టేక్మాల్, న్యూస్‌లైన్: టేక్మాల్ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి గురువారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్ వద్దకు తరలివచ్చారు. ఏసీబీ అధికారులు ఎస్‌ఐని అరెస్టు చేసినట్లు తెలియగానే, వారంతా సంబరాలు చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ సంఘటనకు సంబంధించి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలంలోని ఎలకుర్తి గ్రామంలో గతనెల 10న ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఓ వర్గం వారు మరోవర్గానికి చెందిన కందిపల్లి మాణెయ్య, నాగయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లుపై అక్టోబర్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, కేసులో ఏ-4గా ఉన్న ఆర్టీసీ డ్రైవర్ అయిన కందిపల్లి మాణెయ్యను స్టేషన్‌కు పిలిపించాడు. తాను కేసు నమోదు చేస్తే ఉద్యోగం పోతుందని మాణెయ్యను ఎస్‌ఐ బెదిరించాడు. రూ.20 వేలు ఇస్తే కేసు కాకుండా చూడడంతో పాటు స్టేషన్‌లోనే బెయిల్ ఇస్తానని తెలిపాడు.
దీంతో బాధితుడు మాణెయ్య ఎస్‌ఐ కాళ్లమీద పడ్డాడు. తనవద్ద అంత డబ్బులేదని రూ.10 వేలు మాత్రం ఇవ్వగలనని బతిమాలుకున్నాడు. ఇందుకు ఎస్‌ఐ ఒప్పుకోవడంతో అక్టోబర్ 14న మాణెయ్య రూ.4 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగతా రూ.6 వేలు చెల్లించేందుకు తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 13న(బుధవారం) మాణెయ్యను స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, గురువారం మధ్యాహ్నం లోపు రూ.10 వేలు చెల్లించాలని లేకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన మాణెయ్య, ఏం చేయాలో తెలియక సంగారెడ్డిలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. వారి సూచన మేరకు గురువారం రూ.10 వేలు తీసుకువెళ్లి స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐకి ఇచ్చాడు.
దాన్ని తీసుకున్న ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తన వద్ద కొంత డబ్బు పెట్టుకుని, మిగతా సొమ్మును హోంగార్డు గోపాల్‌కు ఇచ్చి తన రూంలో ఉన్న బ్యాగ్‌లో పెట్టిరమ్మని పంపాడు. ఇదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ను, హోంగార్డు గోపాల్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఐని అరెస్టు చేశారు. అనంతరం ఎస్‌ఐ రూంకు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ రూ.11 వేలు లభించాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో హోంగార్డు గోపాల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ స్వగ్రామానికి వెళ్లి అతని ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446155 నంబర్‌కు పోన్ చేయాలని ఆయన సూచించారు. ఈ దాడిలో మెదక్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ రఘునాథ్‌లతో పాటు రెండు జిల్లాల ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
మిన్నంటిన స్థానికుల సంబరాలు
ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ను ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఎస్‌ఐని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలపగానే స్థానికులంతా పోలీస్‌స్టేషన్ ఎదుటే టపాకాయలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐ ప్రవర్తనపై స్థానికులు ఎంతగా విసిగిపోయారో అంటూ చర్చించుకున్నారు.
తీవ్రంగా వేధించారు
తప్పుచేయకున్నా నాపై, నా కుటుంబసభ్యులపై ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. కేసునమోదు చేసి జైలు పంపడంతో పాటు ఉద్యోగం పోయేలా చేస్తానంటూ బెదరించాడు. రూ.20 వేలు అడిగితే కాళ్లమీద వేడుకున్నా. చివరకు రూ.10 వేలకు ఒప్పుకుని మళ్లీ మాటమార్చాడు. అందువల్లే ఏం చేయాలో తెలియక ఏసీబీ అధికారులను సంప్రదించి వారు చెప్పినట్లు చేశాను.
-మాణెయ్య, ఆర్టీసీ డ్రైవర్
ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ
Published Fri, Nov 15 2013 1:23 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
Advertisement