కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్
మనసు దోచే అందాలు
శీతాకాలంలోనూ మైమరిపించే అడవులు
ఉమ్మడి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు
తెలంగాణ కశ్మీరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. శీతాకాలంలో.. మంచు కురిసే వేళలో.. అనేక పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతి పంచుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. సాధారణంగా చలికాలంలో సాయంత్రం అయితే ఇళ్లకే పరిమితమవుతారు. అయితే చలి కాలంలోనూ ప్రకృతి అందాలను ఆస్వాదించే పర్యాటకులు ఉంటారు.
అందులోనూ అడవులు, కొండలు, జలపాతాలు, సెలయేళ్లు, పచ్చదనం పరుచుకున్న ఉమ్మడి జిల్లాలో చలి కాలంలోనూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని పర్యాటక నిపుణులు చెబుతున్నారు. వానాకాలం, ఎండాకాలం కంటే మంచుకురిసే వేళలోనూ మనసు దోచే అందాలను తిలకించవచ్చని సూచిస్తున్నారు. ట్రెక్కింగ్, సైక్లింగ్, హైకింగ్, కాంపెయిన్లతో అడవుల్లో అటవీశాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల
కవ్వాల్ కిటకిట
ఇప్పటికే అనేక మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కవ్వాల్ కేంద్రంగా ఉన్న టైగర్ రిజర్వుకు నిత్యం తరలివస్తున్నారు. ఇక చలి కాలంలోనూ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ సమయంలోనే వన్యప్రాణులు, పక్షులు అధికంగా ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఉండడంతో అడవిని చుట్టేసేందుకు సఫారీని బుక్ చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను నేరుగా తిలకించేందుకు బర్డ్‌వాక్ ఫెస్టివల్, నేచర్‌వాక్ పేరుతో ఇప్పటికే అటవీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఆదివారం కవ్వాల్‌లో బర్డ్‌వాక్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వారాంతాల్లో ఉద్యోగులు, వ్యాపారులు, యువత, విద్యార్థులు అడవుల్లో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ ప్రాంతాల్లో...
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు శీతాకాలంలో కశ్మీర్ తరహాలో మంచుకురిసే స్థాయిలో వాతావరణం మారుతుంటుంది. తిర్యాణి, సిర్పూర్ యూ, కెరమెరి మండలాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పానికి చేరుతుంటాయి. ఇక్కడి ప్రాంతాలు కొండ కోనలు, అడవుల మధ్య మంచు కురుస్తూ అచ్చం కశ్మీర్‌ను తలపిస్తాయి. ఆధ్యాత్మికంగానూ జైనథ్ గుడి, బాసర, దండేపల్లిలో గూడెం సత్యనారాయణ స్వామి క్షేత్రం, గిరిజన ఆరాధ్య కేంద్రాలైన కేస్లాపూర్, కుమురం భీం పోరుగడ్డ జోడేఘాట్, మంచిర్యాల సమీపంలోని గాంధారి ఖిల్లా, ఏసీసీ క్వారీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు వంటి తదితర ప్రాంతాలు సందర్శించవచ్చు.
ఆసక్తి పెరుగుతోంది
ప్రకృతి పరంగా ఈ సమయంలో గడపడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రకృతిలో గడిపే వారి సంఖ్య పెరుగుతోంది. మనస్సుకు ఆహ్లాదం పంచే ప్రాంతాలను తరచూ సందర్శిస్తుంటాం.
– రవి సిరిపురం, పర్యాటకుడు, మంచిర్యాల
అద్భుత ప్రాంతాలు ఉన్నాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. శీతాకాలంలోనూ పర్యటించే వారికి చక్కని అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే మేం చాలా చోట్లకు వెళ్లాం.
– శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment