సెల్వ'రాజ్‌' | Housing department Employee Continue After Retirement | Sakshi
Sakshi News home page

సెల్వ'రాజ్‌'

Published Thu, Jan 24 2019 12:20 PM | Last Updated on Thu, Jan 24 2019 12:20 PM

Housing department Employee Continue After Retirement - Sakshi

మంత్రి, కలెక్టర్‌ సమక్షంలో రిటైర్డ్‌ హౌసింగ్‌ పీడీ సెల్వరాజ్‌ (వృత్తంలోని వ్యక్తి)

గుమ్మఘట్ట మండలం కలుగోడులో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం ఇది. గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుతో పాటు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వీరి మధ్యనున్న వ్యక్తి ఉద్యోగ విరమణ పొందిన హౌసింగ్‌ పీడీ సెల్వరాజ్‌. గత డిసెంబర్‌ 31 నాటికి ఆయన ఉద్యోగ     కాలం ముగిసింది. అయినప్పటికీ ఆయనను యథావిధిగా విధి నిర్వహణలో     కొనసాగిస్తున్నారు.

అనంతపురం టౌన్‌: ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఓ ఉద్యోగిని విధుల్లో కొనసాగిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మానవీయ కోణంలో ఓ చిన్న స్థాయి ఉద్యోగిని ఇలా కొనసాగిస్తున్నారనుకుంటే పొరపాటు. జిల్లా స్థాయి అధికారి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. హౌసింగ్‌ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు అండదండలు ఉండటం వల్లే జిల్లా కలెక్టర్‌ సైతం మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ సెల్వరాజ్‌ గత డిసెంబర్‌ 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులంతా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకొని ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో మంత్రి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మరో నాలుగు నెలల పాటు పొడిగింపు ఉత్తర్వులు తీసుకొస్తానని, అప్పటి వరకు మీరే పీడీగా కొనసాగాలని మౌఖికంగా ఆదేశించారు. అప్పటి వరకు వీడ్కోలు సభ వద్దని సిబ్బందికి సూచించారు. మరో వారం రోజులు గడిస్తే ఆయన మౌఖిక ఉత్తర్వులకు నెల గడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి కొనసాగింపు ఉత్తర్వులులేకుండానే సెల్వరాజ్‌ పూర్తిస్థాయి పీడీ బాధ్యతలను నెరవేరుస్తున్నారు.

జన్మభూమి కార్యక్రమాల్లోనూ..
మంత్రి చెప్పడమే తరువాయి.. ఉద్యోగ విరమణ పొందిన రెండు రోజుల్లోనే మొదలైన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలోనూ పీడీ హోదాలో సెల్వరాజ్‌ హాజరవుతూ వచ్చారు. మొత్తం కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్‌తో ఆయన వేదిక పంచుకోవడంతో పాటు తరచూ అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తుండటంతో ఉద్యోగుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ ఆయన ఇచ్చే ఆదేశాలను అమలు చేయాలా? లేదా? అనే విషయంలో ఉద్యోగులు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

కొనసాగింపు వెనుక మతలబు?
జిల్లాలో ప్రస్తుతం 1.20లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేసేలా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రత్యేకంగా చోరవ చూపాల్సి ఉంటుంది. నిర్మాణాలు నత్తనడకన సాగితే ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేయాల్సి ఉంది. ఇంతటి కీలకమైన పీడీ పోస్టు విషయంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌ కూడా ఆషామాషీగా వ్యవహరిస్తుండటం వెనుక మతలబు ఏమిటనే చర్చ జరుగుతోంది.

పొడిగింపు ఉత్వర్వులు లేకుండానే..
సెల్వరాజ్‌ హౌసింగ్‌ పీడీగా జిల్లాలో 2017 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 31న ఆయన ఉద్యోగ విరమణ పొందారు. అయితే మంత్రి చెప్పారని యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. వాస్తవంగా గృహ నిర్మాణ శాఖ ఎండీ క్రాంతిలాల్‌ దండే నుంచి కొనసాగింపు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. మరో వారం గడిస్తే నెల రోజులు పూర్తవుతున్నా.. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా పీడీగా సెల్వరాజ్‌ను కొనసాగిస్తుండటం గమనార్హం.

అన్ని తానై పనులు చక్కబెడుతూ..
హౌసింగ్‌ పీడీగా సెల్వరాజ్‌ పదవీ విరమణ పొందినప్పటికీ పూర్తిస్థాయి బాధ్యతల్లో కొనసాగుతూ కార్యాలయ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించడమే కాకుండా హౌసింగ్‌ బిల్లులకు సైతం ఆయన ఆమోద ముద్ర వేస్తున్నారు. పాలనా పరమైన వ్యవహారాలతో పాటు బిల్లులు, ఇళ్ల మంజూరు విషయంలో సెల్వరాజ్‌కు ఎలాంటి జోక్యం చేసుకునే వీల్లేదు. జనవరి 1వ తేదీ నుంచి 23 రోజులు గడుస్తున్నా అనధికారికంగానే ఆయన విధుల్లో కొనసాగుతున్నారు. మరి పదవీ విరమణ పొందిన ఉద్యోగి చేస్తున్న విధుల్లో పొరపాట్లకు ఎవరు బాధ్యత వహిస్తారు. మంత్రి మౌఖిక ఆదేశాలతో కలెక్టర్‌ కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే చర్చ ఉద్యోగ వర్గాల్లోనూ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement