సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డును నమోదు చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తాజాగా పూర్తిచేసింది. ఈ నెలాఖరులోగా వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ విజయవంతంగా ఛేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,00,653 ఇళ్ల నిర్మాణాన్ని సోమవారంతో పూర్తిచేసింది.
అనతికాలంలోనే రికార్డు..
రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజంచేయడానికి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీనికింద 31 లక్షలకు పైగా పేదింటి అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించారు. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.
ఇందులో 18.63 లక్షలు సాధారణ ఇళ్లు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తిచేశారు. వీటికి మౌలిక సదుపాయాలు కూడా చకచకా కల్పిస్తున్నారు. పూర్తయిన ఇళ్లకు కరెంటు, మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నారు. అలాగే, 2020 డిసెంబర్ 25న ప్రస్తుత కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్ పట్టాల పంపిణీ చేయడంతో పాటు, పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఇళ్లు పూర్తిచేసి పేదలకు అందించినట్లు అవుతోంది.
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి..
పేదల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నాటి నుంచి అడుగడుగునా టీడీపీ అడ్డుతగిలింది. కోర్టుల ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా అడ్డంకులు సృష్టించింది. వీటిని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో టీడీపీ ఏకంగా 2021 అక్టోబర్‌లో కోర్టులకు వెళ్లి నిర్మాణాలనే అడ్డుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు వ్యక్తుల సంతకాలు తీసుకుని, వారి సమ్మతి లేకుండా మోసపూరితంగా కేసులు వేసిన ఘటనలు వెలుగుచూశాయి.
పేదలకు వ్యతిరేకంగా టీడీపీ చేసిన కుట్రతో అప్పట్లో ఆరునెలలపాటు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు.. నిర్మాణాలు ప్రారంభించిన వెంటనే రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభం, గత ఏడాది తీవ్ర వర్షాలు, వరదలు ఇలా ప్రకృతి విపత్తులు.. టీడీపీ, ఇతర దుష్టచతుష్టయం రాక్షసబుద్ధిని ఎదురొడ్డి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసింది.
అక్కచెల్లెమ్మలకు లక్షల విలువైన ఆస్తి
పేదలందరికీ ఇళ్ల పథకం కింద రూ.లక్షల విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం పేద అక్కాచెల్లెమ్మల పేరిట సమకూరుస్తోంది. ఇందుకోసం అన్ని విధాలుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు.
♦ ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసింది.
♦ ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం సమకూరుస్తోంది.
♦ అంతేకాక.. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు.
♦ మిగిలిన ఐరన్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధరలకన్నా తక్కువకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.54,518 మేర అదనపు సాయం అందిస్తున్నారు.
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి..
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు సమకూరుస్తున్నారు. 5 లక్షల ఇళ్లు పూర్తిచేయడానికి అహర్నిశలు కృషిచేసిన గృహ నిర్మాణ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో ఇక ముందూ పనిచేయాలి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
పండుగలా గృహ ప్రవేశాల వేడుకలు..
వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పండుగలా గృహప్రవేశ వేడుకలు చేపట్టనున్నాం.త్వరలోనే ఈ వేడుకలు ప్రారంభిస్తాం. ఒక పెద్ద కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేస్తాం. ప్రజాప్రతినిధులు అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment