పట్టణ గృహ నిర్మాణానికి రూ. 6,953 కోట్లు | Rs 6953 crore To build urban housing in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పట్టణ గృహ నిర్మాణానికి రూ. 6,953 కోట్ల సాయం 

Published Thu, Feb 6 2020 6:25 AM | Last Updated on Thu, Feb 6 2020 8:24 AM

Rs 6953 crore To build urban housing in AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, మచిలీపట్నం: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పట్టణం) కింద 2015–16 నుంచి 2019–20 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రెండు విడతల్లో రూ. 6,953 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి బుధవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్సీసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ లబ్ధిదారులకు వడ్డీ సబ్సిడీ కింద మరో రూ. 436.54 కోట్ల మేర ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసినట్లు చెప్పారు. లక్షా 24 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం చేసే 40 శాతం ఆర్థిక సాయంలో మొదటి వాయిదాను ఇంకా విడుదల చేయాల్సి ఉందని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా, వారి ఆధార్‌ కార్డు వివరాలు, వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అనంతరం ఈ నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.  

సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీల్లో 27.5 శాతం ఖాళీలు 
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీల్లో 27.5 శాతం ఖాళీలు ఉన్నాయని, హైదరాబాద్‌లోని కేంద్రంలో 32 శాతం మేర ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 

డిఫెన్స్‌ క్యాంటీన్‌ స్టోర్‌ మూసివేత ఉండదు 
డిఫెన్స్‌ క్యాంటీన్‌ స్టోర్‌ మూసివేత ఉండదని, కేవలం హేతుబద్ధీకరణ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఏలూరు నియోజకవర్గ పరిధిలో డిఫెన్స్‌ క్యాంటీన్‌ స్టోర్‌ మూసివేత అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.  

రైల్వే డివిజన్ల వారీగా బడ్జెట్‌ కేటాయింపుల్లో వాల్తేరుకే ఎక్కువ 
ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సేవలందిస్తున్న వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లలో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో వాల్తేరు రైల్వే డివిజన్‌కే అధిక నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్‌ బీశెట్టి వెంకట సత్యవతి, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు గాను బడ్జెట్‌ సవరణ అంచనాలు, వాస్తవ వ్యయ పద్దులను తన సమాధానంలో పొందుపరిచారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం వాల్తేరు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 2,463 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 407 కోట్లు కేటాయించారు.

2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 2,761 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 420 కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం విజయవాడ డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 1,997 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 207 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 2,041 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 149  కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం గుంతకల్లు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 1428 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 217 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 1644 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 328 కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం గుంటూరు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 374 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 102 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 402 కోట్లు, కేపిటల్‌ పద్దు కింద రూ. 98 కోట్లు కేటాయించారు.  

రెండు మార్గాల్లో ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ 
రేణిగుంట–ఎర్రగుంట్ల సెక్షన్‌ మధ్య, విజయనగరం–పలాస సెక్షన్‌ మధ్య ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ పనులు మంజూరయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.  కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆధునిక వ్యవస్థ వల్ల భద్రత, ట్రాఫిక్, లైన్‌ సామర్థ్యం, రైళ్ల వేగం, సమయపాలన వంటి విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు. 

వీసీఐసీ ఫేజ్‌ –1 లో విశాఖ, చిత్తూరు నోడ్‌ల అభివృద్ధికి ఆమోదం 
వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ)లో విశాఖ, చిత్తూరు నోడ్‌లను ఫేజ్‌–1లో అభివృద్ధి చేసేందుకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) 2019 ఆగస్టు 30న ఆమోదం తెలిపిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన  రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఈ కారిడార్‌కు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)ను సిద్ధం చేసిందని, వీటిలో విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, చిత్తూరు నోడ్‌లు ఉన్నాయని, ఫేజ్‌–1లో వైజాగ్, చిత్తూరు నోడ్‌లను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ఎన్‌ఐసీడీఐటీ దీనికి ఆమోదం తెలిపిందని వివరించారు. ఫేజ్‌ – 1 కోసం ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) రూ. 45 వేల కోట్లు (631 మిలియన్‌ డాలర్లు) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement