డ్రోన్‌ల ద్వారా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు
ఎట్టకేలకు ప్రాణహిత నది దాటిన ఏనుగు
పెంచికల్‌పేట్ మండలంలో 36 గంటలపాటు సాగిన సెర్చ్ ఆపరేషన్
డ్రోన్‌ల సహాయంతో ప్రత్యేక బృందాల గాలింపు
ఫలించిన అటవీశాఖ అధికారుల కృషి
ఊపిరి పీల్చుకున్న ఆసిఫాబాద్ ప్రజలు
పెంచికల్‌పేట్(సిర్పూర్): గజరాజు గండం ముగిసింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఏనుగు ఎట్టకేలకు ప్రాణహిత నది దాటింది. శుక్రవారం నుంచి పెంచికల్‌పేట్ మండలం కమ్మర్‌గాం, జిల్లెడ, మురళీగూడ గ్రామ సమీపంలో ఏనుగును గుర్తించి అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు, పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఫలితంగా ఏనుగు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మురళీగూడ వద్ద ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అడవుల్లోకి ప్రవేశించింది. పెంచికల్‌పేట్ మండలంలో 36 గంటలపాటు కొనసాగిన గజరాజు సెర్చ్ ఆపరేషన్ ముగియడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.
బూరెపల్లి టు మురళీగూడ
ఈ నెల 3న మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి వచ్చిన ఏనుగు బూరెపల్లి గ్రామ శివారులో పంట చేనులో అల్లూరి శంకర్‌పై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చింది. అక్కడి నుంచి ఖర్జెల్లి, రుద్రాపూర్, సులుగుపల్లి గ్రామాల మీదుగా పెంచికల్‌పేట్ మండలంలోకి ప్రవేశించింది. ఈ నెల 4న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామ సమీపంలోకి వచ్చింది. అక్కడ తెల్లవారుజామున వరి పొలానికి నీటిని అందించేందుకు వెళ్తున్న కారు పోశన్నను తొక్కి చంపింది. ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో అటవీశాఖ అధికారులు చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, కౌటాల మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగును గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్‌ల సహాయంలో గాలింపు ముమ్మరం చేశారు. కొండపల్లిలో రైతును హతమార్చిన అనంతరం ప్రత్యేక బృందాలు డ్రోన్‌ల సహాయంతో గాలించినా గురువారం ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. మళ్లీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత లోడుపల్లి– పెంచికల్‌పేట్ ప్రధాన రహదారిపై కొండపల్లి టర్నింగ్ వద్ద ఆర్టీసీ బస్సుకు ఎదురైంది. రాత్రిపూట గజరాజు కదలికలను గుర్తించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
గ్రామాల్లో భయం భయం
ఏనుగు సంచారంతో మూడు రోజులపాటు చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, కౌటాల, దహెగాం మండలాల ప్రజలు భయం భయంగా గడిపారు. పంట చేలు, రోడ్లపై తిరుగుతుండటంతో గిరిజన గ్రామాల్లో బయటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఏనుగు నది తీరం దాటిపోయిందని అధికారులు నిర్ధారించడంతో సరిహద్దులోని గిరిజన గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
బైక్ వదిలేసి పరిగెత్తాం
గురువారం రాత్రి సలుగుపల్లి నుంచి పెంచికల్‌పేట్ వస్తుండగా లోడుపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు ఎదురైంది. భయంతో బైక్ వదిలేసి వెనక్కి పరిగెత్తాం. ఆర్టీసీ బస్సు ఎదురుకావడంతో ఏనుగు వెళ్లిపోయింది. ప్రయాణికుల సాయంతో బైక్ తీసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెంచికల్‌పేట్ చేరుకున్నాం.
– డోకె రవి, పెంచికల్‌పేట్
రూ.50లక్షల పరిహారం చెల్లించాలి
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి. గతంలో పెద్దపులి దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. బాధిత కుటుంబాల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
– కోట సతీశ్, మురళీగూడ మం.పెంచికల్‌పేట్
ఇద్దరి ప్రాణాలు పోయాయి
వన్యప్రాణుల దాడులతో భయం భయంగా గడుపుతున్నాం. ఇప్పటికే కొండపల్లి గ్రామంలో పెద్దపులి, ఏనుగు దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వన్యప్రాణుల దాడుల సమయంలో హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇకనైనా ప్రజల రక్షణకు చర్యలు చేపట్టాలి.
– మెంగబోయిన పోశన్న, కొండపల్లి, మం.పెంచికల్‌పేట్
కమ్మర్‌గాంలో ప్రత్యక్షం
లోడుపల్లి వద్ద సంచరించిన ఏనుగు శుక్రవారం ఉదయం కమ్మర్‌గాం గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం వద్ద ప్రత్యక్షమైంది. దానిని చూసిన గ్రామస్తులు హడలిపోయి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. లోడుపల్లి, మెరెగూడ నుంచి అటవీప్రాంతం నుంచి గుండెపల్లి మీదుగా కమ్మర్‌గాం చేరుకున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక బృందాలు డ్రోన్‌ల సహాయంలో మురళీగూడ ముసలమ్మ గుట్టపై తిరుగుతున్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మురళీగూడ నుంచి కమ్మర్‌గాం వస్తున్న ఆటోకు ఎదురురావడంతో అందులోని ప్రయాణికులు, డ్రైవర్ ఆటో వదిలేసి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల సహాయంతో అధికారులు ఏనుగు పాదాల గుర్తులను పరిశీలిస్తూ జిల్లెడ గ్రామ సమీపంలోకి చేరుకున్నారు.
రాత్రి 7 గంటల ప్రాంతంలో మురళీగూడ సమీపంలోని పాలకుంట వద్ద ఏనుగును అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతోపాటు స్థానిక అటవీశాఖ అధికారులు, పోలీసులు సమన్వయంతో ఏనుగును సురక్షితంగా ప్రాణహిత నదిని దాటించటానికి ప్రణాళికలు రూపొందించారు. దానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ సుమారు 14 గంటల పాటు కమ్మర్‌గాం నుంచి మురళీగూడ వరకు ఈ ఏనుగు అనుసరించారు. రాత్రి సుమారు 7.30 గంటల ప్రాంతంలో మురళీగూడ వద్ద ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని చిన్నవట్ర అటవీ ప్రాంతంలోకి ఏనుగు వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment