ప్రమాదకరంగా మారిన మూలమలుపు వద్ద గుంత
రాయికోడ్: మండల కేంద్రమైన రాయికోడ్‌లో 190 మీటర్ల పొడవున నూతనంగా సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నిర్మాణం పనులు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నుంచి దారి మళ్లించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపం మీదుగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు మళ్లించారు.
బైపాస్ దారికి ఏ మాత్రం మరమ్మతులు చేయకుండానే వాహనాలను మళ్లించారు. ప్రస్తుతం వాహనాలను దారి మళ్లించిన మార్గంలోని పలు ప్రాంతాల్లో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ఏ మాత్రం ప్రయాణానికి పనికి రాకుండా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఎటు వైపు నుంచి నడపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మూలమలుపుల వద్ద ఆదివారం ఓ కారు ప్రమాదానికి గురైంది. పలువురు ద్విచక్ర వాహనదారులు మూలమలుపుల వద్ద ప్రమాదాలకు గురయ్యారు.
మహమ్మదాపూర్ ప్రధాన రహదారి సమీపంలో గల మూలమలుపు వద్ద పలు లారీలు గుంతల్లో ఇరుక్కుపోయాయి. వీటిని జేసీబీల ద్వారా బయటకు లాగడానికి రూ.వేలల్లో ఖర్చయినట్లు డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల జహీరాబాద్ డిపోకు చెందిన హైదారాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మూలమలుపు వద్ద అదుపు తప్పింది.
అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డాడు. నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ రహదారిని సక్రమంగా సిద్ధం చేయడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.