
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఈ నెల 30వరకు అవకాశం
కై లాస్‌నగర్: ఎల్‌ఆర్‌ఎస్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దాన కిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు విధించిన గడువు గత నెల 31తో ముగిసింది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువు పొడిగించింది. అయితే దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
రూ.8.80 కోట్ల ఆదాయం
జిల్లాలో మార్చి 31వరకు చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో కలిపి రూ.8.80 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లావ్యాప్తంగా 5,085 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఇందులో మున్సిపల్ పరిధిలో రూ.6.72 కోట్ల ఆదాయం, గ్రామ పంచాయతీల్లో రూ.2.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నవీన్‌కుమార్ తెలిపారు.
ఈ సారైనా వందశాతం పూర్తయ్యేనా..
ఫీజులో 25శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం వందశాతం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. అయినప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆదిలాబా ద్ మున్సిపల్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్–2020లో ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం 22,369 దరఖాస్తులు రాగా అందులో 12,830 దరఖాస్తులకు ఫీజు చెల్లింపునకు అనుమతినిచ్చారు. అయితే అందులో కనీసం సగం మంది కూడా స్పందించలేదు. కేవలం 3,909 మంది మాత్రమే ముందుకొచ్చి ఫీజు చెల్లించారు. ఇంకా వేలల్లోనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం మొత్తం 6,057 దరఖాస్తులు రాగా అందులో 4,100 దరఖాస్తులకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ చేసేందుకు అనుమతించా రు. ఇందులో 1,176 మంది మాత్రమే ముందుకొచ్చారు. పంచాయతీల్లోనూ భారీగానే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మరో నెల రోజులు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ సారైనా వందశాతం ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్–2020లో భాగంగా ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత నెల 30 వరకు గడువు ముగిసినా ఈ నెల 30వరకు పొడిగించింది. దరఖాస్తుదారులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్‌లను జారీ చేస్తున్నాం. ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
– నవీన్‌కుమార్, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్