Redgram crop
-
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్‌రావు
సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు) పంట మార్పిడితో రైతులకు మేలు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు.. రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు. కొత్త వంగడాలు వచ్చాయి.. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు. పత్తికి డిమాండ్ పెరిగింది.. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారన్నారు. వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..? జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. -
కంది.. సస్యరక్షణతో లాభాలు దండి
సమయానుకూలంగా మెలకువలు పాటించాలి మోతాదుకు మించి ఎరువులు వాడకూడదు వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ టేక్మాల్: సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా.. దిగులు చెందాల్సిన పనిలేదు. సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే రైతులు మెరుగైన ఫలితాలను కళ్ల చూస్తారని టేక్మాల్ ఏఎఈఓ సునిల్‌కుమార్ (99499 68674) తెలిపారు. కంది పంట సాగు, సస్యరక్షణ చర్యలపై ఆయన అందించిన సలహాలు, సూచనలు.. పురుగులు: ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ తప్పక పాటించాలి. మరుకా మచ్చల పురుగు: దీని నివారణకు క్లోరిపూరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవోల్యురాన్ 0.75 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.75 మి,లీ లేదా సైహలోత్రిన్ 1 మి.లీ లీటను నీటికి కలిపి మందును మార్చి వారానికోసారి పిచికారి చేయాలి. సమగ్ర సస్యరక్షణ: వేసవిలో లోతు దుక్కిచేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షితపైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ఐ.సి.పి.యల్- 332, యల్.ఆర్.జి.41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల యల్.ఆర్.జి30, యల్.ఆర్.జి- 38 కంది రకాలను సాగుచేయాలి. పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించి వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజాడిరాక్టిన్)ను పిచికారి చేయాలి. ఎకరాకు 200 లార్వాలను సమానమైన యన్.పి.వి ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో రెండు సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు. పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, పూతలేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేక ఎసిఫేట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి హ్యండ్ కంప్రెషన్ స్ప్రేయర్‌తో పిచికారి చేయాలి. తెగుళ్లు: ఎండుతెగులు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంతభాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి,పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయాకూడదు. వెర్రితెగులు(స్టెరిలిటి మొజాయిక్): ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొలుస్తుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ, కెల్థేన్ కలిపి వారానికొకసారి రెండు దఫాలుగా పిచికిరి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, 227 రకాలను సాగుచేయాలి. మాక్రోఫొమినా ఎండు తెగులు: ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ వుంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు. -
ఆశాజనకంగా కంది పంట
రాయికోడ్: మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఈ ఏడాది సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రాయికోడ్, పీపడ్పల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, రామోజిపల్లి, నల్లంపల్లి, సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల్లో రైతులు కంది పంటను సాగు చేశారు. అనంతరం పంట ఎదుగుదల, రక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుతున్నారు. ఇటీవల మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కంది పంటకు ఎంతో మేలు చేకూర్చింది. కంది పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఏపుగా పెరిగిన మొక్కలతో కంది పొలాలు కళకళలాడుతున్నాయి. మండలంలోని 32 గ్రామాల్లో ఈ ఏడాది 1,280 హెక్టార్ల విస్తీర్ణంలో కంది పంటను సాగు చేశారు. గత ఏడాది ఎంతో ఆశతో కంది పంటను సాగు చేసిన రైతులకు లద్దె పురుగు బెడదతో నష్టాలు వచ్చాయి. పంటలో 50 శాతం కంది పంట లద్దెపురుగు దాటికి గురైంది. దీంతో పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రైతులకు రాలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని కంది సాగు రైతులు పంట పొలాలను నిత్యం పరిశీలిస్తూ మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది కూడా కందికి ఇప్పుడిప్పుడే లద్దెపురుగు ఆశిస్తోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లద్దె పురుగు బారి నుంచి పంటను రక్షించుకుంటే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. -
కందిలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు మేలు
పెసర ఎల్బీజీ-407, 457, 450, 410 రకాలు ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలం. మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పై భాగాన కాయలు కాస్తాయి. ఇవి పల్లాకు, వేరుకుళ్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్లను తట్టుకుంటాయి. వరి మాగాణుల్లో అయితే నీటి తడి అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. పెసర, అలసంద, మినుమును రబీ కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేసుకోవాలి. అలసంద స్థానికంగా దొరికే విత్తనాలను రైతులు సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. ఎం-45 మందుతో కలిపి శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించవచ్చు. చివరి దుక్కిలో 50 కిలోల డీఏపీ వేసుకోవాలి. మినుము ఎల్బీజీ-752, ఎల్బీజీ-20, 623 రకాలను సాగు చేసుకోవచ్చు. 70-80 రోజుల్లో పంట చేతికొస్తుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 6-7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 752, 20 విత్తన రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. ఎల్బీజీ-623 రకం బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. ఈ విత్తనాలను నాటుకోవచ్చు, వెదజల్లుకోవచ్చు. ఎల్బీజీ-645 రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవుగా ఉంటాయి. కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనాలను శుద్ధి చేస్తే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం స్థానికంగా దొరికే రకాలతో పాటు క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్, జ్వాలా హైబ్రిడ్ రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519 రకాలను సాగు చేసుకోవచ్చు. క్రాంతి రకం త్వరగా కోతకు వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత, జ్యోతి రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. విత్తిన 7-10 రోజుల్లో మొలక వస్తుంది. 15-20 రోజుల తర్వాత కనుపునకు ఒకే మొక్క ఉండేలా.. చుట్టూ ఉన్న మొక్కలను పీకేయాలి. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. వివిధ రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి.