నగదు స్వాధీనం చేసుకుని ఏఈని అదుపులోనికి తీసుకున్నారు.
సంతకానికి రూ. 5 వేలు డిమాండ్ చేసి....
పోలంపల్లి గ్రామానికి చెందిన పామ ఉషారాణి, వై.కృష్ణవేణి, కట్టా జయలక్ష్మీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా పంచాయతీ కార్యదర్శి సంతకంతో కూడిన అనుమతి పత్రాన్ని రెవెన్యూశాఖకు అప్పగించాలి. కార్యదర్శి సంతకం పెట్టాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు డిమాండ్ చేశాడు. ముగ్గురూ కలిపి రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించాడు. లేకపోతే సంతకం పెట్టేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఉషారాణి భర్త శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు చెప్పిన విధంగా లంచం ఇచ్చేందుకు కార్యదర్శి గురజాల కోటయ్యకు ఫోన్ చేశారు. తనకు అరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం గొల్లపుడి సమీపంలో నల్లకుంట వద్ద తన ఇంట్లో ఉన్నానని అక్కడికి రావాలని సూచించాడు. కార్యదర్శి చెప్పిన విషయాన్ని శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు చెప్పగా వెంటనే వత్సవాయి నుంచి నల్లకుంటలో కార్యదర్శి ఇంటికి వెళ్లారు. బాధితుడు శ్రీనివాస్ కార్యదర్శి కోటయ్యకు రూ.15 వేలు నగదు అందించగానే ఏసీబీ అధికారులు ఆయన ఇంటిలోనే కోటయ్యను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు వెంకటేశ్వర్లు, రమేష్‌కుమార్, హ్యపీ కృపా వందనం పాల్గొన్నారు.
అధికారులకు రిమాండ్
విజయవాడ లీగల్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గృహ నిర్మాణ శాఖ ఏఈ లంకా సీతా రామాంజనేయ అప్పారావు, పంచాయతీ కార్యదర్శి కోటయ్యకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు న్యాయమూర్తి ఎం.వెంగయ్య సోమవారంఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment