చింతలమానెపల్లి(సిర్పూర్): లంచం కోసం యువకుడిని వేధించిన చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి పట్టుబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండల ఎస్సై ఎన్.వెంకటేశ్, హోంగార్డ్ జనార్దన్ శుక్రవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో గత నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. మహారాష్ట్రలోని అహేరి పట్టణానికి అమె వెళ్లేందుకు దిందా గ్రామానికి చెందిన యువకుడు డోకె ప్రశాంత్ సహకరించాడు.
పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. కొద్దిరోజుల అనంతరం సదరు వివాహిత ఇంటికి తిరిగి వచ్చింది. ఈ ఘటనలో రూ.70వేల లంచం ఇవ్వాలని ప్రశాంత్‌ను ఎస్సై వెంకటేశ్ వేధించాడు. అడిగినంత ఇవ్వకుంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బేరసారాల మధ్య ప్రశాంత్ రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రశాంత్ గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల వేసి ఎస్సైని పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.
ఎస్సై డిమాండ్ చేసిన నగదును మధ్యవర్తి డోకె శ్రీనివాస్ చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద హోంగార్డు జనార్దన్‌కు ఇస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి ఎస్సై వెంకటేశ్, హోంగార్డు జనార్దన్‌ను శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. లంచం కోసం ఎవరైనా వేధిస్తే ఏసీబీని 9154388963 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ దాడిలో ఎస్సైలు రాము, జాన్సన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment