కర్చల్‌లో ఏపుగా ఎదిగిన కందిపంట మొక్కలు
రాయికోడ్: మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఈ ఏడాది సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రాయికోడ్, పీపడ్‌పల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, రామోజిపల్లి, నల్లంపల్లి, సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల్లో రైతులు కంది పంటను సాగు చేశారు.
అనంతరం పంట ఎదుగుదల, రక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుతున్నారు. ఇటీవల మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కంది పంటకు ఎంతో మేలు చేకూర్చింది. కంది పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఏపుగా పెరిగిన మొక్కలతో కంది పొలాలు కళకళలాడుతున్నాయి. మండలంలోని 32 గ్రామాల్లో ఈ ఏడాది 1,280 హెక్టార్ల విస్తీర్ణంలో కంది పంటను సాగు చేశారు.
గత ఏడాది ఎంతో ఆశతో కంది పంటను సాగు చేసిన రైతులకు లద్దె పురుగు బెడదతో నష్టాలు వచ్చాయి. పంటలో 50 శాతం కంది పంట లద్దెపురుగు దాటికి గురైంది. దీంతో పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రైతులకు రాలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని కంది సాగు రైతులు పంట పొలాలను నిత్యం పరిశీలిస్తూ మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ఈ ఏడాది కూడా కందికి ఇప్పుడిప్పుడే లద్దెపురుగు ఆశిస్తోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లద్దె పురుగు బారి నుంచి పంటను రక్షించుకుంటే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.