టేక్మాల్‌లో సాగవుతున్న కందిపంట
సమయానుకూలంగా మెలకువలు పాటించాలి
మోతాదుకు మించి ఎరువులు వాడకూడదు
వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు తప్పనిసరి
టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్
టేక్మాల్: సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా.. దిగులు చెందాల్సిన పనిలేదు. సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే రైతులు మెరుగైన ఫలితాలను కళ్ల చూస్తారని టేక్మాల్ ఏఎఈఓ సునిల్‌కుమార్ (99499 68674) తెలిపారు. కంది పంట సాగు, సస్యరక్షణ చర్యలపై ఆయన అందించిన సలహాలు, సూచనలు..
పురుగులు:
ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్‌ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ తప్పక పాటించాలి.
మరుకా మచ్చల పురుగు: దీని నివారణకు క్లోరిపూరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవోల్యురాన్ 0.75 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.75 మి,లీ లేదా సైహలోత్రిన్ 1 మి.లీ లీటను నీటికి కలిపి మందును మార్చి వారానికోసారి పిచికారి చేయాలి.
సమగ్ర సస్యరక్షణ:
- వేసవిలో లోతు దుక్కిచేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది.
- ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
- ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షితపైరుగా విత్తాలి.
- పచ్చపురుగును తట్టుకునే ఐ.సి.పి.యల్- 332, యల్.ఆర్.జి.41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల యల్.ఆర్.జి30, యల్.ఆర్.జి- 38 కంది రకాలను సాగుచేయాలి.
- పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
- ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
- పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించి వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజాడిరాక్టిన్)ను పిచికారి చేయాలి.
- ఎకరాకు 200 లార్వాలను సమానమైన యన్.పి.వి ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో రెండు సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
- బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి.
- రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు.
- పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, పూతలేదా కాయదశలో క్వినాల్‌ఫాస్ 2.0 మి.లీ లేక ఎసిఫేట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి హ్యండ్ కంప్రెషన్ స్ప్రేయర్‌తో పిచికారి చేయాలి.
తెగుళ్లు:
ఎండుతెగులు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంతభాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి,పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయాకూడదు.
వెర్రితెగులు(స్టెరిలిటి మొజాయిక్): ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొలుస్తుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ, కెల్‌థేన్ కలిపి వారానికొకసారి రెండు దఫాలుగా పిచికిరి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, 227 రకాలను సాగుచేయాలి.
మాక్రోఫొమినా ఎండు తెగులు: ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ వుంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు.