Tekmal
-
Medak: కారులో వ్యక్తి సజీవదహనం కేసులో ట్విస్ట్.. ఎంతకు తెగించాడు
సాక్షి, మెదక్: జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటపురంలో వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాయక్ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈనెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ధర్మా నాయక్ నాటకం ఆడాడు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ధర్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. తమదైన శైలిలో దర్మను విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన ధర్మ.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నాడు.భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసలేం జరిగిందంటే.. టేక్మాల్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనె 9న గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దుస్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కారులో వ్యక్తి సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవరైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరికి కారులోని మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దిగా పోలీసులు గుర్తించారు. చదవండి: Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన -
మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..
సాక్షి, టేక్మాల్(మెదక్): సొంత కూతురు కాదనే అనుమానంతో చిన్నారిని గొంతు నులిమి హత్యచేసిన మారు తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. గురువారం సీఐ జార్జ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన బూర్ల రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రితో 2014లో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు జరిగి రెండేళ్ల తర్వాత విడిపోయారు. తర్వాత సావిత్రి అందోల్ మండలం రోళ్లపాడ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరగగా, వారికి వర్షిణి(3) కూతురు ఉంది. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) ఈ క్రమంలో సావిత్రి మొదటి భర్త రమణయ్యతో సాన్నిహిత్యం ఏర్పడడంతో రోళ్లపాడ్‌కు చెందిన వ్యక్తికి విడాకులిచ్చి, 8నెలల క్రితం రమణయ్యను వివాహం చేసుకుంది. తన వెంట కూతురు వర్షిణిని తీసుకువెళ్లింది. గర్భిణి అయిన సావిత్రిని ఆస్పతికి చూపించేందుకు గురువారం టేక్మాల్ ఆస్పత్రికి వచ్చి వెళ్తుండగా, రమణయ్య, భార్యను ఇంటికి పంపించి, కూతురు వర్షిణిని పాల్వంచ శివారుకు తీసువెళ్లి గొంతు నులిపి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్లి వాంతులు చేసుకొని మృతిచెందిందని అబద్దం చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, విచారించగా నేరం అంగీకరించాడు. వర్షిణిని తనకు పుట్టలేదని కోపంతో పథకం ప్రకారం హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రమణయ్యను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: (నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. దిగులుతో భార్య మృతి) -
ప్రియుడితో కలిసి భర్తను..
సాక్షి, టేక్మాల్(మెదక్): ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లిలో చోటు చేసుకుంది. హత్య కేసును స్థానిక పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. సంబందిత వివరాలను అల్లాదుర్గం సీఐ రవి గురువారం సాయంత్రం టేక్మాల్ పోలీస్ స్టేషన్లో విలేకర్లకు వెల్లడించారు. మద్యం తాగించి హత్య టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలు (38మృతుడు) భార్య నాగమణి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగమణి గత ఆరు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన వడ్డె యాదయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తరుచుగా భార్య భర్తలకు గోడవలు జరిగేవి. భర్తను ఎలాగైనా చంపాలని ప్రియుడైన యాదయ్యతో కలిసి పథకం పన్నింది. దావత్ చేసుకుందామని వడ్డె యాదయ్య, వేముల సాయిలును ఈనెల 7వ తేదిన సాయంత్రం పిలిపించుకొని టేక్మాల్ శివారులోని చెరువులో కూర్చోని మద్యం సేవించారు. సాయిలుకు ఎక్కువగా మద్యాన్ని సేవింపచేశాడు. బాగా తాగిన అనంతరం యాదయ్య తన మిత్రుడైనా బొడ్డు సురేష్‌కు ఫోన్ చేసి పిలుపించుకున్నాడు. ఇద్దరు కలిసి మరింత మద్యం తాగించి యాదయ్య కర్రతో సాయిలు తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్క రోజులో ఛేదన.. ఈనెల 8వ తేదీన విషయం తెలుసుకున్నా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వడ్డె యాదయ్య ఏ1, సురేష్ ఏ2, నాగమణి ఎ3 ముద్దాయిలు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు పంపినట్లు సీఐ తెలిపారు. ఇందులో రేగోడ్ ఎస్ఐ కాశినాథ్, పెద్దశంకరంపేట ఎస్ఐ సత్యనారాయణ, టేక్మాల్ ఏఎస్ఐ బీమ్లా నాయక్, హెడ్ కానిస్టేబుల్లు వీరప్ప, లక్ష్మణ్, కానిస్టేబుల్లు రవిందర్, రాజమణి, శ్రీనివాస్, యాదగిరి, సుదీర్, మల్లప్ప తదితరులు ఉన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి వివరాలు సేకరించి నిందుతుల అరెస్ట్ చేసిన సిబ్బందిని సీఐ అభినందించారు. -
నిరుపయోగంగా మోడల్ హౌస్
సాక్షి, టేక్మాల్(మెదక్): నిరుపేదల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మోడల్ హౌస్‌లు అలంకారప్రాయంగా మిగిలాయి. కొన్ని అసంపూర్తిగా వదిలేయగా మరికొన్ని నిర్మాణం పూర్తై నిరుపయోగంగా మారాయి. శిథిలావస్థకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వెరసి అనుకున్న లక్ష్యం నాణ్యతతో కూడిన ఇల్లు ఎలా కట్టుకోవాలో లబ్ధిదారులకు చాటి చెప్పేందుకు ఈ భవనాలు నిర్మించారు. ఒక్కో భవనానికి కేవలం రూ.1.50లక్షలు ఖర్చు చేసి ఒక కుటుంబం ఉండేందుకు వీలుగా బెడ్రూం, హాల్, కిచెన్, వరండాతో సహా ఎలా కట్టుకోవాలో నిర్మించి మరీ చూపించారు. అంతా బాగానే ఉన్నా ఈ భవనాలు పూర్తై దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి. మండలానికొక నిర్మాణం.. జిల్లా వాప్తంగా 2012–13లో మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.1.50 లక్షలు వెచ్చించి పూర్తి నమూనా ఇళ్లను నిర్మించాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. తర్వాత గ్రామాలకు విస్తరించాలనుకున్నారు. మొదట్లో పనులు బాగానే కొనసాగాయి. 80శాతం వరకు పూర్తి చేశారు కూడా. మిగతా పనులు కూడా పూర్తి చేసి హౌసింగ్ శాఖ మండల కార్యాలయంగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థానంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకువచ్చింది. హౌసింగ్ శాఖను కూడా పూర్తిగా రద్దు చేసి సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్మాణం చేపట్టిన మోడల్ హౌస్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కరెంట్ సరఫరా, వైరింగ్, తలుపులు, కిటికీల బిగింపు, పెయింటింగ్ వేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి. శిథిలావస్థకు చేరుతున్న భవనాలు.. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందుబాబులు, పేకాట రాయుళ్లకు రాత్రివేళ సిట్టింగ్ కోసం ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని మండలాల్లో ఇతర శాఖల అధికారులు వీటిని స్టోర్ రూంలుగా వాడుకుంటున్నారు. మరిన్ని నిధులు వెచ్చించి భవనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగంలోకి తేవాలి. లక్షలాది రూపాయలతో నిర్మించిన మోడల్ హౌస్‌లను వినియోగంలోకి తేవాలి. ప్రభుత్వం భవనాల నిర్మాణానికి మరింత డబ్బులు వెచ్చించి పూర్తి చేస్తే బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వశాఖ కార్యాలయంగా వాడుకోవచ్చు. ప్రజాధనం వృథా చేయడం సరికాదు. – మజహర్, కో–ఆప్షన్ సభ్యుడు, టేక్మాల్ -
టేక్మాల్ మార్కెట్లో దొంగల హల్చల్
సాక్షి, టేక్మాల్(మెదక్): టేక్మాల్ మార్కెట్లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు. అధికంగా సెల్ఫోన్ల చోరీ.. మార్కెట్లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ వచ్చే వారి సెల్ఫోన్లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్‌కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్‌కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. స్టేషన్లో ఫిర్యాదులు.. వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్‌పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది. దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్లోని దొంగలతో పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశా.. గత వారం మార్కెట్లోకి కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. మార్కెట్లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్ పట్టుకుంటాం.. పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతాం. మార్కెట్‌కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – షాబొద్దీన్, ఎస్ఐ, టేక్మాల్ -
వేలుపుగొండలో కొత్త రాతి చిత్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రాతిచిత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాచీన మానవుని గురించి తెలుసుకోమంటూ సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లా టేక్మల్ మండలం వేలుపుగొండకి పడమరన ఉన్న చిన్న రాతి గుట్టపైన విష్ణుకుండినుల కాలంనాటి శివాలయం గుండం, నివాస నిర్మాణాల జాడలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశీలించింది. ఈ పరిశోధనల్లో 4 రాతి చిత్రాల ప్రదేశాలను గుర్తించింది. పగులు అంచుల్లో.. గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఎడమ వైపున 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రం ఉంది. ఈ చిత్రంలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు, మనిషి తలలు కనిపిస్తున్నాయి. రాతి చిత్ర పరిశోధకులకు చాలెంజ్ విసిరినట్లు ఉన్న ఈ చిత్రం రంగు తాజాదనం, చిత్రణ ఆధారంగా చారిత్రక కాలానిదని పరిశోధకులు చెబు తున్నారు. ఈ రాతి చిత్రంబండను ఆనుకుని ఉన్న పడగరాయిలో శీర్ష కోణంలో ఉన్న పగులు రెండం చుల్లో రాతిచిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ నెమలి బొమ్మ.. దాని అంచులో పైకి సాగిన తీగ, తీగ వెం బడి ఆకులు, మొగ్గలు కనిపిస్తున్నాయి. రాతి తావుకు రెండంచుల్లో ఒకే పూలతీగ కనిపిస్తోంది. ఇక్కడ కూడా ప్రాచీన మానవుని రాతి చిత్రాలు తక్కువగానే ఉన్నాయి. పాత రాతి చిత్రాల మీద కొత్తగా చారిత్రక దశలో గీసిన రాతి చిత్రాల్లా ఇవి కనిపిస్తున్నాయి. మధ్యరాతి యుగానివా? 3, 4 రాతి చిత్రాల ప్రదేశాలు మెట్ల మార్గానికి కుడివైపున 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి 30 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పున్న రాతి కాన్వాసు మీద గీసిన ఎరుపురంగు రాతి చిత్రాలు. ఈ చిత్రాలున్న ప్రదేశం కింద రాతి గుహలున్నాయి. ఇక్కడ ఒక గుహ ద్వారం అంచున రాతి చిత్రాలు, తెల్లని రం గులో హనుమంతుని చిత్రమూ కనిపిస్తోంది. ఇక్కడి రాతి చిత్రాలు కూడా చారిత్రక దశకు చెందినవే. కానీ బృంద సభ్యుడు బొగ్గుల శంకర్‌రెడ్డికి గుహలో లభించిన రాతి పనిముట్లలో కొన్ని మధ్య రాతియుగం, కొత్త రాతియుగానికి చెందినవి ఉన్నాయి. ఈ రాతిగుహల్లో మానవులు మధ్య రాతియుగాల నుంచి నివసించినట్లు వీటి ద్వారా రుజువవుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న రాతి చిత్రాలు పాత రాతి చిత్రాల మీద వేసిన కొత్త చిత్రాల్లా కనిపిస్తున్నాయి. పరిసరాల్లో పరిశోధిస్తే మరెన్నో చిత్రా లు కనిపించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రభుత్వమే రక్షించాలి మానవ పరిణామ క్రమం తెలుసుకోడానికి ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ప్రదేశాలను ప్రభుత్వం రక్షించాలి. తద్వారా అవి పరిశోధకులు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. ఇలాంటి రాతి చిత్రాల గురించి పురావస్తు శాఖ విస్తృతంగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. – రామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం టేక్మల్ మండలం వేలుపుగొండ గ్రామం వద్ద గుహలో లభ్యమైన రాతి పనిముట్లు రాతిపై నెమలి బొమ్మ -
కంది.. సస్యరక్షణతో లాభాలు దండి
సమయానుకూలంగా మెలకువలు పాటించాలి మోతాదుకు మించి ఎరువులు వాడకూడదు వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ టేక్మాల్: సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా.. దిగులు చెందాల్సిన పనిలేదు. సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే రైతులు మెరుగైన ఫలితాలను కళ్ల చూస్తారని టేక్మాల్ ఏఎఈఓ సునిల్‌కుమార్ (99499 68674) తెలిపారు. కంది పంట సాగు, సస్యరక్షణ చర్యలపై ఆయన అందించిన సలహాలు, సూచనలు.. పురుగులు: ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ తప్పక పాటించాలి. మరుకా మచ్చల పురుగు: దీని నివారణకు క్లోరిపూరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవోల్యురాన్ 0.75 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.75 మి,లీ లేదా సైహలోత్రిన్ 1 మి.లీ లీటను నీటికి కలిపి మందును మార్చి వారానికోసారి పిచికారి చేయాలి. సమగ్ర సస్యరక్షణ: వేసవిలో లోతు దుక్కిచేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షితపైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ఐ.సి.పి.యల్- 332, యల్.ఆర్.జి.41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల యల్.ఆర్.జి30, యల్.ఆర్.జి- 38 కంది రకాలను సాగుచేయాలి. పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించి వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజాడిరాక్టిన్)ను పిచికారి చేయాలి. ఎకరాకు 200 లార్వాలను సమానమైన యన్.పి.వి ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో రెండు సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు. పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, పూతలేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేక ఎసిఫేట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి హ్యండ్ కంప్రెషన్ స్ప్రేయర్‌తో పిచికారి చేయాలి. తెగుళ్లు: ఎండుతెగులు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంతభాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి,పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయాకూడదు. వెర్రితెగులు(స్టెరిలిటి మొజాయిక్): ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొలుస్తుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ, కెల్థేన్ కలిపి వారానికొకసారి రెండు దఫాలుగా పిచికిరి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, 227 రకాలను సాగుచేయాలి. మాక్రోఫొమినా ఎండు తెగులు: ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ వుంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు. -
బెండ.. సిరుల కొండ
సస్యరక్షణతో అధిక దిగుబడులు పరిమిత మందులే ఎంతో మేలు సలహాలు, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ టేక్మాల్: బెండ సాగు రైతన్నకు ఎంతో అండగా నిలుస్తుందని టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ (99499 68674) తెలిపారు. కాస్త మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకు మించి మందులను వాడకుండా తగిన మోతుదులో వాడుతూ పంటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమయానికి సహజ ఎరువులకు అధిక ప్రాధాన్యతనిస్తూ పండిస్తే మరింత దిగుబడులు పెరుగుతాయన్నారు. బెండసాగులో పురుగుల దాడిపై ఆయన అందించిన సలహ, సూచనలు మీకోసం.. మొవ్వు, కాయతొలుచు పురుగు: నాటిన 30 రోజుల నుంచి కోతదశ వరకు ఈ పురుగు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత, కాతదశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందకి తుంచాలి. లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లి లేదా లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తరువాత పిచికారి చేయాలి. పంట కాపునకు రాని దశలో థయోడికార్బ్ గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దీపపు పురుగులు: ఆకుపచ్చ రంగులో వుండే చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగ చేస్తాయి. ఆకులు పైకి ముడుచుకొని పోయి, పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మిథైల్ డెమెటాన్ 2 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. ఎర్రనల్లి: పంట చివరి దశలో చిన్న, సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ: పంటలో పూతకు ముందు చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంఖురోగాన్ని వ్యాప్తి చెందిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. తీవ్రదశలో ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గానీ, ఆముదం గానీ పూసి తెల్లదోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి. తెగుళ్ళు బూడిద తెగులు: ఆకులపైన, అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి. శంఖు లేదా పల్లాకు తెగులు: తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5గ్రా ఎసిఫేట్ కలిపి పిచికారి చే యడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు.వర్షాకాల పంటను జులై 15 ముందుగా విత్తటం ద్వారా ఈ తెగులును కొంత వరకు నివారించవచ్చు. ఎండు తెగులు: మొలక దశలో మొక్కలు మొత్తం కొద్ది సమయంలో ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. సమగ్ర సస్యరక్షణ: కిలో విత్తనానికి 5 గ్రా చొప్పున ఇమిడాక్లోప్రిడ్(గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ఎకరానికి 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం లేదా గ్రీజు పూసి పెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. రసం పీల్చేపురుగుల నివారణకు ఫాసలోన్,ఫిప్రొనిల్,డైమిధోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5గ్రా ఎసిఫేట్‌ను 1.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. -
‘పచ్చ’శాల
ఆహ్లాదకరంగా కుసంగి పాఠశాల ఆవరణంలో విరివిగా మొక్కలు సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ.. నిత్యం పర్యవేక్షణ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు టేక్మాల్: రకరకాల చెట్లు, చల్లని వాతావరణం మధ్య ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ పాఠశాల.. ఆవరణలో విరివిగా మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ చెట్ల కిందే సేదతీరుతున్నారు. మొక్కల సంరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు. టేక్మాల్ మండలం కుసంగి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎటుచూసినా చెట్లే.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయుడు తౌర్యానాయక్ల ప్రోత్సాహంతో ఆవరణలో మొక్కలు విరివిగా నాటారు. నాటిన ప్రతి మొక్కను కపాడాలన్నదే వీరి లక్ష్యం. ఇక్కడ టేకు, మామిడి, జామ, కొబ్బరి, చమాన్, రకరకాల పూల మొక్కలను నాటారు. పాఠశాలకు వచ్చే దారిలో ఇరువైపులా చమాన్ పెంచడంతో స్వాగత తోరణంగా మారింది. మరి కాస్త లోపలికి వస్తే పాఠశాల చుట్టూ చమాన్తో పాటూ, పూల మొక్కలను పెంచుతున్నారు. వెనుక భాగంగాలో పూర్తిగా టేకు మొక్కలను పెంచుతున్నారు. పాఠశాల ముందున్న జెండా గద్దె చుట్టూ పూల చమాన్‌ను పెంచడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొక్కల దత్తత ప్రతి మొక్కను క్లాస్‌ల వారీగా విద్యార్థులకు దత్తత ఇచ్చారు. నిత్యం ఆ విద్యార్థి నీటి మళ్లించడం, చెత్తను ఎరివేస్తూ గడ్డిని తొలగించడం ఆ మొక్క ఆలన, పాలన చూసుకుంటారు. వారు వినియోగించే నీరు వృధా పోకుండా చెట్లకు కాలువలు చేసి అందిస్తున్నారు. చమాన్ మొక్కలు పెద్దవిగా కాగానే ఆకృతిలో కత్తిరిస్తూ కొత్త అందాన్ని రూపొందిస్తున్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో సమయాన్ని వెచ్చిస్తూ మొక్కలను కాపాడుతున్నారు. ఉన్నత పాఠశాలలోనూ.. పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో సైతం భారీగా మొక్కలు పెరిగాయి. పూలమొక్కలు, చమాన్‌ను పెంచుతున్నారు. చెట్లకింద, చల్లని గాలి మధ్య విద్యార్థులకు చదువులను అందిస్తున్నారు. -
ఏదీ సంక్షేమం?
హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు తాగునీటికీ తిప్పలే.. నిరుపయోగంగా మరుగుదొడ్లు టేక్మాల్: విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. అయినా సంభందిత అధికారులు పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. టేక్మాల్ ఎస్సీ హస్టల్లో మౌలిక సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి బోరు సరిగ్గా పని చేయకపోవడంతో తాగునీటి నానా తిప్పలు పడుతున్నారు. నిల్వ ఉంచిన అపరిశుభ్రమైన నీటిని తాగడంతో విద్యార్థులు అనారోగ్యాలపాలవుతున్నారు. మరుగుదొడ్లలో నీటి వసతి లేకపోవడం, శుభ్రం చేయకపోవడంతో కంపుకొడుతున్నాయి. దీంతో విద్యార్థులు చెంబులు పట్టుకొని మైదానాల్లోకి వెళుతున్నారు. హాస్టల్ ఆవరణ, పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం ఉండడంతో క్రిమికీటకాలకు ఆవాసంగా మారింది. హాస్టల్లో ఫ్యాన్లు సరిగా తిరగకపోవడంతో దోమల బెడద పెరిగింది. విద్యార్థులు చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా వసతి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో మెనూ పాటించకపోవడంతో వంటలు రుచిగా ఉండడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. పలుమార్లు తమ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ఇకనైనా సంభందిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. చుట్టపు చూపుగా వస్తున్న వార్డెన్ స్థానికంగా ఉంటూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ఎస్సీ హాస్టల్వార్డెన్ చుట్టపు చూపుగా వస్తున్నారు. ఆయన ఎప్పుడూ వస్తున్నారో ఎప్పుడూ వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వార్డెన్ విధులకు ఎగనామం పెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. -
దమ్ము చక్రాలతో దుమ్ము లేస్తున్న రోడ్లు
తేలుతున్న కంకర.. గోతులమయంగా రహదారులు గుంతల్లో నిలుస్తున్న నీరు.. ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ పట్టించుకోని అధికారులు టేక్మాల్ : దమ్ము చక్రాలతో రోడ్లన్నీ దుమ్ములేస్తున్నాయి. ఒక ట్రాక్టర్ వెనుక మరొకటి వెళుతుండడంతో రోడ్లపై ఏకంగా చిన్నాపాటి కాలువల్లా గోతులు ఏర్పడుతున్నాయి. వాటిపై వెళుతున్న వాహనదారులు అదుపుతప్పి పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై దమ్ము చక్రాలతో వాహనాలను నడపవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ పట్టించుకోకుండానే తమ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. దీంతో గ్రామీణ రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. అదే రోడ్లపై వాహనదారుల, ప్రయాణికుల ప్రాణాల మీదకు వస్తోంది. మండలంలోని టేక్మాల్ చౌరస్తా నుంచి ఎలకుర్తి, శేర్పల్లి ఎల్లుపేట, కమ్మరిత్త, బొడగట్, కుసంగి నుంచి దనూర, కోరంపల్లి రోడ్లు, టేక్మాల్ నుంచి అచ్చన్నపల్లి వరకు గల గ్రామీణ రోడ్లపై అధికంగా దమ్ము చక్రాలున్న వాహనాలను యథేచ్ఛగా నడుపుతున్నారు. అంతేకాకుండా ప్రధాన రహదారులైనా మెదక్–బొడ్మట్‌పల్లి, జోగిపేట–నారాయణఖేడ్ రోడ్లపై దమ్ము చక్రాల వాహనాలు నిత్యం తిరుగుతున్నాయి. దీంతో రోడ్లపై గీతలు పడుతూ కోసుకుపోతున్నాయి. రోడ్లపై కంకర తేలి గోతులు పడుతున్నాయి. గోతులలో వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో గుంతల్లోని లోతు తెలియకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లపై రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే ప్రజలు జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్రభయాందోళన చెందుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలివీ.. దమ్ము చక్రాలు లేదా ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టర్లు తారు రోడ్డు మీద తిరగడం వల్ల ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారులు అనతి కాలంలో పాడవుతున్నాయి. దమ్ము చక్రాలు బిగించిన ట్రాక్టర్లు తారు రోడ్లపై తిరగడాన్ని ప్రభుత్వం నిషేధించింది. రహదారులు, భవనాలశాఖ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, జిల్లా ట్రా¯Œ్సపోర్టు అథారిటీ సిబ్బంది వీటిపై విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి తనిఖీ బృందాలకు అధికారాలు ఇచ్చారు. మొదటి సారిగా పట్టుబడితే రూ.5వేల వరకు జరిమానా విధిస్తారు. రెండవ సారి అదే ట్రాక్టర్ కేజ్ వీల్స్‌తో తారు రోడ్డుపై నడిపితే జప్తు చేస్తారు. ట్రాక్టర్ డ్రైవర్‌కు 6నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇలా నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ దర్జాగా రోడ్లపై దమ్ము చక్రాలతో వాహనాలు తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోడ్లు పాడైపోతుండడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టికొట్టుకుపోతోంది. ఇకనైనా సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో.. -
దరఖాస్తుల పల్లి
రేగోడ్ : కొన్ని దశాబ్దాల క్రితం జమీందారులకు వందల ఎకరాల్లో భూములు ఉండేవి. పట్టాభూములు, సీలింగ్ భూములతో దొరలుగా చలామణి అయ్యేవారు. ఈ భూములను తమకివ్వాలంటూ పేద ప్రజలు దరఖాస్తులు చేసుకునే వారు. ఈ క్రమంలో ఆ గ్రామం దరఖాస్తుపల్లిగా పేరు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. రేగోడ్ మండలం ఉసిరికపల్లి గ్రామ పంచాయతీలో దరఖాస్తుపల్లి ఉంది. టేక్మాల్ గ్రామానికి చెందిన ఖాదర్‌బాషా సోదరులు నలుగురు. సుమారు వందేళ్ల క్రితం దరఖాస్తుపల్లి శివారుల్లోని ప్రాంతాల్లో వీరిలో ఒక్కొక్కరికి వందల ఎకరాల భూమి ఉండేదని పూర్వికులు చెప్తున్నారు. నలుగురు అన్నదమ్ముల్లోని ఒకరైన ఖాదర్బాషాకు దరఖాస్తుపల్లి ప్రాంతంలో సుమారు 760 ఎకరాల భూమి ఉండేదని తెలిపారు. మొదట్లో ఇక్కడ ఐదారుగురు గుడెసెలు వేసుకునే జీవించే వారు. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన మరికొందరు గుడెసెలు వేసుకుని నివసించే వారు. ఈ క్రమంలోనే జమీందారు ఖాదర్‌బాషా.. దరఖాస్తుఖేడ్గా పేరును పెట్టారట. ఆ తరువాత తమకు సీలింగ్ భూములు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకునేవారట. ఇక అందరూ దరఖాస్తుపల్లి అంటూ పిలుచుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా ప్రస్తుతం దరఖాస్తుపల్లి అనే ఉంది. ఈ గ్రామంలో సుమారు వంద ఇళ్లు, 260 మంది ఓటర్లు, 600 జనాభా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. దరఖాస్తుపల్లిలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సీలింగ్ భూముల కోసం దరఖాస్తులు చాలా ఏళ్ల కిందట దొరలకు వందల ఎకరాల భూములు ఉండేవి. సీలింగ్ భూములు ఇవ్వాలని ప్రజలు దరఖాస్తులు చేసేవారు. దీంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరు పొందింది. – తలారి బాలయ్య, దరఖాస్తుపల్లి ఇంకా దరఖాస్తులు చేస్తూనే ఉన్నాం నాడు దరఖాస్తులు చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు చేయడంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరుగాంచింది. నాటినుంచి నేటివరకూ గ్రామాస్తులు సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. – సూర్రెడ్డి అడ్వకేట్, ఉసిరికపల్లి -
చికిత్సపొందుతూ విద్యార్థి మృతి
టేక్మాల్: పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్ మండలం ఎలకుర్తిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింగస్వామి కథనం ప్రకారం... పాపన్నపేట మండ లం గాంధారిపల్లికి చెందిన కాసాల వెంకట్‌రెడ్డి విజయలక్ష్మి దంపతుల కుమారుడు లక్ష్మారెడ్డి(13) ఈనెల ఒకటిన టేక్మాల్ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్ష ముగించుకొని మామ అయిన ఎలకుర్తి గ్రామానికి చెందిన బాపురెడ్డి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న లక్ష్మారెడ్డి ఈనెల 13న చేతులు, కాళ్లు గుంజుతున్నాయని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని మెదక్ ఆస్పత్రికి తరలించగా పాముకాటు వేసినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. అదేరోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
'నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..'
టేక్మాల్ (మెదక్) : మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామంలోని గటంగారోల్ల కుంటలో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పనులను నాణ్యంగా, త్వరితగతిన చేయకుంటే లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. పనులపై అశ్రద్ధ వద్దని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలంలో రెండో విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 35 చెరువుల పనులకు రూ.17.23 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. -
వ్యాధులతో గిరిజనులు విలవిల!
టేక్మాల్: సీజనల్ వ్యాధులతో గ్రామీణ ప్రాంత ప్రజలు విలవిలాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు వ్యాధులతో వణికిపోతున్నారు. సమయానికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట మదిర నల్లకుంట తండాకు చెందిన గిరిజనులంతా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తండాకు చెందిన దేవీసింగ్ (50) దోలీబాయి (40), ఇఠ్యానాయక్ (32),అంబ్యా నాయక్ (55), చాందిబాయి(40), దుమ్యా నాయక్ (54) సేవ్యానాయక్(24), ప్రవీణ్, వైష్ణవి, చరణ్, సునీత, శ్రీకాంత్, శ్రావణ్, రోహిత్, శ్రీలత తదితరులు (పది సంవత్సరాల లోపు చిన్నారులు) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారంతా జ్వరంతో, నొప్పులతో బాధపడుతూ మంచం పట్టారు. రోగాలు చిన్నారులకు ఎక్కువగా సోకడంతో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు గత నాలుగు రోజులుగా వెళ్లడం లేదని ండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలోని నల్లాలు, చేతిపంపులు, జెట్ పంపుల చుట్టూ, ఇళ్ల చుట్టూ మురికి నీరు పేరుకుపోయింది. కాలువల్లో నీరంతా ఎక్కడి కక్కడ దుర్గధం వెదజల్లుతోంది. తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో నీరంతా కలుషితమై, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది పలువురు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పలుమార్లు వైద్యాధికారులు ఫిర్యాదు చేసినా వారు తొంగి చూసిన పాపాన పోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న పాపన్నపేట మండలంలోని నార్సింగ్, శంకరంపేట, టేక్మాల్, మెదక్ తదితర పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నామన్నారు. దీంతో విపరీతమైన డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి వైద్య సేవలను అందించాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్ఐ
టేక్మాల్, న్యూస్‌లైన్: టేక్మాల్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి గురువారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్ వద్దకు తరలివచ్చారు. ఏసీబీ అధికారులు ఎస్ఐని అరెస్టు చేసినట్లు తెలియగానే, వారంతా సంబరాలు చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ సంఘటనకు సంబంధించి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలంలోని ఎలకుర్తి గ్రామంలో గతనెల 10న ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఓ వర్గం వారు మరోవర్గానికి చెందిన కందిపల్లి మాణెయ్య, నాగయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లుపై అక్టోబర్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్, కేసులో ఏ-4గా ఉన్న ఆర్టీసీ డ్రైవర్ అయిన కందిపల్లి మాణెయ్యను స్టేషన్‌కు పిలిపించాడు. తాను కేసు నమోదు చేస్తే ఉద్యోగం పోతుందని మాణెయ్యను ఎస్ఐ బెదిరించాడు. రూ.20 వేలు ఇస్తే కేసు కాకుండా చూడడంతో పాటు స్టేషన్లోనే బెయిల్ ఇస్తానని తెలిపాడు. దీంతో బాధితుడు మాణెయ్య ఎస్ఐ కాళ్లమీద పడ్డాడు. తనవద్ద అంత డబ్బులేదని రూ.10 వేలు మాత్రం ఇవ్వగలనని బతిమాలుకున్నాడు. ఇందుకు ఎస్ఐ ఒప్పుకోవడంతో అక్టోబర్ 14న మాణెయ్య రూ.4 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగతా రూ.6 వేలు చెల్లించేందుకు తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 13న(బుధవారం) మాణెయ్యను స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్, గురువారం మధ్యాహ్నం లోపు రూ.10 వేలు చెల్లించాలని లేకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన మాణెయ్య, ఏం చేయాలో తెలియక సంగారెడ్డిలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. వారి సూచన మేరకు గురువారం రూ.10 వేలు తీసుకువెళ్లి స్టేషన్లో ఉన్న ఎస్ఐకి ఇచ్చాడు. దాన్ని తీసుకున్న ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తన వద్ద కొంత డబ్బు పెట్టుకుని, మిగతా సొమ్మును హోంగార్డు గోపాల్‌కు ఇచ్చి తన రూంలో ఉన్న బ్యాగ్‌లో పెట్టిరమ్మని పంపాడు. ఇదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐ ప్రదీప్‌కుమార్‌ను, హోంగార్డు గోపాల్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐని అరెస్టు చేశారు. అనంతరం ఎస్ఐ రూంకు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ రూ.11 వేలు లభించాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో హోంగార్డు గోపాల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్ స్వగ్రామానికి వెళ్లి అతని ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446155 నంబర్‌కు పోన్ చేయాలని ఆయన సూచించారు. ఈ దాడిలో మెదక్ ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీబీ ఇన్స్పెక్టర్ రఘునాథ్‌లతో పాటు రెండు జిల్లాల ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. మిన్నంటిన స్థానికుల సంబరాలు ఎస్ఐ ప్రదీప్‌కుమార్‌ను ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఎస్ఐని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలపగానే స్థానికులంతా పోలీస్‌స్టేషన్ ఎదుటే టపాకాయలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన ఏసీబీ అధికారులు ఎస్ఐ ప్రవర్తనపై స్థానికులు ఎంతగా విసిగిపోయారో అంటూ చర్చించుకున్నారు. తీవ్రంగా వేధించారు తప్పుచేయకున్నా నాపై, నా కుటుంబసభ్యులపై ఎస్ఐ ప్రదీప్‌కుమార్ కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. కేసునమోదు చేసి జైలు పంపడంతో పాటు ఉద్యోగం పోయేలా చేస్తానంటూ బెదరించాడు. రూ.20 వేలు అడిగితే కాళ్లమీద వేడుకున్నా. చివరకు రూ.10 వేలకు ఒప్పుకుని మళ్లీ మాటమార్చాడు. అందువల్లే ఏం చేయాలో తెలియక ఏసీబీ అధికారులను సంప్రదించి వారు చెప్పినట్లు చేశాను. -మాణెయ్య, ఆర్టీసీ డ్రైవర్