నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌ | Model Houses Are Not Proper Use In Medak District | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌

Published Sat, Sep 28 2019 7:57 AM | Last Updated on Sat, Sep 28 2019 7:58 AM

Model Houses Are Not Proper Use In Medak District - Sakshi

టేక్మాల్‌లో వృథాగా ఉన్న మోడల్‌ హౌస్‌

సాక్షి, టేక్మాల్‌(మెదక్‌): నిరుపేదల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మోడల్‌ హౌస్‌లు అలంకారప్రాయంగా మిగిలాయి. కొన్ని అసంపూర్తిగా వదిలేయగా మరికొన్ని నిర్మాణం పూర్తై నిరుపయోగంగా మారాయి. శిథిలావస్థకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వెరసి అనుకున్న లక్ష్యం నాణ్యతతో కూడిన ఇల్లు ఎలా కట్టుకోవాలో లబ్ధిదారులకు చాటి చెప్పేందుకు ఈ భవనాలు నిర్మించారు. ఒక్కో భవనానికి కేవలం రూ.1.50లక్షలు ఖర్చు చేసి ఒక కుటుంబం ఉండేందుకు వీలుగా బెడ్‌రూం, హాల్, కిచెన్, వరండాతో సహా ఎలా కట్టుకోవాలో నిర్మించి మరీ చూపించారు. అంతా బాగానే ఉన్నా ఈ భవనాలు పూర్తై దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి.

మండలానికొక నిర్మాణం.. 
జిల్లా వాప్తంగా 2012–13లో మండలాల్లో మోడల్‌ హౌస్‌ల నిర్మాణానికి హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.1.50 లక్షలు వెచ్చించి పూర్తి నమూనా ఇళ్లను నిర్మించాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. తర్వాత గ్రామాలకు విస్తరించాలనుకున్నారు. మొదట్లో పనులు బాగానే కొనసాగాయి. 80శాతం వరకు పూర్తి చేశారు కూడా. మిగతా పనులు కూడా పూర్తి చేసి హౌసింగ్‌ శాఖ మండల కార్యాలయంగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థానంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకువచ్చింది. హౌసింగ్‌ శాఖను కూడా పూర్తిగా రద్దు చేసి సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్మాణం చేపట్టిన మోడల్‌ హౌస్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కరెంట్‌ సరఫరా, వైరింగ్, తలుపులు, కిటికీల బిగింపు, పెయింటింగ్‌ వేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి.

శిథిలావస్థకు చేరుతున్న భవనాలు.. 
జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందుబాబులు, పేకాట రాయుళ్లకు రాత్రివేళ సిట్టింగ్‌ కోసం ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని మండలాల్లో ఇతర శాఖల అధికారులు వీటిని స్టోర్‌ రూంలుగా వాడుకుంటున్నారు. మరిన్ని నిధులు వెచ్చించి భవనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

వినియోగంలోకి తేవాలి.
లక్షలాది రూపాయలతో నిర్మించిన మోడల్‌ హౌస్‌లను వినియోగంలోకి తేవాలి. ప్రభుత్వం భవనాల నిర్మాణానికి మరింత డబ్బులు వెచ్చించి పూర్తి చేస్తే బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వశాఖ కార్యాలయంగా వాడుకోవచ్చు. ప్రజాధనం వృథా చేయడం సరికాదు.
– మజహర్, కో–ఆప్షన్‌ సభ్యుడు, టేక్మాల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement